మార్షల్‌ఆర్ట్స్‌ వీరుడు.... మల్లయోధుడు కలిస్తే హిడెన్‌ స్ట్రైక్‌

మార్షల్‌ ఆర్ట్స్‌లో ధీరుడెవరంటే సినిమా అభిమానులకు మొదటగా గుర్తొంచే పేరు జాకీచాన్‌. ఇప్పుడాయన ప్రముఖ మల్లయోధుడు జాన్‌ సెనతో కలిసి అలరించనున్నారు.

Published : 01 Jun 2023 01:41 IST

మార్షల్‌ ఆర్ట్స్‌లో ధీరుడెవరంటే సినిమా అభిమానులకు మొదటగా గుర్తొంచే పేరు జాకీచాన్‌. ఇప్పుడాయన ప్రముఖ మల్లయోధుడు జాన్‌ సెనతో కలిసి అలరించనున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన ‘హిడెన్‌ స్ట్రైక్‌’ సినిమా ట్రైలర్‌ మంగళవారం విడుదలైంది. ‘భవిష్యత్తులో ఆయిల్‌ వార్‌ జరుగుతుంది. దాన్ని ఇద్దరే ఆపగలరు’ అనే ఆసక్తికర వ్యాఖ్యలతో మొదలై, మధ్యమధ్యలో వినోదం పంచే సన్నివేశాలతో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ అభిమానులను ఆకట్టుకుంది. ‘నీడ్‌ ఫర్‌ స్పీడ్‌’ చిత్ర దర్శకుడు స్కాట్‌ వాగ్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్టు ఎక్స్‌, ప్రాజెక్టు ఎక్స్‌ట్రాక్షన్‌, స్నాఫు ఇలా అనేక పేర్లు మార్చిన ఈ చిత్రం చివరికి ‘హిడెన్‌ స్ట్రైక్‌’ పేరును ఖరారు చేసింది. ‘ఇద్దరు మాజీ ప్రత్యేక సైనిక దళాల వీరులు ఒక బృందాన్ని బాగ్దాద్‌లోని హైవే ఆఫ్‌ డెత్‌ నుంచి భద్రతయుతమైన గ్రీన్‌ జోన్‌కు తరలించాలి’. వారిద్దరూ ఆ బృందాన్ని ఎలా తరలిస్తారనేది ఈ సినిమాలో ఆసక్తికరం. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


భార్య బాటలో రణ్‌వీర్‌

మన నటులు హాలీవుడ్‌లో సత్తా చాటడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ప్రియాంక చోప్రా అక్కడ తన హవా కొనసాగిస్తోంది. దీపికా పదుకొణె అప్పుడప్పుడూ మెరుస్తోంది. ఇప్పుడు ఆమె భర్త, ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌ కూడా హాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన ప్రముఖ హాలీవుడ్‌ టాలెంట్ ఏజెన్సీ విలియం మోరీస్‌ ఎండివోర్‌ (డబ్ల్యూఎంఈ)తో ఒప్పందం చేసుకున్నారు. బెన్‌ అఫ్లెక్‌, హగ్‌ జాక్‌మెన్‌, మిచెల్‌ విలియమ్స్‌, క్రిస్టియన్‌ బలె, మాట్ డామోన్‌ లాంటి హాలీవుడ్‌ సెలబ్రెటీలు ప్రాతినిధ్యం వహిస్తున్న డబ్యూఎంఈలో రణ్‌వీర్‌ సింగ్‌ ఒక భాగం కావడం విశేషం. దీపికా పదుకొణె 2021 నుంచే మరొక హాలివుడ్‌ టాలెంట్‌ ఏజెన్సీ ‘ఐసీఎం’ కు ప్రాతినిధ్యం వహిస్తుంది. 2010లో ‘బ్యాండ్‌ బాజా బరాత్‌’ చిత్రంలో అనుష్క శర్మతో కలిసి నటించి తన నటనతో పేక్షకులను కట్టిపడేసిన రణ్‌వీర్‌ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌ కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో వస్తున్న ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌  కహానీ’ చిత్రంలో ఆలియా భట్‌ తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో ధర్మేంద్ర, జయ బచ్చన్‌, షబాన అజ్మీ కీలక పాత్రలు పోషించనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం జులై 28న విడుదలకు సిద్ధంగా ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని