ఈటీవీలో వెన్నెల కిశోర్‌ ప్రయాణం

వెన్నెల కిశోర్‌...హాస్యానికి చిరునామా. నవ్వులకి మరో పేరు. వెండితెర మీద వినోదాన్ని పంచిన వెన్నెల కిశోర్‌ ఇప్పుడు తొలిసారిగా చిన్నితెర మీద కనిపించబోతున్నారు.

Updated : 28 Mar 2023 06:59 IST

అలా మొదలైంది.. మొదటి భాగం
ఈ రోజు రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో

వెన్నెల కిశోర్‌...

హాస్యానికి చిరునామా. నవ్వులకి మరో పేరు. వెండితెర మీద వినోదాన్ని పంచిన వెన్నెల కిశోర్‌ ఇప్పుడు తొలిసారిగా చిన్నితెర మీద కనిపించబోతున్నారు. ఈ రోజు నుంచి ఈటీవీలో ప్రసారం కానున్న ‘అలా మొదలైంది’తో ఆయన తన టెలివిజన్‌ ప్రస్థానం ప్రారంభిస్తున్నారు.సెలబ్రిటీల జీవితాలంటే ప్రేక్షకులందరికీ అమితమైన ఆసక్తి. అందులోనూ ఆ తారల జీవితభాగస్వామి కూడా వచ్చి తమ జీవన యానంలోని సరదాలు, సమస్యలు, అలకలు, ఆనందాలు, చిత్రాలు, విచిత్రాలు అన్నీ పంచుకుంటే వినడానికి, చూడటానికి ఎంత బాగుంటుంది? అందుకే... అలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని ఎంచుకుని వ్యాఖ్యాతగా తొలి అడుగు వేశారు వెన్నెల కిశోర్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ, విశ్వప్రసాద్‌ నిర్మాతగా.. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా రూపొందిస్తున్న ‘అలా మొదలైంది’ కార్యక్రమం మొదటి  ఎపిసోడ్‌కి సంచలన నటుడు నిఖిల్‌, ఆయన సతీమణి పల్లవి అతిథులుగా విచ్చేశారు. నిఖిల్‌, పల్లవిలది ప్రేమ వివాహమని అందరికీ తెలుసు. కానీ.. అసలు వాళ్లిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? ఎప్పుడు పరిచయమైంది? పరిచయం ప్రేమగా ఎలా మారింది? ప్రేమని పెళ్లి వరకూ తీసుకురావడంలో ఇద్దరూ ఎదుర్కొన్న సమస్యలేంటి? వీటన్నింటికీ సమాధానాలు.. వాళ్లిద్దరి ఇళ్లలో గానీ, పెద్దలకూ ఈనాటి వరకూ తెలియని నిజాలు మొదటిసారిగా వెన్నెల కిశోర్‌ రాబట్టిన వైనం... ఆసాంతం ఉత్సుకత రేకెత్తిస్తుంది. ఆ వివరాలు- విశేషాలు అన్నీ ఈ ఎపిసోడ్‌లో చూడాల్సిందే అంటున్నారు దర్శకులు శరత్‌చంద్ర.ప్రతి మంగళవారం ప్రసారమయ్యే ‘అలా మొదలైంది’ షోలో మరెందరో ప్రముఖ యువ నటీనటులు, పేరొందిన హీరోలు, దర్శకులు, తమ జీవిత భాగస్వామితో సహా విచ్చేసి మనకి కనువిందు చేయబోతున్నారు. వారు చెప్పే కబుర్లు, పంచుకునే రహస్యాలు, సరదా ఆటలు, పాటలు... వారం వారం వెన్నెల కిశోర్‌ చతురోక్తులు ప్రేక్షకుల్ని అలరించబోతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని