Balakrishna: సినీ వారసత్వాన్ని కొనసాగించడం పెద్ద బాధ్యత

‘‘సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమన్నది చాలా పెద్ద బాధ్యత. దాన్ని మోయాలంటే ఎంతో రాటుదేలాలి.

Updated : 08 Feb 2023 15:49 IST

బాలకృష్ణ

‘‘సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమన్నది చాలా పెద్ద బాధ్యత. దాన్ని మోయాలంటే ఎంతో రాటుదేలాలి. ఆ వారసత్వాన్ని ఓ బాధ్యతగా ముందుకు తీసుకెళ్తూనే నటుడిగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పుడే ఆ నట జీవితానికి ఓ అర్థం ఉంటుంది’’ అన్నారు కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna). ఆయన మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘వేద’ (Veda) విడుదల ముందస్తు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శివ రాజ్‌కుమార్‌ (Shiva Rajkumar) హీరోగా హర్ష తెరకెక్కించిన చిత్రమిది. గీతా శివ రాజ్‌కుమార్‌ నిర్మించారు. ఘనవి లక్ష్మణ్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘శివ రాజ్‌కుమార్‌ నాకు సోదరుడు. ఆయన సొంత బ్యానర్‌లో తన భార్యను నిర్మాతగా పరిచయం చేస్తూ ఈ చిత్రం చేశారు. అందుకు ఆయన్ని అభినందించాలి. శివ చేసిన ‘మఫ్టీ’ చూశా. చాలా నచ్చింది. తను అందులో చేసిన పాత్రను చూసే ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) పాత్రను తీర్చిదిద్దాం. ఈ చిత్ర ట్రైలర్‌ చూశా. చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు సినిమాని అద్భుతంగా తీశారు. అర్జున్‌జన్య మంచి పాటలిచ్చారు. నాయికలు ఘనవి, అదితి చక్కటి నటనను కనబర్చారు. కన్నడలో లాగే తెలుగులోనూ ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉంది’’ అన్నారు. హీరో శివ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా మంచి సినిమా. ఇందులో మంచి సందేశం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇప్పటికే కన్నడలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు వారికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘యాక్షన్‌తో కూడిన భావోద్వేగభరితమైన చిత్రమిది. ఆద్యంతం మనసుల్ని హత్తుకునేలా ఉంటుంది. కన్నడలో భారీ విజయాన్ని అందుకుంది.  కచ్చితంగా తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు హర్ష. ఈ కార్యక్రమంలో స్వామి, అదితి సాగర్‌, కృష్ణ, ఘనవి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని