సంక్షిప్త వార్తలు (5)

హిందీ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ ఛత్రపతి శివాజీగా వీరత్వాన్ని ప్రదర్శించనున్న విషయం తెలిసిందే. మరాఠీ చిత్రం ‘వేదత్‌ మరాఠే వీర్‌ దౌడ్లే సాత్‌’లో శివాజీగా నటిస్తున్నారు.

Updated : 07 Dec 2022 06:00 IST

ప్రతి క్షణం.. సమరానికి సిద్ధం

షారుక్‌ఖాన్‌ కథానాయకుడిగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’. చిత్ర నిర్మాణసంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ మంగళవారం షారుక్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో.. చేతిలో పెద్ద గన్‌ పట్టుకొని, దాన్ని భుజంపై ఆనించి.. కరుకైన చూపులతో స్టైలిష్‌గా కనిపించారు షారుక్‌. ‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా సమరానికి సై అనేలా.. పఠాన్‌ చేతిలో షాట్‌గన్‌ ఆయుధం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అనే వ్యాఖ్యని పోస్టర్‌కి జోడించారు.


వినూత్నమైన సైంటిఫిక్‌ థ్రిల్లర్‌

సూర్య శ్రీనివాస్‌, షెర్రీ అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో ఎన్‌.శ్రీనివాసన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఎంతవారు గాని’. రాజశేఖర్‌ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో అడివి శేష్‌  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ బాగుంది. యువతరాన్ని ఆకర్షించే ఓ ఆసక్తికర అంశం ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘వినూత్నమైన సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.  


అంధుల కోసం ‘బ్లర్‌’ ప్రత్యేక పదర్శన

తాప్సి ద్విపాత్రాభినయం చేసిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘బ్లర్‌’. ఇందులో తను పాక్షిక అంధురాలిగా కనిపించనుంది. అజయ్‌ బహల్‌ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 9న రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాని అంధుల కోసం మంగళవారం ముంబయిలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. వాళ్లతో కలిసి తాప్సి, గుల్షన్‌ దేవయ్య, నిర్మాత విశాల్‌ రాణా సినిమాని వీక్షించారు. ‘ప్రత్యేకమైన ప్రేక్షకుల మధ్య ఉండి చిత్రాన్ని ఆస్వాదించడం గొప్పగా ఉంది’ అని నిర్మాత పేర్కొన్నారు.


పరిశ్రమకి మంచి రోజులొచ్చాయి

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమా తీయాలనుకునే సంకల్పం ఉన్నవాళ్లకి తప్పకుండా మంచి ఫలితాలు దక్కుతాయన్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన సంస్థ నుంచి విడుదలైన ‘మసూద’ విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రమిది. సాయికిరణ్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించారు. ఈ నెల 18న విడుదలైందీ చిత్రం. విజయోత్సవాన్ని పురస్కరించుకుని దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘‘మసూద’, ‘లవ్‌టుడే’, ‘హిట్‌2’ వరుసగా మూడు విజయాలు వచ్చాయి. పరిశ్రమకి మళ్లీ మంచి రోజులు వచ్చాయనిపిస్తోంది’’ అన్నారు.


నటనతో కట్టిపడేస్తాం

నటనతో కట్టిపడేసే ఓ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామన్నారు ప్రియ వడ్లమాని, అయేషాఖాన్‌. ఆ ఇద్దరూ కథానాయికలుగా నటించిన సినిమా ‘ముఖచిత్రం’. వికాస్‌ వశిష్ఠ కథానాయకుడు. సందీప్‌రాజ్‌ సమకూర్చిన కథ, స్క్రీన్‌ప్లేతో  గంగాధర్‌ తెరకెక్కించారు. ఈ శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కథానాయికలు మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.  ప్రియా వడ్లమాని మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకు ఐదు సినిమాల్లో నటించా. కథానాయికగానే కాకుండా, నటిగా నన్ను మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం అవుతుంది’’ అన్నారు. ఆయేషాఖాన్‌ మాట్లాడుతూ ‘‘జీవితంలో ఎలా ఉండాలో పూర్తి స్పష్టత ఉన్న అమ్మాయిగా, తను అనుకున్నది చేసే అమ్మాయిగా నేను కనిపిస్తా. నా అదృష్టం. సినిమాలో ప్రమాద సన్నివేశాలు ఉంటాయి, వాటిని చేసేటప్పుడు నేను కూడా గాయపడ్డాను. రెండునెలలు విరామం తీసుకుని చిత్రీకరణలో పాల్గొన్నా. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందనే నమ్మకం నాకుంది’’ అన్నారు.

 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని