ఈ వేసవికి అంతంతమాత్రం.... వినోదాల చల్లదనం

సంక్రాంతి సందడి ముగిసిందనగానే సినీ ప్రేమికుల చూపులు వేసవివైపు మళ్లుతుంటాయి. వేసవి వినోదం అంటే మనకు సినిమానే గుర్తొస్తుంది.

Updated : 03 Jun 2023 07:57 IST

అగ్రతారల సందడే లేదు

పోటాపోటీగా విడుదలయ్యే అగ్ర తారల సినిమాలు... కిక్కిరిసిపోయే హాళ్లు... అభిమానుల హంగామా... రికార్డు స్థాయి వసూళ్లూ...  

- తెలుగు సినీ వేసవి అంటే ఇంత సందడి ఉంటుంది. సెలవుల్లో సరదాల కోసం పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఆశ్రయించేది సినిమానే. ఎక్కువ రోజులు కొనసాగే ఈ సీజన్‌లో అగ్ర తారల చిత్రాలు  బాక్సాఫీసు ముందుకు దూసుకొస్తుంటాయి. మంచి టాక్‌ వచ్చిందంటే చాలు...  వసూళ్లు హోరెత్తుతుంటాయి. రికార్డుల మోత మోగుతుంటుంది. ఈసారి స్టార్ల సందడి లేదు. కానీ... సినిమాలకి మాత్రం లోటు లేదు. మరి విజయాలు ఏ మేరకు? ప్రేక్షకుల్ని అలరించిన సినిమాలు ఎన్ని?

సంక్రాంతి సందడి ముగిసిందనగానే సినీ ప్రేమికుల చూపులు వేసవివైపు మళ్లుతుంటాయి. వేసవి వినోదం అంటే మనకు సినిమానే గుర్తొస్తుంది. ఏయే సినిమాల్ని చూడాలో ముందుగానే సిద్ధమైపోతుంటారు. 2023 వేసవి కూడా బోలెడన్ని ఆశల్ని రేకెత్తించింది. కొద్దిమంది అగ్ర తారలు తమ సినిమాల కోసం బెర్త్‌లు కూడా ఖాయం చేశారు. విడుదల తేదీల్ని ప్రకటించినవి కొన్నైతే... వేసవికి పక్కా  అనే సంకేతాలు ఇచ్చిన సినిమాలు కొన్ని. కానీ వస్తాయనుకున్నవి చాలా వరకు రాలేదు. వచ్చిన సినిమాల్లోనూ అంచనాల్ని అందుకున్నవీ ఒకట్రెండే. జూన్‌ 16న విడుదలయ్యే ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’తో ఈ ఏడాది వేసవి ముగుస్తున్నట్టే. కానీ ఎప్పట్లా సందడి మాత్రం ఈసారి కనిపించలేదు. థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. రానున్న సినిమాలు ఏ మేరకు మెప్పిస్తాయో చూడాలి.

‘దసరా’ మెప్పించినా...

మార్చిలో విడుదలైన ‘బలగం’, ‘రంగమార్తాండ’  చిత్రాలు వేసవికి శుభారంభాన్ని ఇచ్చాయి. మంచి సినిమాలుగా  మెప్పు పొందడంతోపాటు..థియేటర్లకి వెళ్లాలనే ఓ ప్రత్యేకమైన ఆసక్తిని ప్రేక్షకుల్లో రేకెత్తించిన సినిమాలు అవి. అలాంటి  మంచి వాతావరణం మధ్య మార్చి 30న నాని ‘దసరా’ విడుదలైంది. అసలు సిసలు వేసవి ఇప్పుడే ఆరంభమైందన్నట్టుగా ఆ సినిమా వసూళ్లతో హోరెత్తించింది. రూ.100 కోట్ల వసూళ్ల పోస్టర్‌తో సినిమా వ్యాపారానికి హుషారును తెచ్చిపెట్టింది. కానీ ఆ హుషారు ఎంతోసేపు నిలవలేదు. వరుసగా ఆ తర్వాత వారాల్లోనే విడుదలైన  రవితేజ ‘రావణాసుర’, సమంత ‘శాకుంతలం’ ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయాయి.  మంచి అంచనాల్ని రేకెత్తించిన ఈ సినిమాలు బాక్సాఫీసుని పెద్దగా  ప్రభావితం చేయకుండానే వెనుదిరిగాయి. వేసవికి ఆయువుపట్టులాంటి ఏప్రిల్‌లో సాయిధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష’, అఖిల్‌ ‘ఏజెంట్‌’ చిత్రాలు విడుదలయ్యాయి.  వీటిలో ‘విరూపాక్ష’ విజయాన్ని సొంతం చేసుకుంది. మిస్టిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని భయపెడుతూ థ్రిల్‌ చేసింది. వేసవి సీజన్‌ని పక్కాగా సద్వినియోగం చేసుకుంది. భారీ వ్యయంతో రూపొందిన అఖిల్‌ ‘ఏజెంట్‌’ కనీస వసూళ్లని సొంతం చేసుకోలేకపోయింది. భారీ వ్యయంతో రూపొందిన ‘రావణాసుర’, ‘ఏజెంట్‌’, ‘శాకుంతలం’ చిత్రాలు పరాజయం కావడం చిత్రసీమకి ఓ పెద్ద కుదుపే.

ఆశలన్నీ ‘ఆదిపురుష్‌’పైనే..

అగ్ర తారల సినిమాలు లేక ఈ వేసవి వెలవెలబోయింది. పవన్‌కల్యాణ్‌, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ తదితర అగ్ర తారల సినిమాలు సెట్స్‌కే పరిమితం అయ్యాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ల సినిమాలూ అంతే. నాగార్జున అయితే ఇంకా కొత్త సినిమాని పట్టాలెక్కించనేలేదు. ఇలా కీలకమైన ఆయా కథానాయకుల సినిమాలేవీ రాకపోవడంతో ఈ వేసవి కళ తప్పింది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. భారీ వ్యయంతో తెరకెక్కిన ఆ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. రామాయణం ఆధారంగా రూపొందిన ఆ సినిమా ఈసారి వేసవికి  ఎలాంటి ముగింపునిస్తుందో చూడాలి. ఈలోపుగా పరిమిత వ్యయంతో రూపొందిన కొన్ని సినిమాలు బాక్సాపీస్‌ ముందుకొస్తున్నాయి. శుక్రవారం ‘నేను స్టూడెంట్‌ సర్‌’, ‘అహింస’, ‘పరేషాన్‌’ తదితర చిత్రాలు విడుదలైయ్యాయి.


అనువాదాలే ‘మే’లు

గోపీచంద్‌ ‘రామబాణం’, అల్లరి నరేశ్‌ ‘ఉగ్రం’ సినిమాలు మే నెలపై ఆశలు పెంచాయి. ఒకే రోజు విడుదలైన ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించలేకపోయాయి. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ‘కస్టడీ’, ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలు మంచి ప్రచారం చేసుకుని, అంచనాలు రేకెత్తించినా వాటికీ విజయాలు దక్కలేదు. ప్రచారంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన  ‘మళ్ళీ పెళ్లి’, ‘మేమ్‌ ఫేమస్‌’ చిత్రాలు ఆశించిన స్థాయిలో టాక్‌ని సొంతం చేసుకోలేకపోయాయి. ‘మేమ్‌ ఫేమస్‌’ నచ్చిందంటూ మహేష్‌బాబు, రాజమౌళి తదితర సినీ ప్రముఖులు ట్వీట్‌ చేశారు. వసూళ్ల పరంగా ఆ చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.  వేసవిలో అనువాద చిత్రాలూ పోటీపడుతుంటాయి. బాగుంటే వాటికీ బ్రహ్మరథం పడుతుంటారు తెలుగు ప్రేక్షకులు. ‘బిచ్చగాడు2’తో వచ్చిన విజయ్‌ ఆంటోనీకి మరో విజయం దక్కినట్టే. ఆ చిత్రానికి మంచి వసూళ్లు లభించాయి. మలయాళం నుంచి వచ్చిన ‘2018’ కూడా బాక్సాఫీస్‌ దగ్గర సత్తా చాటుతోంది. కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని