అశ్లీలతే సృజనాత్మకత కాదు

‘ఓటీటీ వేదికలు సినీ రూపకర్తల సృజనాత్మకతను నిరూపించుకోవడానికే తప్ప.. అపరిమితమైన స్వేచ్ఛతో అశ్లీలత చూపించడానికి కాదు’ అంటున్నారు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.

Published : 21 Mar 2023 02:32 IST

 కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

‘ఓటీటీ వేదికలు సినీ రూపకర్తల సృజనాత్మకతను నిరూపించుకోవడానికే తప్ప.. అపరిమితమైన స్వేచ్ఛతో అశ్లీలత చూపించడానికి కాదు’ అంటున్నారు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌. ఇది మోతాదు మించితే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఓటీటీల ద్వారా ప్రసారమయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లలో హింస, దూషణలు, అసభ్యత, అశ్లీలత పెరిగిపోతున్నాయని ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘ఒక సినిమా, వెబ్‌సిరీస్‌పై వచ్చిన ఎలాంటి ఫిర్యాదునైనా పరిష్కరించాల్సిన బాధ్యత ముందు నిర్మాతలదే. ఇది మొదటి దశ. చిన్నచిన్న మార్పులతో ఇక్కడే 90 శాతం సమస్యలు తొలగిపోతాయి. రెండో దశలో చిత్ర రూపకర్తలంతా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి కంటెంట్‌ రూపొందించాలో చర్చించుకోవాలి. ఈ రెండు దశలు దాటి ఫిర్యాదులు ప్రభుత్వం వద్దకు చేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మేం చర్యలకు దిగాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో అత్యధిక ఫిర్యాదులు మావరకు వస్తున్నాయి’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘సృజనాత్మకత పేరుతో ఆమోదయోగ్యం కాని భాషను వాడతామంటే మేం ఉపేక్షించం. అశ్లీల కంటెంట్‌పై ఫిర్యాదులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై నిబంధనలు సవరించాల్సిన, చర్యలకు దిగాల్సిన పరిస్థితి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కసారి చర్యలు మొదలైతే.. వెనక్కిపోయే ప్రసక్తే లేదు’ అని ఠాకూర్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని