అలా ప్రేమని చేరి...

దినేశ్‌ తేజ్‌, హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్‌ శివన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Published : 28 May 2023 02:10 IST

దినేశ్‌ తేజ్‌, హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్‌ శివన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ నిర్మిస్తున్నారు. కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ‘‘ప్రేమ, కుటుంబం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఇంటిల్లిపాదీ కలిసి ఆస్వాదించేలా వినోదం ఉంటుంది.  ఆస్కార్‌ విజేత చంద్రబోస్‌ అన్ని పాటల్నీ రాశారు. సుభాష్‌ ఆనంద్‌ సంగీతం ప్రధాన బలం. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకి మంచి స్పందన లభించింద’’ని నిర్మాత తెలిపారు.  శివకుమార్‌ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, మహేష్‌, ఝాన్సీ, కేదార్‌ శంకర తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఐ.ఆండ్రూ.


పోలీస్‌ వ్యూహం

ఒక హత్య... దాని వెనక ఎన్నో అనుమానాలు, మరెంతోమంది అనుమానితులు. మరి అసలు నిజం ఎలా బయటికొచ్చింది?  ఇంతకీ ఆ హత్యని ఎవరు, ఎందుకు చేశారనేది తెలియాలంటే ‘చక్రవ్యూహమ్‌’ చూడాల్సిందే. అజయ్‌ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రమిది. ది ట్రాప్‌... అనేది ఉపశీర్షిక. మధుసూదన్‌ దర్శకత్వం వహించారు. సహస్ర క్రియేషన్స్‌ పతాకంపై సావిత్రి నిర్మించారు. జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ విడుదల చేశారు. ‘‘మిస్టరీ క్రైమ్‌ నేపథ్యంతో కూడిన చిత్రమిది. అజయ్‌ శక్తిమంతమైన ఓ పోలీస్‌ అధికారిగా నటించారు. హత్య కేసుని ఛేదించే క్రమంలో ఓ పోలీస్‌ అధికారి ఎలాంటి వ్యూహాల్ని రచించారనేదది తెరపైనే చూడాలి.  ఆయన నటన, కథ, కథనాలు ఆకట్టుకుంటాయి. ఆద్యంతం సినిమా ఆసక్తిని రేకెత్తిస్తుంది.  మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ నుంచి విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంద’’ని చిత్రవర్గాలు తెలిపాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు