Telugu cinema: మట్టి భాష... మన యాస.. ఇప్పుడిదే వెండితెర శ్వాస

‘‘చెప్పే కథ ఎంత స్థానికంగా ఉంటే.. దానికంత ప్రపంచ ఆదరణ’’.. ‘కాంతార’ దర్శకుడు రిషబ్‌ చెప్పిన మాటిది. ఇది అక్షర సత్యం కూడా. ఇటీవల కాలంలో మట్టిపరిమళాలు పులుముకొని వెండితెరపై గుభాళించిన పలు చిత్రాల విజయ రహస్యమిదే.

Updated : 08 Apr 2023 05:59 IST

పల్లె సంస్కృతికి పట్టం
లోకల్‌ కథలతో గ్లోబల్‌ విజయాలు
కొత్తవాళ్లే కాదు అగ్రతారలదీ ఇదే బాట

‘‘చెప్పే కథ ఎంత స్థానికంగా ఉంటే.. దానికంత ప్రపంచ ఆదరణ’’.. ‘కాంతార’ దర్శకుడు రిషబ్‌ చెప్పిన మాటిది. ఇది అక్షర సత్యం కూడా. ఇటీవల కాలంలో మట్టిపరిమళాలు పులుముకొని వెండితెరపై గుభాళించిన పలు చిత్రాల విజయ రహస్యమిదే. అందుకే నవతరం దర్శకులు, కథానాయకులు ఈ పంథాలోనే నడిచే ప్రయత్నం చేస్తున్నారు. వీలైతే ఓ మట్టి కథనో.. లేదంటే ఏదైనా సంస్కృతినో చూపిస్తూ సినీప్రియులకు కొత్తదనం పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనో ఆయా ప్రాంతాల తాలూకూ యాసలు, జానపదులు వినిపించడమూ పరిపాటిగా మారింది. దీనికి ప్రేక్షకుల నుంచీ మంచి ఆదరణ లభిస్తుండటంతో.. ఇప్పుడీ తరహా ప్రయోగాలు చేసేందుకు అగ్ర కథానాయకులు ఆసక్తి చూపిస్తున్నారు.

తెలుగు ఒక్కో ప్రాంతంలో ఒక్కో యాసతో సొగసుగా వినిపించినా... సినిమాలకు వచ్చే సరికి ప్రామాణిక భాషే తరచూగా వినిపించేది. అలా లేదంటే అందరికీ అర్థమవ్వకపోవచ్చన్న అభిప్రాయం ఉండేది. అందుకే కొన్నాళ్ల క్రితం వరకు ఈ మాండలికాలు, యాసలు జనం మాట్లాడుకోవడానికే పరిమితమయ్యేవి. ఒకవేళ ఎప్పుడైనా తెరపై వినిపించినా.. వాటిని హాస్య పాత్రలకో లేదంటే ప్రతినాయక పాత్రలకో పరిమితం చేసేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. యాసలు కథానాయకుల గళంలో సరికొత్తగా హీరోయిజం ఒలికిస్తున్నాయి. మట్టికథలకు మరింత సహజత్వాన్ని అద్ది ప్రేక్షకులకు కొత్త అనుభూతులు పంచిస్తున్నాయి. ఈ తరహా సినిమాలు బాక్సాఫీస్‌ ముందు వరుసగా సత్తా చాటుతుండటంతో అగ్ర తారలు సైతం ఈ బాటలో నడిచే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘తొంగి తొంగి.. నక్కి నక్కి గాదే.. తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చినోడ్ని ఏసుకుంటూ పోవాలే’’ అంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో కొమురం భీమ్‌గా తెలంగాణ యాసతో హీరోయిజం పండించారు కథానాయకుడు ఎన్టీఆర్‌. ‘వాల్తేరు వీరయ్య’తో రవితేజ కూడా తెలంగాణ యాసలో సంభాషణలు పలికి.. సినీప్రియుల్ని మురిపించారు. ఇప్పుడు బాలకృష్ణ సైతం ఇదే మాండలికంతో థియేటర్లలో గర్జించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రాంత నేపథ్యంలో సాగే మాస్‌ యాక్షన్‌ చిత్రమిది. ఇందుకోసమే తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నారు బాలయ్య. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ‘దసరా’తో బాక్సాఫీస్‌ ముందు సందడి చేస్తున్నారు నాయకానాయికలు నాని, కీర్తి సురేష్‌. ఈ సినిమాలో వాళ్లిద్దరూ గోదావరిఖని ప్రాంతవాసుల్లా తెలంగాణ యాసలో సంభాషణలు పలికి పౌరుషం ప్రదర్శించారు. నాగార్జున కథానాయకుడిగా ప్రసన్న కుమార్‌ బెజవాడ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తిగా కోనసీమ నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. ఇందుకు తగ్గట్లుగానే సినిమాలో నాగ్‌ ఆ ప్రాంతపు మాండలికంలో సంభాషణలు వినిపించనున్నట్లు తెలుస్తోంది. ‘‘పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైరు’’ ‘పుష్ప’లో చిత్తూరు యాసతో అలరించారు హీరో అల్లు అర్జున్‌. ఇప్పుడీ మ్యాజిక్‌ ‘పుష్ప2’తోనూ కొనసాగనుంది. రామ్‌-బోయపాటి శ్రీను కలయికలో శ్రీనివాస చిట్టూరి ఓ మాస్‌ యాక్షన్‌ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ - ఆంధ్రా నేపథ్యాలతో ముడిపడి ఉన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ కథా నేపథ్యానికి తగ్గట్లుగానే సినిమాలో రామ్‌తో పాటు పలు పాత్రలు ఆయా ప్రాంతాల తాలూకూ మాండలికాల్లో సంభాషణలు పలకనున్నట్లు తెలిసింది. ‘రంగస్థలం’లో గోదావరి యాసను వినిపించారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ఇప్పుడీ బాటలో యువ హీరో విష్వక్‌ సేన్‌ నడవనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ సినిమా ఇది. దీనికి తగ్గట్లుగానే విష్వక్‌ ఇందులో ప్రాంతపు మాండలికంలో సంభాషణలు పలకనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ‘డీజే టిల్లు’లో మల్కాజ్‌గిరీ కుర్రాడిగా తెలంగాణ యాసలో అదరగొట్టారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడాయన ‘టిల్లు స్క్వేర్‌’తో మరోసారి అదే యాసలో అల్లరి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

బాలీవుడ్‌కూ పాకింది..

తెలంగాణ పల్లె సంస్కృతికి.. ఇక్కడి సంప్రదాయాలకు ఇటీవల కాలంలో వెండితెరపై ఆదరణ బాగా పెరిగింది. ఇప్పుడు దీన్ని బాలీవుడ్‌ కూడా అందిపుచ్చుకోవడం విశేషం. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఫర్హాద్‌ సామ్‌జీ తెరకెక్కించిన చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌’. ఈ సినిమా కోసం ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’’ గీతాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దింది చిత్ర బృందం. ప్రాంతీయ సంస్కృతిపై ప్రేమను ప్రదర్శిస్తూ.. వెంకటేష్‌ సూచనతో సల్మాన్‌ ఎంతో ఇష్టపడి ఈ పాట చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ పాట ఇప్పటికే సినిమాకి కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చి పెట్టింది. ఇక తెలుగులోనూ ఆయా ప్రాంతాల్లో వినిపించే జానపదాల్ని విరివిగా వినియోగించడం పరిపాటిగా మారిపోయింది. అవి విడుదలకు ముందే సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చిపెట్టడంతో పాటు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘ఫిదా’లో  ‘‘సారంగదరియా’’ నుంచి ఇటీవల వచ్చిన ‘ధమాకా’లోని ‘‘పల్సర్‌ బైకు’’, ‘దసరా’లోని ‘‘చమ్కీల అంగీలేసి’ వరకు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన జానపదాలు బోలెడున్నాయి.


‘‘ప్రపంచాన్ని ప్రభావితం చేయగల శక్తి పాటలకు ఉంది. అవి లేకుండా సినిమా, సంస్కృతి, మనుషులు ఏవీ మనుగడ సాగించలేవు. ‘ధమాకా’లోని ‘‘పల్సర్‌ బైకు’’ పాట, ‘బలగం’లోని గీతాలు నేను చిన్నప్పటి నుంచి విని పెరిగినవే. అవన్నీ ప్రజల జానపదులే. వాటిని ఇప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటే తప్పిపోయిన కొడుకు మళ్లీ దొరికినంత ఆనంద పడుతున్నారు. ‘బలగం’లోని కథ కూడా మన ఇళ్లలో చూసినదే. ఇదేమీ కొత్తది కాదు. ఈరోజున దాన్ని చూస్తున్న వాళ్లందరూ ఇవే కదా మన మూలాలని గుర్తిస్తున్నారు. అందుకే మన మట్టి కథలకు, యాసలకు, పాటలకు ప్రేక్షకుల్లో అంతటి ఆదరణ లభిస్తోంది’’.

భీమ్స్‌ సిసిరోలియో, సంగీత దర్శకుడు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని