సంక్షిప్త వార్తలు(4)

మోహన్‌బాబు, లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రధారులుగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. సముద్రఖని, విశ్వంత్‌, చిత్ర శుక్లా, మలయాళ నటుడు సిద్ధిక్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Published : 26 Jan 2023 01:55 IST

అగ్ని నక్షత్రం పోరాటం

మోహన్‌బాబు, లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రధారులుగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. సముద్రఖని, విశ్వంత్‌, చిత్ర శుక్లా, మలయాళ నటుడు సిద్ధిక్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వం  వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని సినీ వర్గాలు తెలిపాయి. ‘‘తండ్రీ తనయలు మోహన్‌బాబు, లక్ష్మీప్రసన్న తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూ  ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టే ఓ మంచి థ్రిల్లర్‌ కథతో తెరకెక్కించా. పోరాట ఘట్టాలు ఆకట్టుకునేలా ఉంటాయ’’ని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, ఛాయాగ్రహణం: గోకుల్‌ భారతి, కూర్పు: మధు రెడ్డి.


రవీనా.. నటనా ప్రవీణ

రవీనాటాండన్‌...హిందీ చిత్రసీమలో తన అందం, నటనతో అలరించిన కథానాయిక. ఇప్పటి తరానికి రవీనా అంటే ఎవరో తెలియాలంటే దేశవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన ‘కేజీఎఫ్‌ 2’లో ప్రధానమంత్రి రమికా సేన్‌ పాత్రే చెబుతోంది. అందులో ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘పత్తర్‌ కే ఫూల్‌’ చిత్రంతో నటిగా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె ‘దిల్‌వాలే’, మోహ్రా, ‘ఖిలాడియోం కా ఖిలాడీ’, ‘జిద్దీ’ తదితర చిత్రాలతో కమర్షియల్‌ కథానాయిగా సత్తా చాటింది. 2001లో వచ్చిన ‘దమన్‌’ చిత్రంలో దుర్గ పాత్రలో అద్భుతంగా నటించి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకున్నారామె. ఆమె తండ్రి రవి టాండన్‌ దర్శకుడు, నిర్మాత అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ప్రశంసలు అందుకున్నారు రవీనా. సినిమాలతో పాటు పలు టీవీ షోలతో అలరించిన ఆమె గత ఏడాది ‘అరణ్యక్‌’ వెబ్‌సిరీస్‌తో అలరించారు. తన నటనకు ఇప్పటికే పలు పురస్కారాలు అందుకున్న ఆమె కీర్తి కిరీటంలో తాజాగా ‘పద్మశ్రీ’ పురస్కారం చేరింది.


దసరా టీజర్‌ ఆరోజే

వేసవి బరిలో ‘దసరా’తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు నాని. ఆయన హీరోగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్‌ కథానాయిక. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 30న చిత్ర టీజర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.


స్వాతంత్య్ర వీరుల గొప్పతనాన్ని చాటే చిత్రం

రవీంద్ర గోపాల ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దేశం కోసం భగత్‌సింగ్‌’. రాఘవ, మనోహర్‌, జీవా, సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్ర పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇది దేశం కోసం చేసిన సినిమా. స్వాతంత్య్ర సమరయోధుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలపాలన్న తపనతో రవీంద్ర ఈ చిత్రం చేశారు. ఆయన ఇందులో ఏకంగా 14మంది స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలు వేశారు. తనపై తనకు ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఈ సినిమాలో పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఒక మంచి సినిమా చేయాలన్న కసితో తీసిన చిత్రమిది. దీన్ని ఫిబ్రవరి 3న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నటుడు, దర్శక నిర్మాత రవీంద్ర. ఈ కార్యక్రమంలో ప్రమోద్‌ కుమార్‌, దామోదర్‌ ప్రసాద్‌, ప్రసన్న కుమార్‌, మోహన్‌ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు