Rangamarthanda : జీవితాన్ని చూస్తున్నట్టుండే సినిమా ఇది

‘‘ఎవ్వరైనా సరే.. నేల విడిచి సాము చేయకూడదు. నేను సీరియస్‌గా నటించినా నవ్వే రోజులివి. ఒక హాస్యనటుడిగా ఆ పరిధిని దాటి నేను రాకూడదు.

Updated : 22 Mar 2023 11:10 IST

‘‘ఎవ్వరైనా సరే.. నేల విడిచి సాము చేయకూడదు. నేను సీరియస్‌గా నటించినా నవ్వే రోజులివి. ఒక హాస్యనటుడిగా ఆ పరిధిని దాటి నేను రాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ అవార్డులు అందుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి నాకొక పాత్ర గురించి చెప్పినప్పుడు కచ్చితంగా ఇదొక అరుదైన అవకాశం అనుకున్నా. అదే నిజమైంది’’ అన్నారు ప్రముఖ నటుడు బ్రహ్మానందం. ఆయన, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘రంగమార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. కాలీపు మధు నిర్మాత. ఈ చిత్రం ఉగాది సందర్భంగా బుధవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘‘కృష్ణవంశీ, ప్రకాశ్‌రాజ్‌ వచ్చి ఈ సినిమాలో మీరు నటించాలని అడిగినప్పుడు ఆశ్చర్యపోయా. మీరే చేయాల్సిన పాత్ర అన్నప్పుడు వెంటనే చేస్తానని చెప్పా. ఈ సినిమా చూస్తున్నప్పుడు జీవితాన్ని చూస్తున్నట్టే ఉంటుంది’’ అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ ‘‘మరాఠీలో వచ్చిన ‘నటసామ్రాట్‌’ చూసినప్పుడు ఒక కళాకారుడి జీవితంలో ఉన్న ఓ బరువు నాకు అర్థమైంది. ఒక విధంగా తను ఈ సినిమాలో తన జీవితాన్నే చూపించాడు. బ్రహ్మానందం నటనని చూస్తున్నప్పుడు దగ్గర నుంచి ఒక విశ్వరూపాన్ని చూస్తున్న అనుభూతి కలిగింది. ఇలాంటి సినిమా అందరికీ కావాలి’’ అన్నారు. కృష్ణవంశీ మాట్లాడుతూ ‘‘ప్రకాశ్‌రాజ్‌లాంటి నటుడిని ‘నువ్వొక చెత్త నటుడివి’ అంటూ చెంపదెబ్బ కొట్టే పాత్రకి నటుడిని ఎంపిక చేయాలన్నప్పుడు మాకు బ్రహ్మానందం గుర్తొచ్చారు. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, ఇతర నటులు పాత్రల కోసం ప్రాణం పెట్టార’’న్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని