నా సందేహాలే నన్ను కాపాడుతుంటాయి!

వైవిధ్యభరితమైన థ్రిల్లర్‌ కథలతో అలరిస్తూ.. సినీప్రియుల్లో ప్రత్యేక ఆదరణ దక్కించుకున్నారు కథానాయకుడు అడివి శేష్‌. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఆయన.. ‘మేజర్‌’తో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు.

Updated : 02 Dec 2022 12:32 IST

వైవిధ్యభరితమైన థ్రిల్లర్‌ కథలతో అలరిస్తూ.. సినీప్రియుల్లో ప్రత్యేక ఆదరణ దక్కించుకున్నారు కథానాయకుడు అడివి శేష్‌. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఆయన.. ‘మేజర్‌’తో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘హిట్‌ 2’. శైలేష్‌ కొలను తెరకెక్కించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు అడివి శేష్‌.

హిట్‌ 2’ కోసం మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?

‘‘హిట్‌’ని విష్వక్‌ సేన్‌ చేశారు. ఈ రెండో భాగాన్నీ తొలుత ఆయనతోనే చేయాలనుకున్నారు. అందుకే ఈ కథతో నా దగ్గరకొచ్చినప్పుడు విష్వక్‌ ఫ్రాంచైజీని లాగేసుకోవడం నాకిష్టం లేదని చెప్పా. తర్వాత దర్శకుడు శైలేష్‌ ఈ ‘హిట్‌’ ఫ్రాంచైజీని అవెంజర్స్‌ తరహాలో ఓ యూనివర్స్‌లా రూపొందించనున్నట్లు చెప్పారు. దాంతో తన ఆలోచన బాగా నచ్చి ‘హిట్‌2’ చేసేందుకు ముందుకొచ్చా’’.

ఈ సినిమా చేసేటప్పుడు మీలోని నటుడితో పాటు రచయితకు కూడా ఏమన్నా పని చెప్పారా?

‘‘నా గత నాలుగైదు చిత్రాల విషయంలో నటుడిగానే కాక స్క్రిప్ట్స్‌ రూపకల్పనలోనూ నేను భాగమయ్యా. కానీ, ఈ సినిమా విషయంలో నేను నా నటన వరకే పరిమితమయ్యా. సృజనాత్మక అంశాల్లో దర్శకుడే అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి నేను కథ వినేటప్పుడే బోలెడన్ని డౌట్స్‌ అడుగుతుంటా. అలా సందేహాలు వ్యక్తం చేసినప్పుడే దానికి సమాధానాలు దొరకడంతో పాటు కథలోని అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంటుంది. అందుకే నా సందేహాలే నన్ను కాపాడుతుంటాయని నమ్ముతుంటా (నవ్వుతూ)’’.

‘హిట్‌1’కు.. ‘హిట్‌3’కి ఈ కథతో ఏమైనా సంబంధాలుంటాయా?

‘‘రెండు భాగాలకు సంబంధించిన కొన్ని అంశాలు ఈ కథలో అక్కడక్కడా టచ్‌ అవుతుంటాయి. అవన్నీ సందర్భానుసారంగా ఉంటాయే తప్ప ఎక్కడా ఇరికించినట్లుగా ఉండవు. ‘హిట్‌2’ ముగింపులోనే ‘హిట్‌3’ కథానాయకుడికి సంబంధించి ఓ స్పష్టత వస్తుంది’’.

‘మేజర్‌’తో పాన్‌ ఇండియా ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కథల ఎంపికలో ఏమైనా ఒత్తిడి పెరిగిందా?

‘‘ప్రత్యేకంగా ఒత్తిడి ఏం లేదు. ఎందుకంటే కథల విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. కొన్ని హిందీ కథలు తెలుగుకు సరిపడవు. అలాగే తెలుగు ప్రేక్షకులకు నచ్చినవి కొన్ని హిందీ వాళ్లకు నచ్చకపోవచ్చు. ఇలాంటి విషయాల్లో మనకు స్పష్టత ఉన్నప్పుడు ఏతరహా కథ ఎంచుకోవాలన్నది తేలికగా అర్థమైపోతుంది. కథల ఎంపికలో నా ఆలోచన ఎప్పుడూ ఒకటే.. నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకుల్ని బోర్‌ కొట్టించకూడదు. ఆద్యంతం వాళ్లను అలరించి థియేటర్‌ నుంచి బయటకు పంపాలనే అనుకుంటా’’.

కొత్త చిత్రాల విశేషాలేంటి?

‘‘అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రం చేస్తున్నా. అలాగే ఓ ఆస్కార్‌ సినిమాని తెలుగులో రీమేక్‌ చేయనున్నా. మాతృకను నిర్మించిన హాలీవుడ్‌ నిర్మాణ సంస్థే ఈ తెలుగు వెర్షన్‌ను నిర్మిస్తుంది. ఇది భారీ స్థాయిలో ఉండనుంది. ‘గూఢచారి-2’ కోసం కథ సిద్ధం చేస్తున్నా. మూల కథ కుదిరింది. దాన్ని పూర్తిస్థాయి స్క్రిప్ట్‌గా మలచాల్సి ఉంది’’.

కథ పరంగా ‘హిట్‌2’ విషయంలో మీలో ఆసక్తిరేకెత్తించిన అంశాలేంటి?

‘‘సాధారణంగా ఇలాంటి కథల్లో కిల్లర్‌ ఎవరు? అన్నది ఆసక్తి కలిగిస్తుంటుంది. కానీ, ఈ చిత్ర విషయంలో హత్యలు చేస్తున్న ఆ నేరస్థుడి వెనకున్న కథేంటి? తనెందుకు ఈ తరహాలో హత్యలకు పాల్పడుతున్నాడు? అన్నది చాలా ఆసక్తికరంగా అనిపించింది. తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా ఇదే తరహా అనుభూతికి లోనవుతారు. మామూలుగా క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలు హింసను ప్రోత్సహించే విధంగా ఉంటాయనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. కానీ, అది అవాస్తవం. ఈ చిత్రంలో మేమెక్కడా హింసను అతి చేసి చూపించలేదు. పైగా మహిళల కోణంలో చక్కటి భావోద్వేగాలుంటాయి. చెడుపై మంచి ఎప్పటికైనా విజయం సాధిస్తుందనే సందేశం ఉంటుంది’’.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని