విద్యను ప్రైవేట్‌ పరం కానీయొద్దు

‘‘చిత్రసీమలో కళా దర్శకులున్నారు. వ్యాపారాత్మక దర్శకులున్నారు. కానీ, ప్రజా దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి ఒక్కరే’’ అన్నారు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం.

Published : 07 Feb 2023 01:27 IST

ఆర్‌.నారాయణమూర్తి

‘‘చిత్రసీమలో కళా దర్శకులున్నారు. వ్యాపారాత్మక దర్శకులున్నారు. కానీ, ప్రజా దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి ఒక్కరే’’ అన్నారు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం. ఆయన సోమవారం హైదరాబాద్‌లో ‘యూనివర్సిటీ’ చిత్ర టైటిల్‌ లోగోను విడుదల చేశారు. ఆర్‌.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బ్రహ్మానందం ఈ చిత్ర టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘నారాయణమూర్తి అరుదైన వ్యక్తి. ఆయనకు తెలిసింది సినిమానే. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే మంచి మనసున్న వ్యక్తి. నా దృష్టిలో ఆయనొక స్వచ్ఛమైన గడ్డి పువ్వు. విద్యా వ్యవస్థ నేపథ్యంలో ఈ చిత్రం తీశారు. మా రోజుల్లో ఉన్న చదువు ఇప్పుడు లేదు. అలాగే గురువుకు అప్పుడున్న గౌరవం ఇప్పుడు లేదు. ప్రస్తుతం చదువుకునే రోజులు పోయి.. చదువు కొనే రోజులొచ్చాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. ఈ నేపథ్యంతోనే నారాయణమూర్తి ఈ చిత్రం తీశారు. కచ్చితంగా ఈ ‘యూనివర్సిటీ’ని అందరూ తప్పక చూడండి’’ అన్నారు. నటుడు, దర్శక నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘‘ఇది నా 30వ చిత్రం. భారత దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో తీశాను. అలాగే ద్వితీయార్ధంలో నిరుద్యోగుల సమస్యల్ని చర్చించాను. మన దేశంలో విద్య, వైద్యం సేవా రంగాలని రాజ్యాంగం చెబుతోంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఈ రెండు రంగాల్ని ప్రైవేట్‌ పరంగా కాకుండా స్వయంగా నిర్వహించాలి. విద్యార్థులను కుల మత భేదం లేకుండా ప్రోత్సహించాలి. ముఖ్యంగా విద్యను ప్రైవేట్‌ పరం కానీయకుండా చూడాలి. ఇలాంటి అంశాలన్నింటినీ ఈ సినిమాలో ప్రస్తావించాను. ప్రధాని నరేంద్ర మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని