సంక్షిప్త వార్తలు (5)

‘‘కొవిడ్‌ తర్వాత నుంచి ప్రేక్షకులు పెద్ద చిత్రాలను చూసేందుకే థియేటర్లకు వస్తున్నారని అంటున్నారు.

Updated : 08 Dec 2022 05:43 IST

భార్య ముఖం.. ప్రియురాలికి అమర్చితే!

‘‘కొవిడ్‌ తర్వాత నుంచి ప్రేక్షకులు పెద్ద చిత్రాలను చూసేందుకే థియేటర్లకు వస్తున్నారని అంటున్నారు. కానీ, దాన్ని మా ‘ముఖచిత్రం’ కచ్చితంగా బ్రేక్‌ చేస్తుందని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు దర్శకుడు సందీప్‌ రాజ్‌. ఆయన అందిస్తున్న కథతో గంగాధర్‌ తెరకెక్కించిన చిత్రమే ‘ముఖచిత్రం’. వికాస్‌ వశిష్ఠ, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్‌, అయేషా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. హీరో విష్వక్‌ సేన్‌ కీలక పాత్ర పోషించారు. ప్రదీప్‌ యాదవ్‌, మోహన్‌ యల్ల సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 9న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గంగాధర్‌ మాట్లాడుతూ.. ‘‘వాణిజ్య హంగులతో ఉంటూనే.. మంచి సందేశాన్నిచ్చే చిత్రమిది’’ అన్నారు. ‘‘ఒక ప్లాస్టిక్‌ సర్జన్‌ భార్య ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. అదే సమయంలో అతని మాజీ ప్రియురాలకీ ఓ ప్రమాదం జరుగుతుంది. తీవ్రంగా గాయపడిన ఆమెకు తన భార్య ముఖాన్ని అమర్చుతాడు ఆ సర్జన్‌. మరి ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మారింది.. అతనెలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు సందీప్‌ రాజ్‌.  


నచ్చుతుందని నమ్ముతున్నా

రంజిత్‌, సౌమ్య మేనన్‌ జంటగా రామకృష్ణ పరమహంస తెరకెక్కించిన చిత్రం ‘లెహరాయి’. మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మించారు. రావు రమేష్‌, నరేశ్‌, అలీ కీలక పాత్రలు పోషించారు. బెక్కెం వేణుగోపాల్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 9న విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. హీరో కార్తికేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం పెద్ద హిట్టవ్వాలి. ఇదెంతటి విజయాన్ని అందుకుంటే అంతమంది కొత్త వాళ్లు పరిశ్రమకు వస్తారు’’ అన్నారు. ‘‘ఓ మంచి కథతో తెరకెక్కిన చిత్రమిది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు హీరో రంజిత్‌. దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఆరు పాటలు విజయవంతమయ్యాయి’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమాకి కావాల్సిన అన్ని హంగులు ఈ చిత్రంలో ఉన్నాయి. డిసెంబరు 9న సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి’’ అన్నారు నిర్మాత శ్రీనివాస్‌.


కథ బాగుంటే ప్రచారం అక్కర్లేదు

‘కథ, కథనం బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మా ‘యాన్‌ యాక్షన్‌ హీరో’కి దక్కిన విజయంతో ఆ నమ్మకం కలుగుతోంది’ అన్నాడు బాలీవుడ్‌ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానా. కలర్‌ యెల్లో ప్రొడక్షన్‌, టీ సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి ఈ చిత్రాన్ని. అనిరుధ్‌ అయ్యర్‌ దర్శకుడు. సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న సందర్భంగా ఆయుష్మాన్‌ ఖురానా మాట్లాడుతూ ‘‘సినిమా బాగుంటే ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. నోటి ప్రచారం ద్వారానే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు. ‘యాన్‌ యాక్షన్‌ హీరో’తో అది నిరూపితమైంది. ఈ విజయంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా నా గత చిత్రాల ప్రయాణానికి పూర్తి భిన్నంగా ఉంది’’ అని చెప్పారు.


ప్రేమలో యాక్షన్‌

విజయ్‌, శ్రావ్య జంటగా రాజారెడ్డి పానుగంటి తెరకెక్కించిన చిత్రం ‘ఉత్తమ విలన్‌’. వి.సాయి లక్ష్మీనారాయణ గౌడ్‌, పి.శ్రవణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. హరీష్‌ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. దీనికి దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ బాగుంది. యాక్షన్‌తో కూడిన ఈ ప్రేమకథా చిత్రాన్ని దర్శక నిర్మాతలు చక్కగా రూపొందించారు’’ అన్నారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమా చక్కగా తెరకెక్కించా. ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు రాజారెడ్డి.


‘ఆక్రోశం’.. సందేశం

‘‘భావోద్వేగభరితంగా సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఆక్రోశం’. ఇందులో మంచి సందేశం ఉంది’’ అన్నారు అరుణ్‌ విజయ్‌. ఆయన కథానాయకుడిగా జి.యన్‌.కుమార వేలన్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సినం’. దీన్నే ‘ఆక్రోశం’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు ఆర్‌.విజయ్‌ కుమార్‌, సిహెచ్‌.సతీష్‌ కుమార్‌. పల్లక్‌ లల్వాని కథానాయిక. ఈ సినిమా డిసెంబరు 16న రానున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘ప్రస్తుత సమాజానికి అవసరమైన కొన్ని అంశాల్ని ఈ కథ ద్వారా  చెప్పారు దర్శకుడు’’ అన్నారు నిర్మాత సిహెచ్‌.సతీష్‌ కుమార్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని