తెలుగు హీరో x హిందీ స్టార్‌

ట్రెండ్‌కు అనుగుణంగా ముందుకు సాగడం చిత్రసీమకున్న ఆనవాయితీ. కథలు - కలయికల విషయంలోనో...నాయకానాయికల జోడీల పరంగానో ఎప్పుడూ ఏదోక ట్రెండ్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తూనే ఉంటుంది.

Updated : 04 Jun 2023 03:04 IST

ట్రెండ్‌కు అనుగుణంగా ముందుకు సాగడం చిత్రసీమకున్న ఆనవాయితీ. కథలు - కలయికల విషయంలోనో...నాయకానాయికల జోడీల పరంగానో ఎప్పుడూ ఏదోక ట్రెండ్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇప్పుడిలా తెలుగులో మరో నయా ట్రెండ్‌ షురూ అయ్యింది. టాలీవుడ్‌ హీరో - బాలీవుడ్‌ విలన్‌ అన్నది పరిపాటిగా మారింది. పాన్‌ ఇండియా లక్ష్యంతో బరిలో దిగుతున్న చిత్రాలకు ఈ తరహా కలయికలు లాభసాటిగా ఉండటంతో.. దర్శక నిర్మాతలంతా ఇలాంటి కాంబినేషన్లు తెరపై చూపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో తెలుగు హీరోలతో తలపడుతోన్న బాలీవుడ్‌ స్టార్ల జాబితా అంతకంతకూ పెరుగుతోంది.

సినిమాలో హీరోయిజం పండాలంటే.. హీరోకి ప్రత్యర్థిగా కనిపించే విలన్‌ దీటుగా ఉండాల్సిందే. రాజమౌళి సహా పలువురు అగ్ర దర్శకులు నమ్మే సూత్రమిది. అయితే అదే ప్రతినాయక పాత్రను ఓ పర భాషా స్టార్‌తో చేయిస్తే.. ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాల్సిందే. పాన్‌ ఇండియా చిత్రాలకు ఈ తరహా కలయికలు మార్కెట్‌ పరంగానూ కలిసొస్తుండటంతో ఇప్పుడీ తరహా ప్రయోగాల జోరు రెట్టింపయ్యింది. ప్రస్తుతం వెంకటేష్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్‌’ అనే పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రంలో వెంకీని ఢీ కొట్టే ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ స్టార్‌ నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటిస్తున్నారు. ఆయనిందులో వికాస్‌ మాలిక్‌ అనే విలన్‌గా స్టైలిష్‌ లుక్‌లో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో హీరోగా అనేక చిత్రాల్లో సందడి చేసి ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేశారు అర్జున్‌ రాంపాల్‌. ఇప్పుడాయన తెలుగులో రెండు సినిమాల్లో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. అందులో ఒకటి బాలకృష్ణ - అనిల్‌ రావిపూడిల సినిమా కాగా.. మరొకటి పవన్‌ కల్యాణ్‌ - క్రిష్‌ కలయికలో వస్తున్న ‘హరి హర వీరమల్లు’. ఈ ‘వీరమల్లు..’లోనే రాంపాల్‌తో పాటు మరో బాలీవుడ్‌ స్టార్‌ కూడా విలన్‌గా నటిస్తున్నారు. ఆయనే బాబీ డియోల్‌. ఇందులో వీరిద్దరూ మొఘలు చక్రవర్తుల్లా కనిపించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రెండు సినిమాలూ త్వరలో థియేటర్లలోకి రానున్నాయి. అలాగే ఇప్పుడు పవన్‌ నటిస్తున్న ‘ఓజి’ (వర్కింగ్‌ టైటిల్‌), ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రాల్లోనూ విలన్లుగా బాలీవుడ్‌ స్టార్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సంజయ్‌ దత్‌, టైగర్‌ ష్రాఫ్‌ వంటి వారి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మరి ఆ ప్రచారం వాస్తవ రూపం దాల్చుతుందో.. లేదో వేచి చూడాలి.

మహేష్‌తో తలపడేదీ అక్కడి స్టారేనా!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ ఇప్పటికే ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’లో లంకేశుడిగా నటించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడాయన ‘దేవర’లో జూ.ఎన్టీఆర్‌తో కలిసి తలపడుతున్నారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. తీర ప్రాంత నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో భయమంటే ఎరుగని మృగాడిగా శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నారు సైఫ్‌. మరి ఆయనకు భయాన్ని పరిచయం చేసేందుకు ఎన్టీఆర్‌ ఎలాంటి అవతారమెత్తాడో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రభాస్‌ - మారుతి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్‌ దత్‌ నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే ఆయనిందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నారా? లేక మరేదైనా కీలక పాత్ర పోషిస్తున్నారా? అన్నది ఇంకా తేలలేదు. సినీ వర్గాల్లో మాత్రం సంజు విలన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం బలంగా వినిపిస్తోంది. మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ చిత్రంలో ప్రతినాయకుడు ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా కోసం ఫహాద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి తదితరుల పేర్లు ప్రచారంలో వినిపించినా.. ఇప్పుడా పాత్ర కోసం ఓ బాలీవుడ్‌ స్టార్‌ను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఎలాంటి పరిణామం?

మనకు ఇంతమంది నటులు ఉండగా హిందీ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటని? కొందరు సినీ ప్రముఖులు మాట్లాడుతున్నారు. సినిమాకు హద్దులు చెరిగిపోయాయి. కథ కోరితే ఎవరు ఎక్కడైనా నటించొచ్చు అని కొందరు అంటున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతున్నప్పుడు అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు ఉండటం అవసరం అంటున్నారు మరి కొందరు సినీ ప్రముఖులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు