క్లైమాక్స్‌ చిత్రీకరణలో గాయాలపాలయ్యా

‘‘సహజత్వం నిండిన చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అలాంటి సినిమాల్లోనే ఎక్కువ నటించాలి అనుకుంటున్నా’’ అన్నారు సూర్య వశిష్ఠ. ‘బుట్టబొమ్మ’తో తెరకు పరిచయమవుతున్న కొత్త కథానాయకుడాయన. శౌరి చంద్రశేఖర్‌ తెరకెక్కించారు.

Updated : 03 Feb 2023 05:28 IST

‘‘సహజత్వం నిండిన చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అలాంటి సినిమాల్లోనే ఎక్కువ నటించాలి అనుకుంటున్నా’’ అన్నారు సూర్య వశిష్ఠ. ‘బుట్టబొమ్మ’తో తెరకు పరిచయమవుతున్న కొత్త కథానాయకుడాయన. శౌరి చంద్రశేఖర్‌ తెరకెక్కించారు. అనిక సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సూర్య వశిష్ఠ.

‘‘ఇది హీరోగా నా తొలి చిత్రం. ఈ సినిమా మొదలు కావడానికి ముందే దీని మాతృకైన ‘కప్పెల’ చూశా. నాకు చాలా నచ్చింది. అందుకే ఈ చిత్రంలో అవకాశం రాగానే చాలా సంతోషంగా అనిపించింది. ఇందులో నేను మురళీ అనే ఆటోడ్రైవర్‌ పాత్రలో కనిపిస్తా. అది చాలా కొత్తగా, ఆకట్టుకునేలా ఉంటుంది. మాతృకతో పోల్చితే ఈ సినిమా చాలా కొత్తగా.. తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది. దర్శకుడు రమేష్‌ ప్రతి సన్నివేశంపైనా చాలా వర్క్‌ చేసేవారు. మంచి అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎన్ని టేక్‌లైనా తీసుకుంటారు. దాంతో ముఖంలో ఆ అలసట కనిపించకుండా నటించాల్సి రావడం సవాల్‌గా అనిపించేది. ఈ చిత్ర క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో గాయాలపాలై ఆస్పత్రిలో చేరాను’’.  

నాన్న కోరిక ఇది..

‘‘మా నాన్న పేరు సత్యం. 30ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. రాఘవేంద్రరావు, రాజమౌళి, త్రివిక్రమ్‌ల వద్ద కోడైరెక్టర్‌గా పని చేశారు. నన్ను నటుడిగా చూడాలనేది ఆయన కోరిక. నాకూ చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. అయితే ముందుగా ప్రపంచాన్ని, మనుషుల్ని అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నత చదువుల కోసం నన్ను అమెరికా పంపారు. ఐదేళ్లు అక్కడే ఉండి.. ఆ తర్వాత వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాను. నేను హీరోగానే చేయాలని ఏమీ అనుకోవట్లేదు. కథ, పాత్ర బాగుంటే... ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే. రాజమౌళి, త్రివిక్రమ్‌ల సినిమాల్లో పని చేయాలని ఉంది’’.

ఏడాది బయటకు రాలేదు..

‘‘మా నాన్న ఓసారి ‘కప్పేల’ చిత్రం చూపించి.. ఇందులోని ఆటో డ్రైవర్‌ పాత్ర నీకు బాగుంటుందని చెప్పారు. తర్వాత ఆ చిత్ర రీమేక్‌ రైట్స్‌ను సితార వాళ్లు తీసుకోవడంతో.. ‘మా వాళ్లే తీసుకున్నార’ని నాన్న సంతోషించారు. కానీ, అప్పటికే ఆ పాత్రకు సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్‌ సేన్‌ లాంటి హీరోలు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఆ అవకాశం రాదనుకున్నాం. ఈలోపు అనుకోకుండా నాన్న కొవిడ్‌తో కన్నుమూశారు. దీంతో ఆ బాధలో నేను ఏడాది పాటు బయటకు రాలేదు. తర్వాత ఓసారి త్రివిక్రమ్‌ను కలిస్తే.. ఆయన సూచన మేరకు సితారలో ఆడిషన్‌ ఇచ్చాను. అలా ‘బుట్టబొమ్మ’ చిత్రానికి ఎంపికయ్యాను’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని