సంక్షిప్త వార్తలు(6)

‘లైగర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్‌ అందం అనన్యా పాండే. ఇప్పుడు ఆమె నుంచి ఓ సైబర్‌ థ్రిల్లర్‌ చిత్రం రాబోతుంది. నికిల్‌ అడ్వాణీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 07 Feb 2023 02:13 IST

సైబర్‌ కథలో అనన్య పాండే

‘లైగర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్‌ అందం అనన్యా పాండే. ఇప్పుడు ఆమె నుంచి ఓ సైబర్‌ థ్రిల్లర్‌ చిత్రం రాబోతుంది. నికిల్‌ అడ్వాణీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి అనన్యా మాట్లాడుతూ ‘‘దర్శకుడు ఈ కథ చెప్పగానే అందులో భాగం కావాలనిపించింది. ఆయన లాంటి మంచి దర్శకుడితో కెరీర్‌ తొలినాళ్లలోనే పనిచేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది’’అని చెప్పింది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ‘ఉడాన్‌’, ‘లూటెరా’, ఏకే వర్సెస్‌ ఏకే’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు విక్రమాదిత్య. ‘‘నేటి ఆధునిక ప్రపంచానికి సరిగ్గా సరిపోయే కథ ఇది. ఇందులో సరికొత్త అనన్యను చూస్తారు’’అని చెప్పారు విక్రమాదిత్య.


భారతీయ సంగీత దర్శకుడికి గ్రామీ అవార్డు

భారతీయ సంగీత దర్శకుడు రికీ కేజ్‌ గ్రామీ అవార్డుని గెలుచుకున్నారు. ఆయన స్వరపరిచిన ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు దక్కింది. ఆల్బమ్‌లో కేజ్‌తో కలిసి పనిచేసిన రాక్‌ లెజెండ్‌ స్టీవర్ట్‌ కోప్‌ల్యాండ్‌తో కలిసి ఈ అవార్డును గెలుచుకున్నారు. వీరు 65వ వార్షిక గ్రామీ అవార్డ్స్‌లో ఉత్తమ ఇమ్మెర్సివ్‌ ఆడియో ఆల్బమ్‌ విజేతగా గ్రామోఫోన్‌ ట్రోఫిని పొందారు. డివైన్‌ టైడ్స్‌ ఆల్బమ్‌లో మొత్తం 9 పాటలున్నాయి. కేజ్‌ 2015లో ‘విండ్స్‌ ఆఫ్‌ సంసార’కు మొదటి గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు. కోప్‌ల్యాండ్‌ ఐదు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు. బెంగళూరుకి చెందిన రికీ ఈ పురస్కారం అందుకోవడం పట్ల పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మూడోసారి ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డుని భారతదేశానికి అంకితం ఇస్తున్నాను’’అని ట్వీట్‌ చేశారు రికీ. మూడుసార్లు గ్రామీ అవార్డు అందుకున్న భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు.


మరోసారి రుజువైంది

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్‌ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సిందూరం’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా విజయోత్సవ వేడుకలో ఇలా కంటెంట్‌ ఉన్న సినిమాలు ఇంకా మరెన్నో రావాలని నటుడు శివబాలాజీ మాట్లాడారు. కంటెంట్‌ ఉన్న సినిమాని ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారని నిర్మాత జంగా ప్రవీణ్‌ రెడ్డి అన్నారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి మా టీం తరపున ధన్యవాదాలు అని దర్శకుడు అన్నారు.


కవలలు హీరోలుగా సినిమా

వలలు రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా టి.శ్రీనివాస్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘ఓ సరికొత్త కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా మా పిల్లల్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. కార్యక్రమంలో బద్రీ, కుప్పిలి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


క్రికెట్‌.. తీవ్రవాదం కలిసి

విశ్వ కార్తికేయ, నితిన్‌ నాష్‌, అవంతిక, అర్చన గౌతమ్‌ నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘ఐపిఎల్‌’. సురేష్‌ లంకలపల్లి తెరకెక్కించారు. బీరం శ్రీనివాస్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘క్రికెట్‌ను, తీవ్రవాదాన్ని మిళితం చేసి దర్శకుడు సురేష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోలూ ఎంతో కష్టపడ్డారు. అందరూ చూసి ఆశీర్వదించండి’’ అన్నారు దర్శకుడు.  


జానపద ‘జాజిమొగులాలి’

జయ్‌ సామ్రాట్‌ తెరకెక్కించిన చిత్రం ‘రుద్రంగి’. నిర్మాత రసమయి బాలకిషన్‌ భారీ హంగులతో రసమయి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మోహన భోగరాజు పాడిన ‘జాజిమొగులాలి’ అంటూ సాగే జానపద గీతాన్ని విడుదల చేశారు. ఈ ప్రత్యేక గీతంలో దివి ఆకట్టుకునేలా డ్యాన్స్‌ చేసిందని చిత్రవర్గాలు తెలిపాయి. భాను మాస్టర్‌ నృత్య దర్శకత్వం వహించిన ఈ పాటకి అభినయ శ్రీనివాస్‌ సాహిత్యం అందించారు. నాఫల్‌రాజా స్వరాలు అందించిన  ఈ గీతం తెలంగాణ యాసలో సాగనుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, ఆశిష్‌ గాంధీ, గానవి లక్ష్మణ్‌, విమలా రామన్‌, మమతా మోహన్‌దాస్‌, కాలకేయ ప్రభాకర్‌, తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు