సంక్షిప్త వార్తలు (6)

‘18 పేజీస్‌’ కోసం తమిళ కథానాయకుడు శింబు ఓ పాట ఆలపించారు. ‘టైం ఇవ్వు పిల్ల... కొంచెం టైం ఇవ్వు’ అంటూ సాగే ఆ పాటకి సంబంధించిన వీడియోని సోమవారం విడుదల చేశారు.

Updated : 06 Dec 2022 05:41 IST

కొంచెం టైం ఇవ్వు

‘18 పేజీస్‌’ కోసం తమిళ కథానాయకుడు శింబు ఓ పాట ఆలపించారు. ‘టైం ఇవ్వు పిల్ల... కొంచెం టైం ఇవ్వు’ అంటూ సాగే ఆ పాటకి సంబంధించిన వీడియోని సోమవారం విడుదల చేశారు. శ్రీమణి రచించిన ఈ గీతానికి, గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు. బ్రేకప్‌ అయిన బాధలో ప్రేమికుడు పాడుకునే పాట ఇదనీ చిత్రబృందం తెలిపింది. నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రమే... ‘18 పేజీస్‌’. సూర్యప్రతాప్‌ పల్నాటి దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కథని సమకూర్చారు. బన్నీ వాస్‌ నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రచార సందడిలో భాగంగా వరుసగా పాటల్ని విడుదల చేస్తున్నారు. ఇటీవలే ‘నన్నయ్య రాసిన...’ అనే పాటని విడుదల చేశారు.


త్వరలోనే విడుదల

కొత్త తరాన్ని తెరకు పరిచయం చేయడంలో ముందుంటారు దర్శకుడు తేజ. ఆయన దర్శకత్వంలో మరో కథానాయకుడు తెరకు పరిచయం అవుతున్నారు.  ఆయనే... అభిరామ్‌. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడే అభిరామ్‌. తేజ దర్శకత్వంలో అభిరామ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘అహింస’. ఆనంది ఆర్ట్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయిక. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు దర్శకుడు తేజ. సోమవారం కొత్త ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. ‘‘వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథల్ని ఆవిష్కరిస్తుంటారు తేజ. మరోసారి ఆయన ప్రేమ, యాక్షన్‌ కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం సినిమాకి మరింత ప్రత్యేకం కానుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. రజత్‌ బేడీ, సదా, రవి కాలే, కమల్‌ కామరాజు, మనోజ్‌ టైగర్‌, కల్పలత, దేవిప్రసాద్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సాహిత్యం: చంద్రబోస్‌, సంభాషణలు: అనిల్‌ అచ్చుగట్ల.


బెదురులంకలో చిత్ర

పేరు.. చిత్ర. సంప్రదాయం ఉట్టిపడే రూపం ఆమెది. సౌందర్యరాశిలాంటి ఆ అమ్మాయి పైకి కనిపించేంత సుకుమారమేమీ కాదు. లోపల చాలా పవర్‌ఫుల్‌. ఆమె గురించి మరింతగా తెలియాలంటే ‘బెదురులంక 2012’ చూడాల్సిందే. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా... లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. నేహాశెట్టి కథానాయిక. క్లాక్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బెన్నీ ముప్పానేని నిర్మాత. సోమవారం నేహాశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆమె లుక్‌ని విడుదల చేశారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘‘నటనకి ప్రాధాన్యమున్న పాత్రని పోషించారు నేహాశెట్టి. ఓ  ఊరి నేపథ్యంలో సాగుతుంది. చిత్రీకరణ పూర్తయింది. కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.


మీసాల మిస్టరీ కథ

ఆనంద్‌ రవి కథానాయకుడిగా శ్రీపతి కర్రి తెరకెక్కించిన చిత్రం ‘కొరమీను’. పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించారు. కిషోరి దత్రక్‌ కథానాయిక. శత్రు, హరీష్‌ ఉత్తమన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్‌ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో ‘‘తెలిసింది లే’’ గీతాన్ని విడుదల చేశారు. ఈ వేడుకకు దర్శకుడు వశిష్ఠ, గాయని సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో ఆనంద్‌ రవి మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా సినిమాల్లో మర్డర్‌ మిస్టరీ, కిడ్నాప్‌ మిస్టరీలు ఎక్కువ కనిపిస్తుంటాయి. కానీ, ఓ మనిషికి మీసాలు ఎవరు తీసేసుంటారనే కథ ఎక్కడా లేదు. కాబట్టి ఇదొక కొత్త జానర్‌ సినిమా అనొచ్చు. దీన్నొక మీసాల మిస్టరీ అనుకోవచ్చు. ఎందుకంటే కథ అక్కడి నుంచే పుట్టింది. పేదవాడికి, గొప్పవాడికి మధ్య జరిగే గొడవను సినిమాలో చూపించాం. చివరి ముప్పై నిమిషాలు చిత్రానికి చాలా కీలకం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సాయివర్మ, సమన్య, ఇమ్మాన్యుయేల్‌ తదితరులు పాల్గొన్నారు.


‘వీకెండ్‌ పార్టీ’లో ఏం జరిగింది?

అక్షిత్‌ అంగీరస, రమ్య రాజ్‌, రమ్య నాని, సిరి, బాహుబలి ప్రభాకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వీకెండ్‌ పార్టీ’. అమరేందర్‌ దర్శకుడు. బోయ చేతన్‌బాబు నిర్మించారు. సదా చంద్ర స్వరాలందించారు. ఈ చిత్ర పాటల్ని సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకకు చంద్రబోస్‌, సుచిత్ర చంద్రబోస్‌, కాసర్లశ్యామ్‌ తదితరులు హాజరయ్యారు. ‘‘90వ దశకంలో నాగార్జున సాగర్‌లో ఓ ఘటన జరిగింది. నలుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయిని రేప్‌ చేశారు. అదే ఘటనపై బోయ జంగయ్య ‘అడ్డ దారులు’ అనే నవల రాశారు. దాన్నే ఇప్పుడు ‘వీకెండ్‌ పార్టీ’గా నేటి పరిస్థితులకు తగ్గట్లుగా తెరకెక్కించాం’’ అన్నారు చిత్ర దర్శకుడు.


నయనానందం ‘కనెక్ట్‌’

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు