oscar awards 2023: ఆస్కార్‌పై ఏనుగంత ఆశలు

తప్పిపోయిన ఏనుగును పెంచి పోషించిన దంపతుల కథతో భారతీయ దర్శకుడు రూపొందించిన చిత్రానికి ఆస్కార్‌ నామినేషన్‌ దక్కడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated : 21 Feb 2023 06:40 IST

ఉత్తమ డాక్యుమెంటరీ  షార్ట్‌లో భారతీయ లఘు చిత్రం

తప్పిపోయిన ఏనుగును పెంచి పోషించిన దంపతుల కథతో భారతీయ దర్శకుడు రూపొందించిన చిత్రానికి ఆస్కార్‌ నామినేషన్‌ దక్కడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ విభాగంలో మన భారతీయ లఘు డాక్యుమెంటరీ చిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ నామినేషన్‌ అందుకుంది. దీనికి ఆస్కార్‌ వస్తుందని ఎంతో ఆశతో ఉంది ఈ డాక్యుమెంటరీ బృందం. బరిలో     నిలిచిన ఈ లఘు చిత్రం చివరికి ఆస్కార్‌ గెలుస్తుందా? దీనితో పోటీపడుతున్న   ఇతర లఘు చిత్రాలేంటి? వాటి విశేషాలేంటి?

కార్తికి గొన్సాల్వేస్‌ తెరకెక్కించిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ (the elephant whisperers) డాక్యుమెంటరీని డగ్లస్‌ బ్లష్‌, గునీత్‌ మోంగా, ఆచిన్‌ జైన్‌ నిర్మించారు. రఘు అనే ఏనుగును ఆదరించిన బొమ్మన్‌, బెల్లి జంటకు.. ఆ ఏనుగుకు మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. వారి మధ్య ఉన్న సహజ సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని ఇందులో చూపించారు. ప్రకృతికి అనుగుణంగా ఉన్న గిరిజన ప్రజల జీవితాన్ని గురించి కూడా ఇందులో చూపించారు. ఇది డిసెంబరు 10, 2022న ఐడిఎ డాక్యుమెంటరీ అవార్డ్స్‌లో ‘ఉత్తమ షార్ట్‌ డాక్యుమెంటరీ’ విభాగంలో నామినేట్‌ అయ్యింది. ఈ డాక్యుమెంటరీని డిసెంబరు 8 2022న నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.


సముద్రం కథ

త్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో నామినేట్‌ అయిన మరో రష్యన్‌ లఘు డాక్యుమెంటరీ చిత్రం ‘హాలౌట్‌’. మాగ్జిమ్‌ అర్బుగేవ్‌, ఎవ్జెనియా అర్జుగేవా దర్శకత్వం వహించి నిర్మించారు. రష్యన్‌ శాస్త్రవేత్త మాగ్జిమ్‌ చకిలేవ్‌ గురించి, అతను సముద్రంలో జరిగే సహజ సంఘటనలను గమనిస్తూ ఉండటాన్ని ఇందులో చూపించారు. జూన్‌ 8, 2022న సియోల్‌ ఇంటర్నేషనల్‌ ఎకో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ప్రత్యేక జ్యూరీ అవార్డు’ను గెలుచుకుంది. ఈ డాక్యుమెంటరీని ఫిబ్రవరి 2022లో విడుదల చేశారు.   


తండ్రీకూతుళ్ల అనుబంధం...

జే రోసెన్‌ బ్లాట్‌ దర్శకత్వం వహించి నిర్మించిన అమెరికన్‌ లఘు డాక్యుమెంటరీ చిత్రం ‘హౌ డు యు మెసర్‌ ఎ ఇయర్‌’. ఇది 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ఎంపికయ్యింది. ఈ చిత్ర నిర్మాత తన కుమార్తె వయస్సు 2 నుంచి 18సంవత్సరాల వరకు ఎదుగుదల గురించి, తండ్రీకూతుళ్ల అనుంబంధం గురించి ఇందులో చూపించారు. జూన్‌ 11 2022న క్రాకో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌గా ‘గోల్డెన్‌ డ్రాగన్‌’ అవార్డును సొంతం చేసుకుంది. దీనిని ఆగస్టు 13, 2021న విడుదల చేశారు.


మార్తా మిచెల్‌ చుట్టూ

ఏడాది ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో నామినేషన్‌ను దక్కించుకున్న అన్నే అల్వెర్గ్యు తెరకెక్కించిన లఘు డాక్యుమెంటరీ చిత్రం ‘మార్తా మిచెల్‌ ఎఫెక్ట్‌’. బెత్‌ లెవిసన్‌, జుడిత్‌ మిజ్రాచీ నిర్మించారు. ఆర్కైవల్‌ ఫుటేజీ ద్వారా విజిల్‌ బ్లోయర్‌ మార్తా మిచెల్‌ చుట్టూ ఇది తిరుగుతుంది. ఈ డాక్యుమెంటరీని జూన్‌ 17, 2022న విడుదల చేశారు.


దాడికి ప్రణాళికలు..

జోషువా సెఫ్టెల్‌ తెరకెక్కించిన అమెరికన్‌ లఘ డాక్యుమెంటరీ చిత్రం ‘స్ట్రేంజర్‌ ఎట్ ది గేట్‌’. ఈ డాక్యుమెంటరీని కోనల్‌ జోన్స్‌, లీనాఖాన్‌ నిర్మించారు. ఇది 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో నామినేట్‌ అయ్యింది. ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో పనిచేసిన మాజీ మెరైన్‌ రిచర్డ్‌(మాక్‌) మెకిన్నే కథను, అతడు మసీదుపై దాడిచేయడానికి చేసిన ప్లాన్‌ అనుకోని ఏవిధంగా ఎలా మలుపు తిరిగిందనేది ఇందులో చూపించారు. ఈ డాక్యుమెంటరీ బ్రెకెన్‌ రిడ్జ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సెప్టెంబరు 18 2022న ‘బెస్ట్‌ ఎడిటింగ్‌’ అవార్డును గెలుచుకుంది. సెప్టెంబరు 14, 2022న ఈ డాక్యుమెంటరీని విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని