ముస్తాబవుతున్న ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’

రణ్‌వీర్‌సింగ్‌, అలియా భట్‌ నాయకానాయికలుగా.. కరణ్‌జోహార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’. ధర్మేంద్ర, షబానా ఆజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Published : 22 May 2023 02:03 IST

ణ్‌వీర్‌సింగ్‌, అలియా భట్‌ నాయకానాయికలుగా.. కరణ్‌జోహార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’. ధర్మేంద్ర, షబానా ఆజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తైంది. దర్శకుడు కరణ్‌ జోహార్‌ జన్మదినం సందర్భంగా మే 25న ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఆదివారం సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా జులై 28న విడుదల కానుంది. చాలాకాలం తర్వాత కరణ్‌ జోహార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థ.


ప్రేమకథతో ‘డియర్‌ ఉమ’

పృథ్వీ అంబర్‌ హీరోగా సాయి రాజేష్‌ మహాదేవ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్‌ ఉమ’. సుమయా రెడ్డి కథానాయికగా నటిస్తూ.. సొంత కథతో స్వయంగా నిర్మిస్తోంది. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏపీ శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి క్లాప్‌ కొట్టగా.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు విజయ్‌ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత కోన వెంకట్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయిరాజేష్‌ మాట్లాడుతూ.. ‘‘ఇదొక బాధ్యత గల చిత్రం. కథపై నమ్మకంతో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ‘‘నేను తొలుత కన్నడ చిత్రం ‘దియా’లో నటించాను. అది తెలుగులోనూ అనువాదమై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడీ ‘డియర్‌ ఉమ’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇదొక ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ. మంచి సందేశం ఉంది’’ అన్నారు హీరో పృథ్వీ. సుమయా మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఇంట్లో జరిగిన, జరుగుతున్న కథ ఇది. దీనికి అందరూ కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు. దీనికి సంగీతం: రధన్‌, ఛాయాగ్రహణం: రాజ్‌ తోట.


మట్టితో చుట్టరికం

న్నీ నవీన్‌, రోహిణి రేచల్‌ జంటగా నటించిన చిత్రం ‘జైత్ర’. తోట మల్లికార్జున దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లం సుభాష్‌ నిర్మాత. చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మట్టితో చుట్టరికం చేసిన ఓ రైతు కథని అంతే అందంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. రాయలసీమ నేపథ్యంలో సాగుతుంద’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘స్వచ్ఛమైన రాయలసీమ యాస... సహజమైన పాత్రలతో రూపొందిన చిత్రమిది. పాటలు, టీజర్‌, ట్రైలర్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. కథ కూడా అలరించేలా ఉంటుంది’’ అన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘రాయలసీమ నేపథ్యం అనగానే ఫ్యాక్షనిజమే గుర్తొస్తుంది. మా ‘జైత్ర’ అందుకు భిన్నంగా తెరకెక్కింద’’న్నారు. వంశీ నెక్కంటి, సునీత మనోహర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మోహన్‌చారి, సంగీతం: ఫణికల్యాణ్‌, కూర్పు: విప్లవ్‌ నైషదం.


ఆసక్తి రేకెత్తించే ‘ఐక్యూ’

సాయిచరణ్‌, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్‌ జీఎల్‌బి తెరకెక్కించిన చిత్రం ‘ఐక్యూ’. పవర్‌ ఆఫ్‌ స్టూడెంట్‌.. అన్నది ఉపశీర్షిక. కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. సుమన్‌, సత్య ప్రకాష్‌, బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది మేధస్సుకు సంబంధించిన చిత్రం. మంచి ఐక్యూ ఉన్న అమ్మాయిని హీరో ఎలా కాపాడాడన్నది ఆసక్తికరంగా చూపించాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకు రాని ఓ వినూత్నమైన కథాంశంతో యువతరం మెచ్చేలా రూపొందించాం’’ అన్నారు నిర్మాత లక్ష్మీపతి. సంగీతం: పోలూరు ఘటికాచలం, ఛాయాగ్రహణం: టి.సురేందర్‌ రెడ్డి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు