కొత్తగా ప్రయత్నిస్తే వచ్చేది విజయమే!

ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు చిత్రసీమ ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. నాలుగు ఫైట్లు, ఆరు పాటలనే రొటీన్‌ రొడ్డకొట్టుడు ఫార్ములాకు క్రమంగా దూరమవుతోంది.

Updated : 26 May 2023 07:09 IST

ప్రయోగాల బాటలో అగ్రతారల పయనం

ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు చిత్రసీమ ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. నాలుగు ఫైట్లు, ఆరు పాటలనే రొటీన్‌ రొడ్డకొట్టుడు ఫార్ములాకు క్రమంగా దూరమవుతోంది. ప్రయోగాలు చేయడానికి అగ్ర కథానాయకులు తెగువ చూపుతుంటే.. వాళ్లను ప్రోత్సహించడానికి దర్శక నిర్మాతలు.. ఆ ప్రయత్నాల్ని ఆదరించి ఆశీర్వదించడానికి ప్రేక్షకులు సదా సిద్ధంగా ఉంటున్నారు. అందుకే ఇటీవల కాలంలో కొత్త తరహా కథలు చూసే అవకాశం దక్కుతోంది. అగ్ర తారల చిత్రాలు వైవిధ్యతను పులుముకొని సరికొత్తగా తెరపై కాంతులీనుతున్నాయి. ఫలితంగానే తెలుగు చిత్రసీమ ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మెరుపులు మెరిపిస్తోంది.

‘‘ఒకప్పుడు ప్రయోగం చేయడాన్ని సాహసోపేతంగా చూసేవారు. కానీ.. ఇప్పుడదే విజయ సూత్రంగా మారిపోయింది. రొటీన్‌ కమర్షియల్‌ సినిమా చేయడాన్ని నిర్మాతలే సాహసంగా చూసే పరిస్థితులొచ్చాయి’’. - ఇటీవల ఓ యువ దర్శకుడు చెప్పిన మాటిది. ఇది అక్షర సత్యం కూడా. ఈ మార్పును అగ్ర తారలూ గుర్తించి, స్వాగతిస్తున్నారు. అందుకే మెల్లగా తమ ఇమేజ్‌ ఛట్రం నుంచి బయట పడే మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ‘కొత్తగా ప్రయత్నిస్తే పోయేదేముంది?’ అంటూ వాళ్లు తెగువ చూపిస్తుండటంతో దర్శకులు సైతం వాళ్ల ఇమేజ్‌కు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలు సిద్ధం చేస్తున్నారు. కొత్తదనం నిండిన కథల్ని.. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు కథానాయకుడు నాగార్జున. ఇప్పుడాయన రచయిత ప్రసన్న కుమార్‌ బెజవాడతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది నాగ్‌కు ఓ కొత్త తరహా ప్రయత్నమే. పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబు కానున్న ఈ చిత్రంలో ఆయన సరికొత్త మాస్‌ లుక్‌తో కనువిందు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే తన లుక్‌ను కూడా మార్చుకున్నారు నాగ్‌. అంతే కాదు ఇందులో ఆయన పాత్ర రెండు కోణాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కనున్నట్లు తెలిసింది. ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’తో హిట్టు కొట్టి జోరు చూపించారు బాలకృష్ణ. ఇప్పుడాయన అనిల్‌ రావిపూడితో ఓ మాస్‌ యాక్షన్‌ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలయ్యను సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు అనిల్‌. బాలకృష్ణ లుక్‌ నుంచి పలికే సంభాషణల వరకు ప్రతి విషయంలోనూ కొత్తదనం కనిపించేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రం కోసం అదే యాసలో సంభాషణలు పలకనున్నారు బాలయ్య. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరోయిజానికి దూరంగా...

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న చిత్రాల్లో ‘బ్రో’ కూడా ఒకటి. సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమా కమర్షియాలిటీ, హీరోయిజాలకు భిన్నంగా సాగనుందని తెలిసింది. ఈ ఫాంటసీ కామెడీ డ్రామా చిత్రంలో పవన్‌ భగవంతుడిగా కనిపించనున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా జులై 28న థియేటర్లలోకి రానుంది. ఇటీవలే ‘రావణాసుర’లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించి అందరినీ మెప్పించారు రవితేజ. ఇప్పుడాయన ‘టైగర్‌ నాగేశ్వరరావు’గా పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయనకు తొలి బయోపిక్‌. 70ల కాలంలో పేరు మోసిన స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితకథతో రూపొందుతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర చిత్రణ.. ఆయన లుక్‌ కూడా చాలా విభిన్నంగా ఉండనున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. కథానాయకుడు ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక సరికొత్త హారర్‌ కామెడీ కథాంశంతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇలాంటి కథలో నటించడం ప్రభాస్‌కు ఇదే తొలిసారి. అందుకే ఇందులో ప్రభాస్‌ హంగామా ఎలా ఉంటుందో చూసేందుకు సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత నుంచి పూర్తిగా కొత్త దారిలో నడిచే ప్రయత్నం చేస్తున్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. దీనికి తగ్గట్లుగానే ఒక చిత్రంతో మరో సినిమా పోలిక లేకుండా వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నారు. ఇది చరణ్‌కు తొలి క్రీడా నేపథ్య చిత్రమవుతుందని సమాచారం. మరి మన అగ్ర తారలు చేస్తున్న ఈ ప్రయోగాలకు ప్రేక్షకులు ఎలాంటి ఫలితాల్ని అందిస్తారో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని