సంక్షిప్త వార్తలు(4)

కొన్ని వెబ్‌ సిరీస్‌లు... కొన్ని సినిమాలతో బాలీవుడ్‌ భామగా మారింది ఇరానీ అందం... ఎల్నాజ్‌ నొరౌజీ. ఈమె ఇప్పుడు తెలుగులోకి అడుగు పెట్టింది. కల్యాణ్‌రామ్‌తో కలిసి ప్రత్యేకగీతంలో ఆడిపాడుతోంది.

Published : 19 Mar 2023 01:39 IST

ఇరానీ అందం.. ప్రత్యేక గీతం

కొన్ని వెబ్‌ సిరీస్‌లు... కొన్ని సినిమాలతో బాలీవుడ్‌ భామగా మారింది ఇరానీ అందం... ఎల్నాజ్‌ నొరౌజీ. ఈమె ఇప్పుడు తెలుగులోకి అడుగు పెట్టింది. కల్యాణ్‌రామ్‌తో కలిసి ప్రత్యేకగీతంలో ఆడిపాడుతోంది. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నవీన్‌ మేడారం దర్శకత్వంలో ‘డెవిల్‌ - ది సీక్రెట్‌ ఏజెంట్‌’ తెరకెక్కుతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. గూఢచర్యం నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక సెట్‌లో కల్యాణ్‌రామ్‌, ఎల్నాజ్‌ నొరౌజీలపై ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్పరకల్పనలోని ఈ గీతానికి బృందామాస్టర్‌ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. భారీ హంగులతో కూడిన ఈ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు తెలిపాయి.


‘భోళా శంకర్‌’ కోసం ప్రత్యేక పాత్రలో


 

చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమాలో చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తుండగా.. ఆయనకు జోడీగా తమన్నా నటిస్తోంది. వీరితో పాటు యువ హీరో సుశాంత్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో సుశాంత్‌ లవర్‌బాయ్‌లా స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ఈ చిత్రంలో ఆయన కీర్తికి జోడీగా నటిస్తున్నారని సమాచారం. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: డడ్లీ.  


బుల్‌ బుల్‌.. అన్‌స్టాపబుల్‌

విజె సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో డైమండ్‌ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘అన్‌ స్టాపబుల్‌’. రజిత్‌ రావు నిర్మాత. నక్షత్ర, అక్సా ఖాన్‌ కథానాయికలు. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగా హీరో గోపీచంద్‌ ఈ చిత్రంలోని ‘‘బుల్‌ బుల్‌ అన్‌స్టాపబుల్‌’’ పాటను విడుదల చేశారు. ఈ గీతానికి భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు సమకూర్చడమే కాక రాహుల్‌ సిప్లిగంజ్‌తో కలిసి స్వయంగా ఆలపించారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యమందించారు. ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: ఉద్ధవ్‌, ఛాయాగ్రహణం: వేణు మురళీధర్‌.


జురాసిక్‌ పార్క్‌ నటుడికి క్యాన్సర్‌ చికిత్స

‘జురాసిక్‌ పార్క్‌’ చిత్రంలో అలన్‌ గ్రాంట్‌ పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందికి చేరువయ్యారు హాలీవుడ్‌ నటుడు సామ్‌ నీల్‌. గత ఏడాది విడుదలైన ‘జురాసిక్‌ వరల్డ్‌ డొమీనియన్‌’లో ఆయన నటించారు. ప్రస్తుతం ఆయన రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. క్యాన్సర్‌ మూడో దశలో ఉందని, చికిత్స తీసుకుంటున్నట్లు  తెలిపారు. ఈ వైద్యం జరిగే నేపథ్యంలో తనకు తానే ఏదో పనిలో మునిగిపోవాలని నిర్ణయించుకుని తన జీవితం గురించి పుస్తకం రాయడం ప్రారంభించానని చెప్పాడు. ‘నేను మోసగాడిని. నా చావు అతి త్వరలోనే ఉంది. నేను దీన్ని ఇంకా వేగంగా చేయాలి’ అని తన అధ్యాయంలో రాసుకున్నారు. ‘పనిని ప్రేమించాలి, స్నేహితులతో, బంధువులతో సమయం గడపడం అంటే నాకు ఇష్టం. కానీ ఇప్పుడు నేనేమీ చేయడం లేదు. ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థమవ్వట్లేదు. నాకసలు పుస్తకం రాయాలనే ఆలోచనే లేదు. కానీ నేను బతకడానికి ఏదో కారణం కావాలి. కాబట్టి రేపటి గురించి రాస్తాను. అది నాకు బాగా నచ్చుతుంది’ అని ఆయన తెలిపారు. ఆయుర్వేద పద్ధతిలో వైద్యం వికటించడంతో ఇప్పుడు కొత్తగా కీమోథెరపీ చేయించుకుంటున్నారు నీల్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని