సంక్షిప్త వార్తలు(6)

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా.. రమేష్‌ కడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మీటర్‌’. అతుల్య రవి కథానాయిక.

Published : 27 Mar 2023 00:41 IST

మాస్‌ ‘మీటర్‌’

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా.. రమేష్‌ కడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మీటర్‌’. అతుల్య రవి కథానాయిక. చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలు. నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పిస్తున్నారు. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 29న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. మాస్‌ యాక్షన్‌ వినోదంతో రూపొందుతున్న ఈ సినిమా కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ సినిమా అనీ, అందరినీ అలరించే బలమైన కథతో రూపొందిందని చిత్రవర్గాలు తెలిపాయి.


మూడు కాలాలు.. మూడు పాత్రలు

ఆదిత్య ఓం కథానాయకుడిగా... ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దహనం’. శ్రీపెతకంశెట్టి సతీష్‌ కుమార్‌ నిర్మాత. ఈ నెల 31న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుకని నిర్వహించారు. వైవీఎస్‌ చౌదరి, దామోదర్‌ ప్రసాద్‌, టి.ప్రసన్నకుమార్‌, తమ్మారెడ్డి భరద్వాజ, మాదాల రవి, అనిల్‌ కుర్మాచలం, జూపూడి ప్రభాకర్‌రావు తదితర సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నీరు, నిప్పు, గాలితోపాటు.. భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలతో ముడిపడిన కథ ఇది. కొన్ని తరాలు పూజలందుకుని మూతపడిన శివాలయంలో మళ్లీ పూజలు మొదలుపెట్టే భైరాగిగా ఆదిత్య ఓం కనిపిస్తాడు. మూడు పాత్రల చుట్టూ సాగే ఈ కథ ఆసక్తిని రేకెత్తిస్తుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కరోనా సమయంలో విన్న ఈ కథ నచ్చి సినిమా చేశా. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ప్రతీ శుక్రవారం సినిమాలొస్తాయి. కానీ ‘దహనం’లాంటి సినిమాలు పదేళ్లకి ఒక్కసారి మాత్రమే వస్తుంటాయి. అందరం సినిమాపై ప్రేమ, తపనతో పనిచేశాం. నిర్మాతలు గొప్పగా తీశార’’న్నారు ఆదిత్య ఓం. కార్యక్రమంలో పంపిణీదారుడు ఆదినారాయణతోపాటు సినీ బృందం పాల్గొంది.


పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంలో...

రక్షిత్‌ అట్లూరి కథానాయకుడిగా.. గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పోలీస్‌ స్టేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విశ్వేశ్వర శర్మ, రాజ రాయ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటి క్లాప్‌నిచ్చారు. నిర్మాత ప్రసన్నకుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. మంచి బృందం కలసి ప్రయాణం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. సస్పెన్స్‌, యాక్షన్‌, డ్రామా మేళవింపు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏప్రిల్‌ 15 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు. త్వరలోనే మిగతా నటులు, సాంకేతిక బృందం వివరాల్ని ప్రకటిస్తామన్నారు నిర్మాతలు.


భోజ్‌పురి నటి ఆత్మహత్య

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. భోజ్‌పురి ప్రముఖ నటి ఆకాంక్ష దూబే (25) ఆత్మహత్యకు పాల్పడింది. ‘మేరా జంగ్‌ మేరా ఫైస్లా’తో తెరంగేట్రం చేసిన ఆమె ‘ముజ్‌సే షాదీ కరోగీ’, ‘వీరోంకే వీర్‌’, ‘ఫైటర్‌ కింగ్‌’ సహా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తను ప్రస్తుతం ఓ సినిమా చిత్రీకరణ కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉంది. షూటింగ్‌ అనంతరం తను ఉంటున్న హోటల్‌ గదికి వచ్చి అక్కడే విగతజీవిగా మారింది. ‘యే ఆరా.. కభీ హారా నహీ..’ అనే తన మ్యూజిక్‌ వీడియో విడుదలైన రోజే ఆమె తనువు చాలించడం దురదృష్టకరం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదోయీ ఆకాంక్ష సొంతూరు.


సల్మాన్‌ లేని ‘కరణ్‌ అర్జున్‌’..

1995లో వచ్చిన ‘కరణ్‌ అర్జున్‌’ చిత్రం ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. నేటి అగ్ర కథానాయకులు షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ల కెరియర్‌నీ అప్పట్లో ఈ సినిమా ఊహించని మలుపు తిప్పింది. అంతకుముందు మంచి నటుడిగానే గుర్తింపు పొందిన రాకేష్‌ రోషన్‌ దీంతో స్టార్‌ దర్శకుల జాబితాలో చేరారు. అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాకేష్‌ రోషన్‌ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంగతులు వెల్లడించారు. ‘కరణ్‌ అర్జున్‌’లో సల్మాన్‌ వేసిన కరణ్‌ పాత్రకు మొదట్లో అజయ్‌ దేవగణ్‌ని అనుకున్నారట. డేట్స్‌పై సంతకం కూడా చేసిన దేవగణ్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందనగా కొన్ని వ్యక్తిగత కారణాలతో చిత్రం నుంచి తప్పుకున్నారు. అప్పుడు హడావుడిగా సల్మాన్‌ని తీసుకొచ్చారు. షూటింగ్‌ పూర్తై, విడుదలైన తర్వాత బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిందీ సినిమా. ఇందులోని పాటలు ఎవర్‌గ్రీన్‌ హిట్స్‌గా నిలిచాయి. దీంతోపాటు ఈ చిత్రానికి ‘కైనాత్‌’ అనే పేరు ఖరారు చేసి, తర్వాత మార్చామని ఆయన చెప్పుకొచ్చారు. రాకేష్‌ రోషన్‌ త్వరలో ‘క్రిష్‌ 4’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


దీపావళికి ‘ఔరోన్‌ మే కహా దమ్‌ థా’

‘దృశ్యం 2’ హిట్‌ జంట అజయ్‌ దేవగణ్‌, టబు.. మరోసారి ‘ఔరోన్‌ మే కహా దమ్‌ థా’లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి నీరజ్‌ పాండే దర్శకుడు. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. కీలక పాత్రధారులు జిమ్మీ షేర్గిల్‌, సయీ మంజ్రేకర్‌ అందులో పాల్గొంటున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో అజయ్‌ దేవగణ్‌, టబులు వారికి జత కలవనున్నారు. సంగీత ప్రాధాన్యంగా సాగే ఈ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ని దీపావళికి విడుదల చేస్తామని నిర్మాత శ్రేయాన్స్‌ హిరావత్‌ తెలిపారు. ఆస్కార్‌ విజేత ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఈ చిత్రానికి స్వరాలందిస్తున్నారు.

‘భోళా’ సిద్ధం..

ఈ జంట నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘భోళా’ మార్చి 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఆదివారం సెన్సార్‌ ‘ఎ’ సర్టిఫికెట్‌ అందజేసిందని చిత్రవర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని