Santosh Sobhan: అమ్మకు ఓ పెద్ద ఇల్లు కొనివ్వాలి!

‘‘కుటుంబంతో కలిసి చూసి హాయిగా నవ్వుకునే ఫ్యామ్‌ కామ్‌ సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఈ చిత్రంతో నందిని రెడ్డి నవ్విస్తూ ఏడిపిస్తారు. ఇందులోని నిజమైన బలం డ్రామా, ఎమోషన్సే. చాలా కొత్తగా అనిపించే సన్నివేశాలున్నాయి’’ అన్నారు సంతోష్‌ శోభన్‌. ఆయన హీరోగా నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’.

Updated : 14 May 2023 12:49 IST

‘‘కుటుంబంతో కలిసి చూసి హాయిగా నవ్వుకునే ఫ్యామ్‌ కామ్‌ సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఈ చిత్రంతో నందిని రెడ్డి నవ్విస్తూ ఏడిపిస్తారు. ఇందులోని నిజమైన బలం డ్రామా, ఎమోషన్సే. చాలా కొత్తగా అనిపించే సన్నివేశాలున్నాయి’’ అన్నారు సంతోష్‌ శోభన్‌(Santosh Sobhan). ఆయన హీరోగా నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’(Anni Manchi Sakunamule) ప్రియాంక దత్‌ నిర్మాత. మాళవిక నాయర్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సంతోష్‌ శోభన్‌.

ఈ మంచి శకునం మీకెలా ఎదురైంది?  

‘‘నేను హీరో అయ్యాక తొలి అడ్వాన్స్‌ చెక్‌ అందుకుంది వైజయంతి మూవీస్‌ నుంచే. ఆ చెక్‌ నాకెంతో ఇష్టమైన ప్రియాంక దత్‌ ఇచ్చారు. అయితే ‘పేపర్‌బాయ్‌’ తర్వాత నాకు కాస్త గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత ‘ఏక్‌ మినీ కథ’.. మరికొన్ని సినిమాలు చేశా. ఇన్నాళ్ల తర్వాత సరైన సమయంలో సరైన కథ కుదరడంతో ‘అన్నీ మంచి శకునములే’ ప్రారంభమైంది. ఈ చిత్ర విషయంలో నన్ను బాగా ఆకర్షించింది నందిని రెడ్డితో పని చేయడమే. తన తొలి చిత్రం ‘అలా మొదలైంది’ నాకు చాలా ఇష్టం. ఆ సినిమా చూశాక చాలా ఏళ్ల తర్వాత ‘ఖుషి’, ‘తొలిప్రేమ’ లాంటి చిత్రం చూశాననిపించింది. అప్పటి నుంచే నేను నందినితో పని చేయాలనుకున్నా. అనుకోకుండా అది ఇప్పటికి కుదిరింది. ఈ చిత్రంలో చాలా మ్యాజిక్‌ జరిగింది. నిజంగా నాకు అవకాశం రావడం అదృష్టమే.

ఈ చిత్ర కథేంటి? ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

‘‘నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ కథ ఇది. తప్పకుండా వెండితెరపై చూడాల్సిన సినిమా. ఈ ఫీలింగ్‌ సినిమా చేసేటప్పుడే అనిపించింది. ఈ చిత్ర టైటిల్‌ వినగానే చాలా నిజాయితీగా తీసే సినిమా అనిపించింది. ఈ మధ్యే సినిమాని ఎలాంటి నేపథ్య సంగీతం లేకుండా చూశాను. బయటకు వచ్చాక చాలా తేలిగ్గా.. ఎంతో హాయిగా.. లోలోపల కాస్త భావోద్వేగభరితంగా అనిపించింది. అదే శుభ శకునం నాకు. నా జీవితంలో ఇలాంటి కథ కానీ, ఇంత మంది నటీనటులతో కలిసి నటించే అవకాశం గానీ మళ్లీ రాదేమో అనిపిస్తోంది. ఈ చిత్రంలో నేను రుషి అనే పాత్రలో కనిపిస్తాను. ‘ఏక్‌ మినీ కథ’ దగ్గర్నుంచి ఇప్పటి వరకు బరువు మోసే పాత్రలే చేశాను. కానీ, ఇందులో నవ్వుతూ.. నవ్విస్తుండే పాత్ర పోషించా. సినిమా చూశాక నేను ఇలా చేయగలనా అని అనిపిస్తుంది చాలా మందికి. ఈ పాత్ర కోసం నన్ను ఆడిషన్‌ చేసి మరీ తీసుకున్నారు’’.

నటుడిగా ఇన్ని సినిమాలు చేశాక కూడా ఆడిషన్‌ అవసరమా అనిపించలేదా?

‘‘అలా నేనెప్పుడూ అనుకోను. అయినా ఆడిషన్‌ ఇస్తే తప్పేముంది. నన్ను ఎవరు స్క్రీన్‌ టెస్ట్‌కు పిలిచినా కచ్చితంగా వెళ్లి చేసి చూపిస్తా. నాది నాటకాల నుంచి వచ్చిన బ్యాచ్‌. చాలా మంది ‘నేను ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాను.. అన్ని ఆడిషన్లు ఇచ్చాను’ అంటూ వాటినేదో కష్టాల్లా చెబుతుంటారు. నిజానికి వాటిని కష్టాల్లా చూడొద్దు. మనం ఏమిటో తెలియని వారికి నిరూపించుకునేందుకు అదొక మంచి అవకాశం. దాన్ని తప్పుగా చూడొద్దు. ఆడిషన్‌ ద్వారా నాకు ఈ చిత్రంలో అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది’’.

కొత్త చిత్ర విశేషాలేంటి?

‘‘ఈ మధ్య కాలంలో నా నుంచి వరుసగా సినిమాలొచ్చాయి. అందుకే ఇకపై నిధానంగా ఆచితూచి ముందుకెళ్లాలి అనుకుంటున్నా. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత మరో కొత్త బ్యానర్‌లో పని చేయనున్నా. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా’’.

ఈ చిత్ర విషయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకాలేంటి?

‘‘1950 నాటి షావుకారు జానకి గారి నుంచి ఈతరంలో ఉన్న అద్భుతమైన నటీనటుల వరకు అందరితో కలిసి పని చేసే అవకాశం దొరికింది. ముఖ్యంగా సినిమాలో నేను, జానకి గారు డార్లింగ్‌ అని పిలుచుకుంటాం. అది మర్చిపోలేని అనుభూతి. ఇలాంటి పాత్ర చేసే అవకాశం ఈతరంలో నాకే వచ్చింది అనుకుంటున్నా. తను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సీనియర్‌గా ఆమె నటనానుభవాల్ని నాతో పంచుకునేవారు. అలాగే నాకు రాజేంద్ర ప్రసాద్‌కు చాలా స్క్రీన్‌ స్పేస్‌ ఉంది. ఆయన నుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నా. ‘ఏప్రిల్‌ 1 విడుదల’లోని ఆయన కామెడీ టైమింగ్‌ను నేను కాపీ కొట్టి నేర్చుకున్నా’’.

మాతృ దినోత్సవం సందర్భంగా మీ అమ్మ గురించి ఏం చెబుతారు? ఆమెకు మీరు ఇవ్వాలనుకునే బహుమతి ఏంటి?

‘‘మొన్న ఓ టీవీ షోలో కూడా అమ్మ గురించి అడిగారు. నాకు మాటలు రాలేదు. నా సర్వస్వం తనే. నటుడిగా సినిమాలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కెరీర్‌ ఆరంభం నుంచి నేను దాటొచ్చిన ఎత్తుపల్లాలన్నింటినీ తను స్వయంగా చూసింది. కఠిన సమయాల్లో నాకెంతో అండగా నిలిచింది. ధైర్యాన్నిచ్చింది. ఇప్పుడు పెద్ద సంస్థల్లో అవకాశాలు రావడంతో చెప్పలేని ఆనందం. అమ్మ నన్ను నమ్మింది కాబట్టే ఇన్ని చిత్రాలు చేయగలుగుతున్నా. మాకు మొదటి నుంచి సొంత ఇల్లు లేదు. ఎప్పటికైనా అమ్మకు ఓ పెద్ద ఇల్లు కొనివ్వాలని ఉంది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని