సంక్షిప్త వార్తలు (6)

‘ధమాకా’తో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు రవితేజ. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు.

Updated : 09 Dec 2022 05:53 IST

దండ కడియాల్‌.. దస్తి రుమాల్‌

‘ధమాకా’తో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు రవితేజ. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా గురువారం ఈ సినిమా నుంచి ‘‘దండ కడియాల్‌.. దస్తి రుమాల్‌.. మస్తుగున్నోడంటివె పిల్లో’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు సమకూర్చడమే కాక సాహిత్యమందించి స్వయంగా ఆలపించారు. ఆయనతో పాటు సాహితీ చాగంటి, మంగ్లీ కూడా గొంతు కలిపారు. జానీ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. వినోదం నిండిన మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. కార్తీక్‌ ఘట్టమనేని ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.    


ట్రోల్స్‌ని ఆస్వాదిస్తుంటా

‘‘నటిగా కంటే కూడా... టెలివిజన్‌ కార్యక్రమాలతోనే నన్ను నేనుగా ఆవిష్కరించుకునే అవకాశం లభిస్తుంద’’ని చెప్పారు మంచు లక్ష్మి. అప్పుడప్పుడూ తెరపై మెరుస్తూ... టెలివిజన్‌ కార్యక్రమాలతోనూ సందడి చేస్తుంటారామె. ఇటీవల మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి ‘మాన్‌స్టర్‌’ సినిమాలో నటించారు. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ‘‘మంజు దుర్గ అనే ఓ మంచి పాత్రని చేశా. మలయాళంలో నటిస్తున్నప్పుడు భాష పరంగా ఇబ్బందుల్ని ఎదుర్కున్నా. వాళ్ల సంభాషణలు పొడవుగా ఉంటాయి. ఆ భాషని, పాత్రని అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. మోహన్‌లాల్‌తో ఏడాదికి ఒక సినిమాలోనైనా నటించాలని ఉంది. ఆ విషయం ఆయనతో కూడా చెప్పా’’ అన్నారు. తనపై సామాజిక అనుసంధాన వేదికల్లో వచ్చే ట్రోల్స్‌ని, తనపై మీమ్స్‌ని ఆస్వాదిస్తుంటానని చెప్పారు లక్ష్మి. ‌్రప్రస్తుతం ‘గాంబ్లర్‌’, ‘లేచింది మహిళాలోకం’, ‘అగ్నినక్షత్రం’ సినిమాల్లో నటిస్తున్నట్టు పేర్కొన్నారు.


ఆ చిత్రం ఆగిపోయిందా?

కమల్‌హాసన్‌ జోరుగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు పలు చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వాటిలో ఒకటి మహేష్‌ నారాయణ్‌తో చేయాల్సిన సినిమా. ‘తేవర్‌ మగన్‌’కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సన్నాహాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్లు తమిళవర్గాల సమాచారం. సృజనాత్మక భేదాల కారణంగా ఇరువురి ఇష్ట ప్రకారమే ఈ సినిమాని నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ నెలాఖరులో సెట్స్‌పైకి వెళ్లాలి. ఎడిటర్‌, దర్శకుడు అయిన మహేష్‌ నారాయణ్‌ గతంలో కమల్‌ నటించిన ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం 2’ చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు.


‘డెవిల్‌’ కోసం కారైకుడీకి

కల్యాణ్‌రామ్‌ విజయోత్సాహంలో ఉన్నారు. ‘బింబిసార’తో అలరించిన ఆయన, ప్రస్తుతం ‘అమిగోస్‌’, ‘డెవిల్‌’ చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ‘డెవిల్‌’ కోసం శారీరకంగా ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నట్టు ఇటీవలే ట్విటర్‌ ద్వారా ప్రకటించారు కల్యాణ్‌రామ్‌. ఆ సినిమా చిత్రీకరణ కోసమే తమిళనాడులోని కారైకుడి బయల్దేరి వెళ్లారు. 20 రోజులపాటు అక్కడ చిత్రీకరణ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. పీరియాడికల్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌, బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. నవీన్‌ మేడారం దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు.


‘పారసైట్‌’ దర్శకుడి చిత్రం ఆరోజే

‘ది ట్విలైట్‌ సాగా’, ‘బ్యాట్‌మన్‌’ చిత్రాల కథానాయకుడు రాబర్ట్‌ ప్యాటిన్సన్‌. ‘పారసైట్‌’ దర్శకుడు బాంగ్‌ జూన్‌ హో. ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న ప్రాజెక్టు ‘మిక్కీ 17’. ఎడ్వర్డ్‌ ఆస్టన్‌ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. హాలీవుడ్‌, దక్షిణకొరియా సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇది మార్చి 29, 2024న థియేటర్లలోకి వస్తుందని సినీవర్గాలు ప్రకటించాయి. ప్లాన్‌ బీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కేట్‌ స్ట్రీట్‌ పిక్చర్‌ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్‌ నామినీ.. డేరియస్‌ ఖోండ్జీ ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


ప్రీ రిలీజ్‌ హంగామా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని