Cinema News: సినీ ముచ్చట్లు.. కొత్త సినిమా విశేషాలు

‘రాధే’ తర్వాత సల్మాన్‌ఖాన్‌ నుంచి వస్తోన్న చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. కరోనా సమయంలో విడుదల కావడంతో ప్రేక్షకులు థియేటర్లలో చూడలేకపోయారు. దాంతో ‘కిసీ కా భాయ్‌...’ చిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Updated : 03 Dec 2022 09:06 IST

భాయ్‌ లుంగీ డ్యాన్స్‌

‘రాధే’ తర్వాత సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) నుంచి వస్తోన్న చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). కరోనా సమయంలో విడుదల కావడంతో ప్రేక్షకులు థియేటర్లలో చూడలేకపోయారు. దాంతో ‘కిసీ కా భాయ్‌...’ చిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. వచ్చే ఏడాది ఈద్‌ కానుకగా రానున్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు సల్మాన్‌ఖాన్‌. ఇటీవల సల్మాన్‌పై చిత్రీకరించిన పాట ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటలో సల్మాన్‌ లుంగీ ధరించి వేసిన స్టెప్పులు మాస్‌ని అలరిస్తాయని సమచారం. పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో వెంకటేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భూమిక, భాగ్యశ్రీలు కూడా సందడి చేయనున్నారు. ఈ సినిమా తర్వాత సల్మాన్‌ ‘టైగర్‌ 3’తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు.


పారిశుద్ధ్య కార్మికుల కష్టాలపై పోరు

ఆధునిక విధానాలు అందబాటులోకి వచ్చినప్పటికీ... నేటికీ మురుగు కాల్వలు శుభ్రం చేసే పనిలో ఎంతోమంది పేద కార్మికుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ సమస్యని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమే ‘విట్‌నెస్‌’ (Witness). శ్రద్ధా శ్రీనాథ్‌, రోహిణి, షణ్ముగరాజా, అజగం పెరుమాళ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఛాయాగ్రాహకుడు దీపక్‌ దర్శకత్వం వహించారు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. ఈ నెల 9న తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీ వేదిక ద్వారా రానుందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్రవర్గాలు మాట్లాడుతూ ‘‘పార్తిబన్‌ అనే కుర్రాడు ఓ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ని శుభ్రం చేస్తూ మరణిస్తాడు. ఆ కుర్రాడి మరణానంతరం అతని తల్లి ఇంద్రాణి న్యాయం కోసం పోరాడుతుంది. ఆ పోరాటంలో ఆమె గెలిచిందా లేదా అనేదే ఈ చిత్రకథ. పారిశుద్ధ్య కార్మికుల కష్టాల్ని కళ్లకు కట్టినట్టు చూపించామ’’ని తెలిపాయి.


కొత్త చిత్రానికి శ్రీకారం

కథానాయకుడు సాయితేజ్‌ (Saidharam Tej) నుంచి ఓ కొత్త కబురు వినిపించింది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని ద్వారా జయంత్‌ పానుగంటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయితేజ్‌ క్లాప్‌ కొట్టారు. నిర్మాత బాపినీడు భోగవల్లి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘సాయితేజ్‌తో మా సంస్థకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమా రూపొందించనున్నాం. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తాం’’ అన్నారు.


అన్యాయంపై పోరాటం

రామ్‌ తేజ్‌, గరిమ జంటగా అజయ్‌ కృష్ణ నల్ల (Ajay Krishna) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. పీవీఆర్‌ నిర్మాత. ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రతాని రామకృష్ణ గౌడ్‌ క్లాప్‌ కొట్టగా.. రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం చిత్ర దర్శకుడు అజయ్‌ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘మీడియా నేపథ్యంలో సాగే చిత్రమిది. సమాజంలో జరుగుతోన్న అన్యాయాలు, అక్రమాలను ఓ సామాన్య యువకుడు ఎలా ఎదుర్కొన్నాడన్నది చిత్ర కథాంశం. ఇందులో మంచి సందేశం ఉంది. త్వరలో చీరాలలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: రాజా, ఛాయాగ్రహణం: శబరినాథ్‌.


కథ వెనుక మరో కథ

విశ్వంత్‌ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్‌, శుభ శ్రీ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘కథ వెనుక కథ’ (Katha Venuka Katha). కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్నారు. దండమూడి అవనింద్ర కుమార్‌ నిర్మాత. సునీల్‌, అలీ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విశ్వంత్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ టైటిల్‌ వెనుక ఎన్నో కథలున్నాయి. ఈ సినిమాతో గట్టిగా కొట్టబోతున్నాం. దీని కోసం అందరం ఎంతో కష్టపడ్డాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో చాలా కథలుంటాయి. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ఇందులో నేను ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తా’’ అన్నారు నటుడు సునీల్‌. దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని ఇంత భారీ స్థాయిలో తీశామంటే దానికి కారణం నిర్మాత అందించిన సహకారమే’’ అన్నారు. ‘‘చాలా మంచి కథతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు నటుడు అలీ. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్‌, ఆర్పీ పట్నాయక్‌, రఘుబాబు, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని