సంక్షిప్త వార్తలు(4)

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. దయానంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రవి కస్తూరి నిర్మాత. మధుబాల, ఆదిత్య మేనన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated : 26 Mar 2023 06:09 IST

నిన్ను చూస్తూ.. పడిపోతున్నా

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. దయానంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రవి కస్తూరి నిర్మాత. మధుబాల, ఆదిత్య మేనన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘పడిపోతున్న నిన్ను చూస్తూ...’ అంటూ సాగే ఈ సినిమాలోని లిరికల్‌ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటకి కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా, అశ్విన్‌ - అరుణ్‌ సంగీతం సమకూర్చారు. అనురాగ్‌ కులకర్ణి, హారిక నారాయణ్‌ ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే.. విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. ఒక ఆట.. కొన్ని మలుపులు జీవితాల్ని ఎంత ఆసక్తికరంగా మార్చాయనేది తెరపైనే చూడాలి. అన్నదమ్ములైన కథానాయకుడు, దర్శకుడు పోటాపోటీగా పనిచేశారు. వాళ్ల పనితీరు తప్పకుండా  ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. విడుదలైన లిరికల్‌ వీడియో ఆకట్టుకుంటోంద’’ని పేర్కొన్నారు.


సొగసైన పాట

విజయవంతమైన ‘సిక్స్‌టీన్స్‌’కి కొనసాగింపుగా... సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘రిస్క్‌’. సందీప్‌ అశ్వా, సానియా ఠాకూర్‌, జోయా ఝవేరి, తరుణ్‌ సాగర్‌, అర్జున్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ‘సొగసుకే సోకు...’ అంటూ సాగే  పాటని, మోషన్‌ పోస్టర్‌ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ గీతాన్ని ఘంటాడి కృష్ణ స్వరపరిచారు. ఇతర భాషల్లోని పాటని కూడా విడుదల చేశారు. ఎం.ఎస్‌.రాజు, యలమంచిలి రవిశంకర్‌, ఆదిత్య ఓం, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, వకుళాభరణం రామకృష్ణ రావు, దుండ్ర కుమారస్వామి, రావి సురేష్‌రెడ్డి, గడ్డం రవి, విజయ్‌వర్మ, ఆర్‌.కె. తదితర సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ ‘‘అప్పట్లో ‘సిక్స్‌టీన్స్‌’లోని దేవుడు వరమందిస్తే.. పాట తెలుగులోనే కాకుండా, కన్నడలోనూ ఘనవిజయం సాధించింది. ఆ సినిమాకి కొనసాగింపుగా చిత్రం చేయాలని చాలాకాలం కిందటే అనుకున్నా. అందరి సహకారంతో పూర్తి చేశా’’ అన్నారు.


ఏందిరా పంచాయితీ..

రత్‌, విషికా లక్ష్మణ్‌ జంటగా టి.గంగాధర తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. ఎం.ప్రదీప్‌ కుమార్‌ నిర్మాత. కాశీ విశ్వనాథ్‌, రవివర్మ, సమీర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికర కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. అన్నిరకాల వాణిజ్యాంశాలతో.. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: పెద్దపల్లి రోహిత్‌, ఛాయాగ్రహణం: సతీష్‌ మాసం.


ముగ్గురు నాయికల..  షూటింగ్‌ షురూ

రీనా కపూర్‌, టబు, కృతిసనన్‌ ప్రధాన పాత్రధారులుగా రాజేష్‌ కృష్ణన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది క్రూ’. ముగ్గురు అగ్ర కథానాయికలు ఈ ప్రాజెక్టులో భాగం అని ప్రకటించిన రోజు నుంచే అభిమానులు, పరిశ్రమవర్గాల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్రీకరణ ప్రారంభిస్తున్నామని నిర్మాత రియా కపూర్‌ శనివారం సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. భారతీయ విమానయాన సంస్థలో పని చేసే ముగ్గురు ఉద్యోగినుల జీవితాల్లో ఎదురయ్యే కొన్ని సంఘటనల్ని ఈ సినిమాలో చూపించనున్నారు. చిత్రీకరణ మొదలవడంతో చాలా సంతోషంగా ఉన్నాననీ, కడుపులో సీతాకోకచిలుకలు నాట్యం చేస్తున్నట్టు ఉందని కృతి ఇన్‌స్టాలో తెలిపింది. రియా కపూర్‌, ఏక్తా కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు