Ahimsa: వెంకటేష్‌ రాకతో విలువ పెరిగింది

‘‘కొన్ని వందల మందికి అవకాశాలు ఇచ్చిన నిర్మాత డి.రామానాయుడు. ఆయన కోరిక మేరకు తీసిన చిత్రమే ఇది. అభిరామ్‌తో నేను సినిమా చేయడానికి ఆయనే ప్రధాన కారణం.

Updated : 31 May 2023 14:12 IST

‘‘కొన్ని వందల మందికి అవకాశాలు ఇచ్చిన నిర్మాత డి.రామానాయుడు. ఆయన కోరిక మేరకు తీసిన చిత్రమే ఇది. అభిరామ్‌తో నేను సినిమా చేయడానికి ఆయనే ప్రధాన కారణం. ఈ సినిమా తీయడానికి...  ఇంత బాగా రావడాఆనికి కారణం కూడా ఆయనే. ఆయన ఆశీస్సులతో బాగా ఆడుతుందని నమ్ముతున్నా’’ అన్నారు తేజ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘అహింస’. అభిరామ్‌ దగ్గుబాటి, గీతిక తివారీ నాయకానాయికలుగా పరిచయం అవుతున్నారు. పి.కిరణ్‌ నిర్మాత. జూన్‌ 2న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించింది.  ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘అభిరామ్‌, గీతిక ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ప్రతి సినిమాకీ కష్టపడుతూ... నేర్చుకుంటూ ముందుకు వెళ్లాలి. దర్శకుడు తేజ కొత్తతరంతో వాళ్లకి తగ్గ అంశాలతో మంచి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ తీసి విజయాలు అందుకున్నారు. ‘అహింస’ కూడా అన్ని రకాల భావోద్వేగాలతో తెరకెక్కింది. ఎవరూ చూడని లొకేషన్స్‌లో చిత్రీకరణ చేశారు. ఆర్పీ పట్నాయక్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అందరికీ నా అభినందనలు’’ అన్నారు. తేజ మాట్లాడుతూ ‘‘వెంకటేష్‌ ఈ వేడుకకి రావడంతో సినిమాకి విలువ పెరిగింది’’ అన్నారు. నిర్మాత పి.కిరణ్‌ మాట్లాడుతూ ‘‘తేజతో 20 యేళ్ల కిందటే సినిమా తీశాం. ఆయనతో ఎలా పనిచేయాలో తెలుసు. సినిమా ప్రయాణంలో కష్టాలు, ఆనందం అన్నీ ఉంటాయి. ఈ సినిమాలో ప్రేమతోపాటు యాక్షన్‌ కూడా ఉంటుంది. కచ్చితంగా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో గీతికా తివారీ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని