Sankarabharanam: సినిమాలకు ఆభరణం... శంకరాభరణం

విశ్వనాథ్‌ చిత్రాలన్నీ విలక్షణమైనవే అయినా వాటిలో శంకరాభరణం గురించి మొదటగా చెప్పుకోవాలి. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సినిమాను చూస్తే మనవైన సంగీత, సాహిత్య, నృత్య కళలపై గౌరవం ఉప్పొంగి, గర్వం పెల్లుబుకుతుంది.

Updated : 03 Feb 2023 08:58 IST

విశ్వనాథ్‌ చిత్రాలన్నీ విలక్షణమైనవే అయినా వాటిలో శంకరాభరణం గురించి మొదటగా చెప్పుకోవాలి. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సినిమాను చూస్తే మనవైన సంగీత, సాహిత్య, నృత్య కళలపై గౌరవం ఉప్పొంగి, గర్వం పెల్లుబుకుతుంది.

విశ్వనాథ్‌ అభిమానిగా తనను తాను చెప్పుకొనే దర్శకుడు బాపు ఓ సందర్భంలో చెప్పిన ముచ్చటను ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
శంకరాభరణాన్ని ఎనభైఏడో సారి చూడ్డానికి బాపు ఓ థియేటర్‌కి వెళ్లార్ట. విరామ సమయంలో ఇద్దరు కాన్వెంటు అమ్మాయిలు పరుగున వచ్చి ఆటోగ్రాఫ్‌ అడిగార్ట. పెన్ను లేదమ్మా అంటే ఓ అమ్మాయి కంపాస్‌ బాక్స్‌ తెరిచి అందులోని పెన్సిల్‌ ఇచ్చిందిట. బాపు సంతకాన్ని చూశాక ఓ అమ్మాయి ‘మీరు విశ్వనాథ్‌ కారా?’ అని అడిగింది. కాదని బాపు చెబితే, ఆ పిల్ల రెండో అమ్మాయితో, ‘ఆ కంపాస్‌ బాక్స్‌లో రబ్బర్‌ ఇలా ఇవ్వవే’ అంటూ వెళ్లిపోయిందట. అదీ... అప్పట్లో శంకరాభరణం పిల్లలపై సైతం కలిగించిన ప్రభావం! 1980లో ఆ సినిమా వచ్చినప్పుడు అప్పటి యువతీ యువకులు ఆ సినిమాను పదే పదే చూడ్డం ఉత్తమాభిరుచికి నిదర్శనంగా భావించారు. సినిమా హాళ్లలోంచి బయటకి వస్తూ ‘దీన్ని నేను చూడ్డం తొమ్మిదో సారి’ అనో పదో సారి అనో చెప్పడాన్ని గర్వంగా అనుకున్నారు. ఇక పెద్దలైతే ఆ సినిమా ఆడినంత కాలం వీలున్నప్పుడల్లా ఏదో గుడికి వెళ్లినంత పవిత్రంగా థియేటర్లకు వెళ్లి పదేపదే చూశారు.

వ్యాపారాత్మక సూత్రాలను పట్టుకుని వేలాడే చాలా సినిమాల్లో ఉండే అంశాలు ఏమున్నాయని శంకరాభరణంలో?

హీరో స్టారా... కాదు!

హీరోయిన్‌ అందాల తారా... కాదు!

ఫైటింగులు అదిరిపోయాయా... అసలు లేనేలేవు!

ఓ వయసు మళ్లిన సంగీత కళాకారుడికి, ఓ నృత్య కళాకారిణికి ఏర్పడిన అనుబంధంతో అల్లుకున్న కథ...

పాటలు చూస్తే సంగీత కచేరీకి వెళ్లినట్టు ఉంటాయి...

నృత్యాలన్నీ ఏ కళాక్షేత్రంలోనో సంప్రదాయ ప్రదర్శనకు వెళ్లినట్టు అనిపిస్తాయి...

మరేముంది ఆ సినిమాలో?

ప్రేక్షకులను కట్టిపడేసే కథనం ఉంది!

నిద్రాణమైన కళాభిరుచిని తట్టిలేపే మాయాజాలం ఉంది!

పాశ్చాత్య సంగీత పెనుతుపాను తాకిడికి రెపరెపలాడిపోతున్న సత్సంప్రదాయ సంగీత జ్యోతిని చేతులొడ్డి కాపాడుకోవాలనే సంకల్పాన్ని కలిగించే అద్భుతమైన దృశ్య పరంపర ఉంది. అందుకే అది జాతీయ అవార్డును గెలుచుకోవడమే కాదు, 1981లో ఫ్రాన్స్‌లో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రేక్షకుల ప్రత్యేక అవార్డును కూడా అందుకుంది. అన్నింటికన్నా తెలుగు సినీ అభిమానులు గర్వంగా చెప్పుకోగలిగే ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని