Venkatesh: నన్ను కొత్తగా ఆవిష్కరించుకున్నా!

బాబాయ్‌ అబ్బాయి వెంకటేష్‌, రానా కలిసి నటిస్తే చూడాలన్నది సినీప్రియుల కోరిక. ఇప్పుడా కోరిక ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌తో తీరబోతుంది.

Updated : 08 Mar 2023 04:53 IST

వెంకటేష్‌  

బాబాయ్‌ అబ్బాయి వెంకటేష్‌, రానా కలిసి నటిస్తే చూడాలన్నది సినీప్రియుల కోరిక. ఇప్పుడా కోరిక ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌తో తీరబోతుంది. ఇది వెంకీకి తొలి వెబ్‌సిరీస్‌. కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ వర్మ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సిరీస్‌ ఈ నెల 10నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో ఈ సిరీస్‌ సృష్టికర్తలతో కలిసి విలేకర్లతో ముచ్చటించారు వెంకటేష్‌, రానా. ఈ సందర్భంగా వారు పంచుకున్న విశేషాలివి..


భిన్నమైన ప్రయాణం

‘‘ఇది నాకొక భిన్నమైన ప్రయాణం. తెలుగు నుంచి ఇలాంటి ప్రయత్నం ఏ హీరో చేయలేదు. సినిమాల్లో ఎన్ని భిన్నమైన పాత్రలు పోషించినా.. ఇది మరింత కొత్తగా అనిపించింది. అందుకే స్క్రిప్ట్‌ వినగానే ఇది చేయాలని అనుకున్నా. డార్క్‌ ఎమోషన్స్‌తో నిండిన ఫ్యామిలీ కథాంశంతో రూపొందిన సిరీస్‌ ఇది. ఇందులో నాది నాగ నాయుడు అనే ప్రతినాయక ఛాయలున్న పాత్ర. నటుడిగా నాకెంతో సవాల్‌గా అనిపించింది. ఈ సిరీస్‌తో నటుడిగా నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం దొరికింది. ఇందులో నేను పలికిన సంభాషణలన్నీ నా నాగ నాయుడు పాత్ర తాలూకూ భావోద్వేగాలకు అద్దం పట్టేలాగే ఉంటాయి. అంతే తప్ప ఏదో కావాలని పెట్టినవి కాదు. ప్రతి మాట వెనుక ఓ బలమైన ఎమోషన్‌ దాగి ఉంటుంది. అది సిరీస్‌ చూస్తే మీకే అర్థమవుతుంది’’.

వెంకటేష్‌  


కుటుంబంతో చూడొద్దు

‘‘నటుడిగా నేనెప్పుడూ కొత్తగా ప్రయత్నించాలనుకుంటా. పాటలు, ఫైట్లు లేకుంటే సినిమాలు ఆడవు అనుకునే సమయంలో నా తొలి చిత్రం చేశా. ఇక్కడి హీరోలు హిందీలో సినిమా చేస్తే చూడరనుకుంటున్నప్పుడు నా రెండో చిత్రం హిందీలో చేశా. ఇక్కడ సినిమా చేస్తే హిందీలో ఆడదు.. అక్కడ చేస్తే ఇక్కడ ఆడదు అనే రోజులు పోయాయి. ఇప్పుడు మనమే డబ్బింగ్‌ చిత్రాల్లా వెళ్లి ప్రపంచాన్ని జయించేస్తున్నాం. ఇలా కొత్తగా ఏం ప్రయత్నించినా ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ఇప్పుడీ సిరీస్‌తో మేము అలాంటి అడుగే వేస్తున్నాం. ఈ సిరీస్‌లో నా పాత్ర.. బాబాయ్‌ పాత్ర చాలా కొత్తగా ఉంటాయి. మా నిజ జీవితాలకు పూర్తి భిన్నమైన పాత్రలివి. చాలా డార్క్‌ షేడ్స్‌లో ఉంటాయి. ఇద్దరూ మాట్లాడుకుంటే ఒకరినొకరు చంపేసుకుంటారేమో అన్నట్లుగా కనిపిస్తుంటాయి. ఈ రెండు పాత్రల్ని దర్శకులిద్దరూ అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే ఈ సిరీస్‌ విషయంలో అందరికీ చెప్పేది ఒకటే.. దీన్ని కుటుంబంతో కలిసి చూడొద్దు. ఎవరికి వారు ఒంటరిగా చూడండి (నవ్వుతూ)’’.

రానా


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు