Tollywood: నవమి.. నవోత్సాహం

పండగొస్తుందంటే చాలు చిత్రసీమలో ప్రచార పర్వం పదునెక్కుతుంటుంది. విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాలతో పాటు సెట్స్‌పై ముస్తాబవుతున్న సినిమాలూ కొత్త ప్రచార చిత్రాలతో సినీప్రియుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి.

Updated : 31 Mar 2023 07:11 IST

పండగొస్తుందంటే చాలు చిత్రసీమలో ప్రచార పర్వం పదునెక్కుతుంటుంది. విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాలతో పాటు సెట్స్‌పై ముస్తాబవుతున్న సినిమాలూ కొత్త ప్రచార చిత్రాలతో సినీప్రియుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ ఆనవాయితీ శ్రీరామనవమి వేళా కొనసాగింది. ‘‘మంత్రం కంటే గొప్పది నీ నామం’’ అంటూ ‘ఆదిపురుష్‌’ కొత్త పోస్టర్‌తో అభిమానుల ముందుకొచ్చారు ప్రభాస్‌. ఆయన రాముడిగా నటించిన ఈ సినిమాని ఓం రౌత్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సీతగా కృతిసనన్‌ నటించగా.. రావణుడి పాత్రను సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించారు. మోషన్‌ కాప్చర్‌ విధానంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వేసవి బరిలో వినోదాలు పంచేందుకు ‘రామబాణం’లా దూసుకొస్తున్నారు గోపీచంద్‌. శ్రీరామనవమి సందర్భంగా గురువారం ఈ చిత్రం నుంచి ఒక వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో రామ-లక్ష్మణుల్లా జగపతిబాబు, గోపీచంద్‌ కలిసి నడిచొస్తూ కనిపించారు. ‘‘ఆ రాముడికి లక్ష్మణుడు, హనుమంతుడని ఇద్దరుంటారు. ఈ రాముడికి ఆ ఇద్దరూ నేనే’’ అంటూ ఆ వీడియోలో గోపీచంద్‌ పేల్చిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. శ్రీవాస్‌ తెరకెక్కించిన ఈ సినిమా మే 5న థియేటర్లలోకి రానుంది. శ్రీరామనవమి వేళ జంటగా కనిపించి కనువిందు చేశారు రవితేజ, అను ఇమ్మాన్యుయేల్‌. ఇప్పుడీ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ‘రావణాసుర’. సుధీర్‌ వర్మ తెరకెక్కించిన ఈ స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ చిత్రం నుంచి కొత్త లుక్‌ విడుదల చేసి ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపింది చిత్ర బృందం. ‘సామజవరగమన’ చిత్ర బృందం కూడా నవమి సందర్భంగా కొత్త పోస్టర్‌తో సినీప్రియులకు శుభాకాంక్షలు తెలిపింది. శ్రీవిష్ణు హీరోగా రామ్‌ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా మే 18న బాక్సాఫీసు ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని