Jamuna: మీరజాలగలడా.. నా యానతి

పాటల్లో చిరుకోపంతో మూతి విరుపులు ప్రదర్శించడంలో, పన్ను మీద పన్ను కనిపించేలా అందంగా నవ్వడంలో తనకు తనే సాటి జమున (Jamuna). అగ్రనటులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతో మొదలై హీరో కృష్ణ, శోభన్‌బాబుల దాకా ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటల్లో జమున చక్కటి అభినయం కనబరచి ఆ పాటలను ఇప్పటికీ గుర్తుండేలా చేశారు.

Updated : 28 Jan 2023 06:55 IST

పాటల్లో చిరుకోపంతో మూతి విరుపులు ప్రదర్శించడంలో, పన్ను మీద పన్ను కనిపించేలా అందంగా నవ్వడంలో తనకు తనే సాటి జమున (Jamuna). అగ్రనటులు ఎన్టీఆర్‌ (NTR), ఏఎన్నార్‌(ANR)లతో మొదలై హీరో కృష్ణ, శోభన్‌బాబుల దాకా ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటల్లో జమున చక్కటి అభినయం కనబరచి ఆ పాటలను ఇప్పటికీ గుర్తుండేలా చేశారు.

త్యభామగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన జమున నటించిన ‘లేత మనసులు’ సినిమాలోని ‘హల్లో మేడం.. సత్యభామా! పైన కోపం, లోన ప్రేమ’ పాట పెద్ద హిట్‌ అయ్యింది.

* ఎన్టీఆర్‌తో చేసిన ‘నీ మది చల్లగా.. స్వామీ నిదురపో’ (ధనమా? దైవమా?), ‘మెరిసే మేఘమాలికా! ఉరుములు చాలు చాలిక’ (దీక్ష), ‘బృందావనమది అందరిదీ.. గోవిందుడు అందరివాడేలే’ (మిస్సమ్మ), ‘నీ రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను’ (మంగమ్మశపథం) లాంటి పాటలు నేటికీ అలరిస్తాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన తొలిచిత్రం ‘రాముడు-భీముడు’లోని ‘తెలిసిందిలే.. తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే’ పాట ప్రేక్షకాదరణ పొందింది. ఇంకా ‘తోటలో నా రాజు తొంగిచూసెను నాడు’ (ఏకవీర), ‘పచ్చనిచెట్టూ ఒకటీ.. వెచ్చని చిలుకలు రెండూ’ (రాము) లాంటి గీతాలు మనసుకు హాయినిస్తాయి. ‘గులేబకావళి కథ’లో ‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసానీ!’ పాటలో ఎన్టీఆర్‌, జమునల నటన, అందచందాలు పోటాపోటీగా ఉంటాయి. ‘శ్రీకృష్ణ తులాభారం’లో ప్రియ నాథుడిపై ఆధిపత్యం చూపుతూ ‘మీరజాలగలడా.. నా యానతి’ అంటూ సాగే పాట జమునకు సిగ్నేచర్‌ సాంగ్‌గా నిలిచింది.

* ‘పగలే వెన్నెల.. జగమే ఊయల’ పాట ఏఎన్నాఆర్‌, జమునల చిత్రం ‘పూజాఫలం’కు ఆయువుపట్టుగా చెప్పవచ్చు. వీరిద్దరి కాంబినేషనులో ‘ప్రేమయాత్రలకు బృందావనమూ, నందనవనమూ ఏలనో’ (గుండమ్మకథ), ‘నిలువవే వాలుకనులదానా’ (ఇల్లరికం), ‘గౌరమ్మా! నీ మొగుడెవరమ్మా!’ (మూగమనసులు), ‘బులిబులి ఎర్రని బుగ్గలదానా.. చెంపకు చారెడు కన్నులదానా’ (శ్రీమంతుడు) లాంటి ఎన్నో సూపర్‌హిట్‌ పాటలు వచ్చాయి. ‘మూగనోము’ చిత్రంలోని ‘ఈవేళ నాలో ఎందుకో ఆశలు’ పాట ఎవర్‌గ్రీన్‌ హిట్‌. 

* కృష్ణతో కలిసి నటించిన చిత్రాల్లోనూ ‘చందమామ రమ్మంది చూడు’ (అమాయకుడు), ‘అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది’ (ఉండమ్మా! బొట్టు పెడతా), ‘మనసా! కవ్వించకే నన్నిలా’ (పండంటికాపురం) లాంటి చక్కటి పాటల్లో జమున గుర్తుండిపోతారు. ‘బొబ్బిలియుద్ధం’లో ‘అందాల రాణివే! నీవెంత జాణవే’ పాటలో జమున హావభావాలు చూసి తీరాల్సిందే. శోభన్‌బాబుతో జంటగా నటించిన చిత్రాల్లో ‘నీకున్నది నేనని.. నాకున్నది నీవని’ (తహసిల్దారుగారి అమ్మాయి) చెప్పుకోదగ్గ పాట.

* ఆధ్యాత్మిక గీతాల్లో తన్మయత్వంతో నటించేవారు జమున. ‘నీవుండేదా కొండపై నా స్వామీ! నేనుండేదీ నేలపై’ (భాగ్యరేఖ), ‘హిమగిరి మందిరా!.. గిరిజా సుందరా!’ (సతీ అనసూయ), ‘శరణన్నవారిని కరుణించే తిరుమలవాసా!’ (పవిత్ర హృదయాలు) లాంటి పాటలు ఆ కోవకు చెందినవే. పది కాలాలపాటు దాచుకోదగిన పాటల సత్యభామగా తెలుగు శ్రోతల హృదయాల్లో జమున నిలిచిపోతారు.

* ‘గోదారి గట్టుంది.. గట్టు మీన సెట్టుంది’ అంటూ ‘మూగమనసులు’లో జమున చేసిన అల్లరి మరచిపోలేము. జమున, హరనాథ్‌ జంటకు ఆరోజుల్లో గొప్ప ఆదరణ ఉండేది. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాల్లోని ‘అందాల ఓ చిలుకా!.. అందుకో నా లేఖ’ (లేత మనసులు), ‘నా మాట నమ్మితివేల’ (నాదీ ఆడజన్మే) పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని