Tollywood: తప్పుతోందా... ‘పాన్ ఇండియా లెక్క’
ఇంట గెలిచి.. రచ్చ గెలవడంలోనే అసలైన మజా ఉంటుంది. అయితే పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక ఇంట.. బయట అనే హద్దులు పూర్తిగా చెరిగిపోయాయి.
ఇంట గెలిచి.. రచ్చ గెలవడంలోనే అసలైన మజా ఉంటుంది. అయితే పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక ఇంట.. బయట అనే హద్దులు పూర్తిగా చెరిగిపోయాయి. సినిమాలో సరకు క్లిక్కయ్యిందంటే ఎక్కడైనా సూపర్ హిట్టే అన్న ధీమా పెరిగింది. అందుకే ఇటీవల కాలంలో పాన్ ఇండియా చిత్రాల జోరు రెట్టింపయ్యింది. అగ్ర హీరో.. యువ హీరో అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బహుభాషల్ని లక్ష్యం చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. అయితే కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా బరిలో దిగుతున్న ఆయా తారలంతా అందుకు తగ్గ బలమైన కథల్ని సిద్ధం చేసుకోవడంలో తడబడుతున్నారు. దీంతో రచ్చ సంగతి దేవుడెరుగు.. సొంత ఇంటే గెలవలేక చతికలబడుతున్న తారల సంఖ్య అంతకంతకూ రెట్టింపవుతోంది. ఫలితంగా ఇప్పుడు క్రమంగా పాన్ ఇండియా లెక్కలు తారుమారవుతున్నాయి.
పాన్ ఇండియా ట్రెండ్‌కు కొత్త కళను తీసుకొచ్చింది దక్షిణాది చిత్రాలే. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో రాజమౌళి ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుడితే.. ‘కేజీఎఫ్’ చిత్రాలతో ప్రశాంత్ నీల్ ఆ ఒరవడిని విజయవంతంగా కొనసాగించారు. ఈ మధ్యలో ‘పుష్ప’, ‘చార్లీ’, ‘కాంతార’, ‘కార్తికేయ 2’ లాంటి పలు సినిమాలు జాతీయ స్థాయిలో మెరిపించడంతో అన్ని చిత్రసీమలు పాన్ ఇండియా నామాన్ని జపించడం పరిపాటిగా మారింది. ఫలితంగా గత ఏడాది కాలంలో ప్రతి చిత్రసీమ నుంచి పదుల సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే వీటిలో హిట్టు మాట వినిపించి బాక్సాఫీస్ ముందు జోరు చూపిన చిత్రాల్ని వేళ్ల మీదే లెక్క పెట్టొచ్చు. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో మెప్పించిన ప్రభాస్ గతేడాది ‘రాధేశ్యామ్’తో చేదు ఫలితం అందుకున్నారు.
విజయ్ దేవరకొండ ‘లైగర్’తో పాన్ ఇండియా హీరోగా అవతరించాలని ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. ఈ మధ్యలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ‘మేజర్’తో అడివి శేష్, ‘కార్తికేయ 2’తో నిఖిల్ మాత్రమే జాతీయ స్థాయిలో సత్తా చాటారు. సమంత ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలతో రెండు సార్లు జాతీయ స్థాయిలో అదృష్టం పరీక్షించుకున్నా.. రెండింటికీ దారుణ ఫలితాలే ఎదురయ్యాయి. సందీప్ కిషన్ ‘మైఖేల్’ సినిమా ప్రచార చిత్రాలతో ఆసక్తిరేకెత్తించినా.. బాక్సాఫీస్ ముందు పూర్తిగా నిరుత్సాహపరిచింది. ఇక యువ హీరోలు నాని, సాయిధరమ్ తేజ్‌ల తొలి పాన్ ఇండియా సినిమాలు ‘దసరా’, ‘విరూపాక్ష’ తెలుగులో సత్తా చాటినప్పటికీ.. ఇతర భాషల్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. మావీ బహుభాషా చిత్రాలేనంటూ హంగామా చేస్తూ వచ్చిన రవితేజ ‘రావణాసుర’, అఖిల్ ‘ఏజెంట్’, విష్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాలు విడుదల సమయానికి లక్ష్యాన్ని చేరుకోలేక ఒకటి రెండు భాషలకే పరిమితమవడం గమనార్హం.
ఇదో కొత్త పంథా
పాన్ ఇండియా చిత్రమంటే ఒకేసారి పలు భాషల్ని లక్ష్యం చేసుకోవడమే కాదు.. ఏక కాలంలో ఆయా భాషల్లో విడుదల చేయడం కూడా. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ చిత్రాలన్నీ అలా వచ్చి హిట్టు కొట్టినవే. కానీ, ‘కాంతార’, ‘లవ్ టుడే’ లాంటి సినిమాలు ఈ ఆనవాయితీని దాటి మరో కొత్త సంప్రదాయానికి నాంది పలికాయి. తొలుత సొంత భాషలో విడుదల చేసి.. దానికొచ్చే ఫలితాన్ని బట్టి ఇతర భాషలకు తీసుకెళ్లే కొత్త సంప్రదాయం మొదలైంది. ఇది నిర్మాతలకు లాభదాయకంగా ఉండటంతో ఇప్పుడీ ఒరవడి ఊపందుకొంది. ఇటీవల తెలుగులో వచ్చిన ‘విరూపాక్ష’ ఈ పంథానే అనుసరించింది. ఈ చిత్రాన్ని గత నెలలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ఈ నెలలో హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ‘దాస్ కా ధమ్కీ’, ‘రావణాసుర’, ‘ఏజెంట్’ తదితర చిత్రాల్ని సైతం ఇదే పంథాలో అన్ని భాషల్లో విడుదల చేయాలని భావించినప్పటికీ.. తెలుగులోనే చేదు ఫలితాలు ఎదురవడంతో ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నారు. ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్, మహేష్‌బాబు, రామ్, రవితేజ తదితరులంతా పాన్ ఇండియా చిత్రాల్లో సందడి చేస్తున్న వారే. మరి వీరు ఒకేసారి అన్ని భాషల్ని లక్ష్యం చేసుకుంటారా? లేక కొత్త పంథాలో ఫలితాన్ని బట్టి ఇతర భాషలకు వెళ్తారా? అన్నది వేచి చూడాలి.
కత్తి మీద సామే!
‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కేజీఎఫ్’, ‘కాంతార’ చిత్రాల స్ఫూర్తితో అందరూ పాన్ ఇండియా ట్రెండ్ అంటూ పరుగులు తీస్తున్నారు కానీ, పాన్ ఇండియా సినిమాగా మెప్పించడం అన్నది అంత తేలికైతే కాదు. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే అన్ని చిత్రసీమలు అర్థం చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఒక్కో చిత్రసీమ ప్రేక్షకుల అభిరుచి ఒక్కోలా ఉంటుంది. కానీ, దాన్ని అధిగమించి అన్ని భాషల ప్రేక్షకులు మెచ్చేలా యూనివర్సల్ అప్పీల్‌తో సినిమా తీయడమన్నది కత్తి మీద సాము లాంటిదే. విశ్వజనీనమైన కథ కుదిరినప్పుడే ఎన్ని పాన్ ఇండియా రంగులద్దినా ఉపయోగముంటుంది. సరైన కథ లేకుండా కోట్ల రూపాయలు కుమ్మరించినా.. పలు భాషల నుంచి పేరొందిన స్టార్లను రంగంలోకి దించినా.. గ్రాఫిక్స్ హంగులతో మాయ చేసే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యమే అవుతుంది. దీనికి ఉదాహరణే ‘రాధేశ్యామ్’, ‘లైగర్’, ‘శాకుంతలం’ లాంటి చిత్రాలు. ఈ సినిమాలన్నింటిలోనూ ఓ పాన్ ఇండియా చిత్రానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. కానీ, ప్రధానంగా ఉండాల్సిన బలమైన కథ మాత్రం లేకుండా పోయింది. ఫలితంగానే అవి బాక్సాఫీస్ ముందు మంచి ఫలితాన్ని అందుకోలేకపోయాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!