Raviteja: ‘రావణాసుర’ అందరినీ అలరిస్తుంది: రవితేజ

రవితేజ కథానాయకుడిగా సుధీర్‌ వర్మ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రావణాసుర’. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

Updated : 02 Apr 2023 06:55 IST

రవితేజ (Raviteja) కథానాయకుడిగా సుధీర్‌ వర్మ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రావణాసుర’ (Ravanasura). అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. ఈ సినిమా ఏప్రిల్‌ 7న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. హీరో రవితేజ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం నన్నెంతో అలరించింది. మిమ్మల్నందరినీ కూడా అలాగే అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఏప్రిల్‌ 7న థియేటర్స్‌లో విజిల్స్‌ మోత మోగుతుంది. సుశాంత్‌తో కలిసి పనిచేయడం చాలా నచ్చింది. ఇందులో ఆయన అద్భుతమైన పాత్ర చేశారు. ఈ చిత్రంతో మరో కొత్త సుశాంత్‌ను చూడబోతున్నారు. నాకిష్టమైన దర్శకుల్లో సుధీర్‌ వర్మ ఒకరు. ఈ చిత్రంతో తను మరో స్థాయికి వెళ్తాడు. ఈ చిత్రానికి ‘రావణాసుర’ అనే టైటిల్‌ పెట్టింది.. పోస్టర్లను డిజైన్‌ చేసింది నిర్మాత అభిషేక్‌ నామానే. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అలాగే శ్రీకాంత్‌ విస్సాతోనూ చాలా సినిమాలు చేయాలి. నా తర్వాత సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’కు తనే రచయిత. ఈ మధ్య నా డ్యాన్సులు మీకు నచ్చుతున్నాయంటే దానికి కారణం శేఖర్‌. ఇటీవల కాలంలో నా సినిమాలన్నింటికీ తనే కొరియోగ్రాఫర్‌. ఈ సినిమాలోని మూడు పాటలకు తనే నృత్యరీతులు అందించారు. ఈ చిత్రానికి భీమ్స్‌, హర్షవర్ధన్‌ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులోని నాయికా పాత్రలన్నీ చాలా చక్కగా కుదిరాయి. అను, మేఘా, ఫరియా, దక్షా.. ఇలా ఎవరి పాత్రను వాళ్లు చక్కగా చేశారు. కచ్చితంగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. థియేటర్లో దుమ్ములేపుతుంది’’ అన్నారు. ‘‘శ్రీకాంత్‌ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. ఇందులో నన్ను సుధీర్‌ చాలా కొత్తగా చూపించారు. ఈ సినిమా గురించి ఒకటే చెబుతా.. రవితేజను ఇందులో చూసినట్లు గతంలో ఎప్పుడూ చూసుండరు’’ అన్నారు నటుడు సుశాంత్‌. చిత్ర దర్శకుడు సుధీర్‌ వర్మ మాట్లాడుతూ.. ‘‘స్వామిరారా’ చిత్రం తర్వాత నుంచి రవితేజతో కలిసి పని చేద్దామని చాలా సార్లు అనుకున్నా. కానీ, కుదర్లేదు. ఎట్టకేలకు ఆ కోరిక ఈ చిత్రంతో నెరవేరింది. శ్రీకాంత్‌ విస్సా రాసిన కథ వల్లే ఈ సినిమా సాధ్యమైంది. సినిమా చూసి థ్రిల్‌ అవుతారు. షాక్‌ అవుతారు. ఈ చిత్రంలో మరో సర్‌ప్రైజ్‌ సుశాంత్‌’’ అన్నారు. నటి మేఘా ఆకాష్‌ మాట్లాడుతూ.. ‘‘ఇంత పెద్ద చిత్రంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. నన్ను నమ్మి ఈ అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ చిత్రం చేయడం ద్వారా రవితేజ నుంచి ఎంతో నేర్చుకోగలిగా. ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలనుంది’’ అంది. ఈ కార్యక్రమంలో డి.సురేష్‌బాబు, గోపీచంద్‌ మలినేని, హను రాఘవపూడి, వివేక్‌ కూచిభొట్ల, భీమ్స్‌ సిసిరోలియో, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, దక్ష, పూజిత, శ్రీకాంత్‌ విస్సా, కాసర్ల శ్యామ్‌, ఆది తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని