ఉదయ్‌శంకర్‌ కొత్త చిత్రం ఆరంభం

శ్రీరామ్‌ మూవీస్‌ పతాకంపై ఉదయ్‌శంకర్‌ కథానాయకుడిగా ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. మేఘ ఆకాష్‌ కథానాయిక. మన్మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 28 Mar 2023 07:07 IST

శ్రీరామ్‌ మూవీస్‌ పతాకంపై ఉదయ్‌శంకర్‌ కథానాయకుడిగా ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. మేఘ ఆకాష్‌ కథానాయిక. మన్మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. డా.సౌజన్య.ఆర్‌ అట్లూరి సమర్పకులు. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీరామ్‌ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. దినేశ్‌ చౌదరి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘కుటుంబ నేపథ్యం, ప్రేమకథ, థ్రిల్లర్‌ అంశాల మేళవింపుగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడిగా ఇదే నా తొలి ప్రయత్నం. ఏప్రిల్‌ మూడో వారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణని ఆరంభిస్తాం’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ నిర్మాణ సంస్థలో రెండో సినిమాని కూడా ఉదయ్‌తోనే ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కథ చాలా బాగుంది. మంచి నటులు, సాంకేతిక బృందం కలిసి చేస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. ఉదయ్‌శంకర్‌ మాట్లాడుతూ ‘‘కథానాయకుడిగా ఇది నా ఐదో చిత్రం. నిర్మాత నారాయణరావుతో రెండోసారి కలిసి చేస్తుండడం ఆనందంగా ఉంది. ఇందులో రొమాంటిక్‌ కామెడీ నేపథ్యం ఆకట్టుకుంటుంది. ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండూ’ తర్వాత మరోసారి మధునందన్‌తో కలిసి నటిస్తున్నాను. ఆయన కడుపుబ్బా నవ్వించే కీలకమైన పాత్రలో కనిపిస్తార’’న్నారు. మధునంద్‌, వెంకటేష్‌ కాకుమాను, శశి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అనిత్‌ కుమార్‌, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.


ఏంటీ డ్రామా?

మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా జి.భవానీ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?’. సంధ్యారాణి, స్వరూపరాణి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రియా సచ్‌దేవ కథానాయిక. ఈ సినిమా హైదరాబాద్‌లో సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మంచు మనోజ్‌ క్లాప్‌ కొట్టగా.. ఛోటా కె.నాయుడు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పూజా కార్యక్రమంలో పాల్గొని చిత్రబృందానికి శుభాశీస్సులు అందించారు. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్‌ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేస్తున్నాను. నన్ను నమ్మి ఇంత భారీ సినిమా నిర్మిస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘వినోదాత్మక ప్రేమకథతో సాగే సోషియో ఫాంటసీ చిత్రమిది. ఇందులో బ్రహ్మ పాత్రను దక్షిణాదిలోని ఓ టాప్‌ స్టార్‌ చేయనున్నారు. అదెవరన్నది త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు దర్శకుడు. కార్యక్రమంలో గోపీసుందర్‌, రియా, స్వరూప, సంధ్య తదితరులు పాల్గొన్నారు.


భారతి శక్తి

రేంద్ర, గరిమా నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సీఐ భారతి’. రమణారెడ్డి గడ్డం దర్శకత్వం వహిస్తున్నారు. విశాల పసునూరి నిర్మాత. ఘర్షణ శ్రీనివాస్‌ సమర్పకులు. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. తొలి సన్నివేశానికి నటుడు అలీ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక శక్తిమంతమైన కథ ఇది. రొటీన్‌కి భిన్నంగా సాగుతుంది. పశుగ్రాసం లేక ఆవులు చెత్తకుప్పల దగ్గర పేపర్లు తింటున్నాయి. ఈ అంశాన్ని కూడా సినిమాలో ప్రస్తావించాం. ఇందులో వచ్చే లాభాల్లో కొంతభాగం పశుగ్రాసం కోసం కేటాయిస్తాం. ఏప్రిల్‌ 10 నుంచి ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణని పూర్తి చేస్తాం’’ అన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘కథని, పాత్రల్ని చాలా బాగా డిజైన్‌ చేశారు దర్శకుడు. ఐదు మంచి పాటలు ఉన్నాయి’’ అన్నారు. ‘‘రమణారెడ్డి అన్నీ తానై ఈ సినిమా చేస్తున్నారు. ఇంత మంచి సినిమాని నేను నిర్మిస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు ఘర్షణ శ్రీనివాస్‌. సంగీతం: ప్రిన్స్‌ హెన్రీ, ఛాయాగ్రహణం: శ్రీనివాసరెడ్డి, కూర్పు: రామారావు, కళ: ఆనంద్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు