నటులకు ఆ ఆలోచనే ఉండకూడదు!

తెలుగులో వరుస సినిమాలతో జోరు చూపిస్తూ.. స్టార్‌ నాయికగా మెరుపులు మెరిపిస్తోంది శ్రీలీల.

Published : 03 Jun 2023 02:38 IST

తెలుగులో వరుస సినిమాలతో జోరు చూపిస్తూ.. స్టార్‌ నాయికగా మెరుపులు మెరిపిస్తోంది శ్రీలీల. ఓ వైపు బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ లాంటి అగ్రతారలతో కలిసి నటిస్తూనే.. మరోవైపు రామ్‌, నితిన్‌, వైష్ణవ్‌ తేజ్‌ లాంటి యువ హీరోలతోనూ ఆడిపాడుతోంది. అయితే వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో చేయడం వల్ల ఏదైనా ప్రత్యేక ముద్ర పడుతుందని ఎప్పుడైనా భయం కలిగిందా? అని ప్రశ్నిస్తే.. లేదంటూ తనదైన శైలిలో బదులిచ్చింది శ్రీలీల. ‘‘సీనియర్లతో వరుస సినిమాలు చేసిందని ఒకలా.. యువ హీరోలతోనే చేస్తోందని మరొకలా ఓ ప్రత్యేక ఇమేజ్‌ ఆపాదించే రోజులు ఎప్పుడో పోయాయి. జనం అసలలా ఆలోచించట్లేదు. చాలా అప్‌డేట్‌ అయ్యారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. సినిమా అనేది ఒకరు సృష్టించిన కథ. దాన్ని తెరపైకి తీసుకొస్తున్నారంటే అందులోని పాత్రలకు సరిగ్గా సరిపోయే తారల్నే ఎంచుకుంటారు. మనకిచ్చిన ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగలుగుతున్నామా, లేదా? అన్నదే ప్రేక్షకులు చూస్తారు తప్పితే పక్కన ఉన్నది అగ్ర హీరోనా, యువ హీరోనా అన్న ఆలోచన వాళ్లకు ఉండదు. వాళ్లకే కాదు ఏ ఆర్టిస్ట్‌కు ఈ ఆలోచన ఉండకూడదు. అసలు వయసును ఎప్పుడూ దృష్టిలోకి రానీయకూడదు’’ అని చెప్పింది శ్రీలీల. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, ‘ఆదికేశవ’ చిత్రాలతో పాటు నితిన్‌, రామ్‌, విజయ్‌ దేవరకొండ తదితరుల సినిమాల్లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని