సంక్షిప్త వార్తలు

రాజేంద్రప్రసాద్‌, అర్చన ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘షష్టి పూర్తి’. పవన్‌ప్రభ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రూపేష్‌కుమార్‌, ఆకాంక్ష సింగ్‌ నాయికానాయికలుగా నటిస్తున్నారు.

Published : 01 Apr 2023 01:09 IST

ప్రేమతో.. ‘షష్టిపూర్తి’

రాజేంద్రప్రసాద్‌, అర్చన ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘షష్టి పూర్తి’. పవన్‌ప్రభ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రూపేష్‌కుమార్‌, ఆకాంక్ష సింగ్‌ నాయికానాయికలుగా నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం శుక్రవారం చెన్నైలోని ఇళయరాజా స్టూడియోలో జరిగింది.  ఇళయరాజా కెమెరా స్విచాన్‌ చేయగా తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘తల్లిదండ్రుల ప్రేమ, ఆదరాభిమానాలు, ప్రాముఖ్యతను చాటిచెప్పే చిత్రమిది. కని, పెంచి పెద్దజేసిన తల్లిదండ్రులకు 60ఏళ్లలో పెళ్లి చూసి చూడటమనేది ఓ గొప్పవరం. ఈ విషయాన్నే ఇందులో చూపించనున్నాం. ‘లేడీస్‌ టైలర్‌’ చిత్రం అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత రాజేంద్రప్రసాద్‌, అర్చనలు కలసి నటిస్తున్న చిత్రమిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌రెడ్డి, సాహిత్యం: చైతన్య ప్రసాద్‌, రెహమాన్‌, ఎడిటర్‌: రామ్‌రెడ్డి.

న్యూస్‌టుడే, కోడంబాక్కం


సీతా కల్యాణ వైభోగమే..

సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా బి.వి నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంక దత్‌ నిర్మాత. రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్‌, నరేష్‌, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం నుంచి ‘‘సీతా కల్యాణ వైభోగమే’’ అనే గీతాన్ని విడుదల చేశారు. దీనికి మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చగా.. చంద్రబోస్‌ సాహిత్యమందించారు. చైత్ర అంబడిపూడి, శ్రీకృష్ణ సంయుక్తంగా ఆలపించారు. ‘‘ఫీల్‌ గుడ్‌ ఎమోషన్స్‌తో సాగే కుటుంబ కథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. సంతోష్‌, మాళవిక జోడీ అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్ర బృందం తెలిపింది.


నిజమే చెబుతున్నా.. నిన్నే ప్రేమిస్తున్నా!

సందీప్‌ కిషన్‌ హీరోగా విఐ ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. రాజేష్‌ దండా నిర్మాత. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని  వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా శుక్రవారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు. సందీప్‌, వర్ష బొల్లమ్మలపై చిత్రీకరించిన ప్రేమ గీతమిది. ‘‘నిజమే నే చెబుతున్నా జానే జానా.. నిన్నే నే ప్రేమిస్తున్నా’’ అంటూ సాగుతున్న ఈ పాటకు శేఖర్‌ చంద్ర స్వరాలు సమకూర్చగా.. శ్రీమణి సాహిత్యమందించారు. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ‘‘విభిన్నమైన ఫాంటసీ అడ్వంచర్‌ చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు