నేను మళ్లీ సంగీతం చేయాలన్నది ఆయన కోరిక

‘‘ట్రెండ్‌ని అప్పుడూ అనుసరించలేదు, ఇప్పుడూ లేదు. సినిమాకి ఏది కావాలో అదే ఇస్తుంటా. చివరికి ప్రేక్షకుడికి నచ్చిందే ట్రెండ్‌ అవుతుంది’’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌. ఆయన - దర్శకుడు తేజ కలయికల్లో విజయవంతమైన చిత్రాలొచ్చాయి.

Published : 30 May 2023 05:34 IST

‘‘ట్రెండ్‌ని అప్పుడూ అనుసరించలేదు, ఇప్పుడూ లేదు. సినిమాకి ఏది కావాలో అదే ఇస్తుంటా. చివరికి ప్రేక్షకుడికి నచ్చిందే ట్రెండ్‌ అవుతుంది’’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌. ఆయన - దర్శకుడు తేజ కలయికల్లో విజయవంతమైన చిత్రాలొచ్చాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఆ ఇద్దరూ కలిసి ‘అహింస’ చేశారు. అభిరామ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. పి.కిరణ్‌ నిర్మించారు. చిత్రం జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు ఆర్పీ.

‘‘సంగీతం చేయమంటూ మధ్యలో చాలా అవకాశాలొచ్చాయి. కానీ చేయాలనిపించలేదు. సమస్య ఏమిటంటే... నాకు కథ నచ్చితేనే చేస్తాను. నచ్చకపోతే అస్సలు చేయలేను. నా చేతిలో సినిమా ఉన్నా లేకపోయినా రోజుకి 18 గంటలు పనిచేయడం అలవాటు. ప్రస్తుతం కన్నడంలో కొన్ని సినిమాలు చేస్తున్నా. దర్శకత్వం కోసం కొన్ని కథలు రాస్తున్నా. నేనెన్ని చేసినా నాకు సంగీతమే ఎక్కువ పేరు తీసుకొచ్చింది. సంగీత దర్శకుడిగానే నన్ను చూస్తారు. అయితే ఓ  సందర్భంలో నేను సంగీతం చేయనని చెప్పి, మానేశా. కానీ ఎప్పుడు కలిసినా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు మాత్రం ‘మళ్లీ సంగీతం ఎప్పుడు మొదలుపెడుతున్నావు’ అని అడిగేవాళ్లు. చేస్తాను గురువుగారూ అని చెప్పేవాణ్ని. ఆయన వెళ్లిపోయాక ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానే అనిపించింది. బాలు పాటపై ఉన్న అభిమానంతోనే నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చా. ఈ క్రమంలో ఓసారి దర్శకుడు తేజని కలిసినప్పుడు ‘మళ్లీ సంగీతం చేయాలి, అది బాలుగారి కోరిక’ అని చెప్పా. కొన్నాళ్ల తర్వాత తేజ ఫోన్‌ చేసి ‘చిత్రం 2’ చేస్తున్నామని చెప్పారు. ఆ ప్రాజెక్ట్‌ స్థానంలోనే... ‘అహింస’ చేశాం’’.

‘‘ఓ కొత్త రకమైన కథతో తెరకెక్కిన చిత్రం ‘అహింస’. అహింస సిద్ధాంతాన్ని నమ్మే ఓ అబ్బాయి కృష్ణతత్వంవైపు వెళ్లే పరిస్థితులు ఎందుకొచ్చాయనేదే ఈ సినిమా. ఎప్పుడూ చూడని లొకేషన్లు ఈ సినిమాలో ఉంటాయి. నేపథ్య సంగీతం చేసేటప్పుడు చూశా, గొప్ప అనుభూతినిచ్చింది’’.

‘‘సంగీత దర్శకత్వమైనా, దర్శకత్వమైనా, గాయకుడిగా మారినా... ఏదైనా సరే, నమ్మిందే చేశా. నమ్మనిది ఏదీ చేయలేదు. నేను ఎవరి దగ్గర సహాయకుడిగా పనిచేయలేదు. సంగీతం నేర్చుకోలేదు. ఏ వాయిద్యం నాకు రాదు. అయినా సరే టైమ్‌లెస్‌ సంగీతం ఇచ్చే అవకాశం నాకు సినిమాలు ఇచ్చాయి. అలాంటి సంగీతాన్ని ఇచ్చిన ప్రతిభ మాత్రం నాది కాదని నమ్ముతుంటా. పూర్వజన్మలో నా ఆత్మ పెద్ద సంగీత దర్శకుడిదని, ఆయన కోరిక నాతో తీర్చుకున్నాడని ఈమధ్యే నాతో నేను ప్రయాణం చేశాక అర్థమైంది. నాకు గుర్తింపు సంగీత దర్శకుడిగానే ఉన్నా... రాయడం అంటే చాలా ఇష్టం. తదుపరి దర్శకుడిగా  ఓ సంగీత ప్రధానమైన సినిమాని తెరకెక్కించడంకోసం సన్నాహాలు చేస్తున్నా. ఎన్నికల నేపథ్యంలోనూ ఓ కథ ఉంది. ఆ సినిమా విడుదలైతే ఎన్నికలు జరిగే తీరులోనే మార్పొస్తుంది. ‘బ్రోకర్‌’ సినిమాలో అందులో ఒక్క శాతం అవుతుందంతే. వెబ్‌ సిరీస్‌ కోసం కూడా రెండు కథలు రాశా’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని