ఆ రోజే నేను నటుడిగా మళ్లీ పుట్టా!

‘‘తెలుగు సినిమా అగ్రస్థానంలో ఉంది. నటులందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ ఆ స్థానాన్ని అలా నిలబెట్టాల’’ని పిలుపునిచ్చారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌.

Updated : 18 Mar 2023 06:55 IST

‘దాస్‌ కా ధమ్కీ’ వేడుకలో ఎన్టీఆర్‌

‘‘తెలుగు సినిమా అగ్రస్థానంలో ఉంది. నటులందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ ఆ స్థానాన్ని అలా నిలబెట్టాల’’ని పిలుపునిచ్చారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన  ‘దాస్‌ కా ధమ్కీ’ ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. నివేతా పేతురాజ్‌ కథానాయిక. కరాటే రాజు నిర్మాత. ఉగాది సందర్భంగా ఈ నెల 22న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఎన్టీఆర్‌ ప్రసంగించారు. ప్రపంచ పటంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలబడిందంటే, ఆస్కార్‌ చేజిక్కించుకుందంటే మేము, మా బృందం ఎంత కారణమో తెలుగు చలన చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమ అంతే కారణం. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమ కూడా అంతే కారణం. ఆ సినిమాకి పనిచేసిన మేం కాదు పురస్కారం సొంతం చేసుకున్నది. ప్రేక్షకులకు బదులు మేం అక్కడున్నాం. ఆస్కార్‌  వేదికపై కీరవాణి, చంద్రబోస్‌ కాకుండా... ఇద్దరు భారతీయులు, ఇద్దరు తెలుగువాళ్లు కనిపించారు. ఆ వేదిక మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది. మీరు టీవీల్లో చూసి ఎంత ఉత్సాహం పొందారో, నేను రెండు కళ్లతో చూస్తూ అంత ఆస్వాదించా. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమాలు, భారత సినిమాలు మరింత ముందుకు సాగాలని దేవుడిని కోరుకుంటున్నా. విష్వక్‌ సేన్‌ వేదికపై మాట్లాడినట్టు నేనెప్పటికీ మాట్లాడలేను. అంత ఉత్సాహం తనలో ఉంటుంది. ఎప్పట్నుంచో నాపైన ఉన్న బాధ్యతతో ఇక్కడికి వచ్చా. నాకు బాగా  ఇష్టమైన సినిమాలు తక్కువగా ఉంటాయి. అందులో విష్వక్‌ నటించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చాలా ముఖ్యమైనది. అందులో విష్వక్‌, అభినవ్‌ నటనని చూస్తూ ఉండిపోతుంటా. ముఖ్యంగా విష్వక్‌ని. ఒక నటుడిగా కామెడీ చేయకుండా కామెడీ పండించాడు తను. ఎంత కామెడీ పండిస్తాడో అంతే బాధని దిగమింగుకుని కనిపిస్తుంటాడు. ఒక కొత్త నటుడికి చాలా ఆత్మవిశ్వాసం ఉండాలి అలాంటి పాత్రలు చేయాలంటే. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ, తనకి చాలా మంచి చేసింది. ఆ సినిమా తర్వాత ‘ఫలక్‌నామాదాస్‌’ చూశా. నటుడిగా తనెంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడో దర్శకుడిగా కూడా అంతే. చాలా బాగా చేశాడు. ‘పాగల్‌’ కూడా చేశాడు. తనొక ఛట్రంలోకి వెళ్లిపోతాడా అనుకున్నప్పుడు ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ చేశాడు. ఆ సినిమా చూసినప్పుడు షాక్‌ అయ్యా. ఇంతగా మారిపోయాడు అనిపించింది. నేను నటుడిగా అలా మారడానికి చాలా కాలం పట్టింది. నటుడిగా నేను ఆనందపడే సినిమాలు చేయాలని  ఆలస్యంగా  అనుకున్నా. ఆ రోజే ఈ వేదికపైనే మీరంతా  కాలర్‌ దించుకోకుండా చేస్తానని చెప్పా.  అందరికీ ఆ వాగ్ధానం చేసిన రోజే నేను నటుడిగా మళ్లీ పుట్టా. విష్వక్‌ ఎప్పుడూ ఏదో ఒకటి నిరూపించుకోవాలనే తపనతో కనిపిస్తుంటాడు. ఈ చిత్రం నిజంగా బ్లాక్‌బస్టర్‌ కావాలి. ఈ సినిమాతో తను ఘన విజయం సాధించి దర్శకత్వం చేయడం నిలిపేయాలని కోరుకుంటున్నా. బయట ఔత్సాహికులైన యువ దర్శకులు బోలెడు మంది ఉన్నారు. విష్వక్‌తోపాటు మాలాంటివాళ్లంతా ఆ దర్శకులకి అవకాశం ఇవ్వాలి. విష్వక్‌ నాతో మాట్లాడుతూ ‘ఉన్నదంతా పెట్టేశాను ఈ సినిమా కోసం’ అని చెప్పాడు. ఒక మంచి సినిమా చేయాలనే పిచ్చి తనకెంతగా ఉందో  అప్పుడు అర్థమైంది. ఇలాంటి పిచ్చి ఉన్నవాళ్లే పరిశ్రమని ముందుకు తీసుకెళతారు. ఇలాంటివాళ్ల చిత్రాలు ఆడాలి, అప్పుడే మనం ముందుకు వెళతాం. మార్చి 22న విడుదలవుతుందీ చిత్రం. ఈ ఉగాది  పండుగ రోజు విష్వక్‌కి నిజమైన పండుగ రావాలని మనసారా కోరుకుంటున్నా. తను ఇంకా మంచి సినిమాలు చేయడానికి ఇది మొదటి మెట్టు కావాలి. నటులు, సాంకేతిక నిపుణులు అందరికీ నా శుభాకాంక్షలు’’ అన్నారు. విష్వక్‌ సేన్‌ మాట్లాడుతూ ‘‘నాలో ఒక అభిమానిని చూసుకుని... నాకు ఇచ్చిన మాట కోసం వచ్చారు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ వస్తున్నాడంటే కూడా చాలా మంది నమ్మలేదు. భారతదేశంలో ఉత్తమ నటుడు ఎవరంటే ఎన్టీఆర్‌ అని  నేనెప్పుడో చెప్పా. 17 ఏళ్లకే తొడగొట్టారు ఎన్టీఆర్‌. ఉన్నదంతా పెట్టి నేను సొంతంగా నిర్మించిన చిత్రమిది. ‘వీడికి ఉన్నదంతా పోగొట్టుకుంటే వెక్కిరిద్దాం, నవ్వుదాం’ అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. దేవుడు ఇవన్నీ చూస్తుంటాడు కాబట్టే ఎన్టీఆర్‌ని పంపించారు. నాకు బ్లాక్‌ బస్టర్‌ మొదలైంది’’అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌ బెజవాడ, రామ్‌ తాళ్లూరి, హను రాఘవపూడి, సంగీత దర్శకుడు లియోన్‌ జేమ్స్‌, కళా దర్శకుడు రామాంజనేయులు, ఛాయాగ్రాహకుడు దినేష్‌, పృథ్వీ రాజ్‌, రవి, యశ్‌, కాసర్ల శ్యామ్‌, పూర్ణాచారి, మంగ్లీ, మహేష్‌, హైపర్‌ ఆది,  అమిత్‌ శర్మ,  బి.వి.ఎస్‌.రవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు