Diamond ratna babu: స్ఫూర్తి రగిలించింది ఆయన మాట

ఇక నుంచి నవ్వించే సినిమాలే నా నుంచి వస్తాయంటున్నారు దర్శకుడు డైమండ్‌ రత్నబాబు.

Updated : 06 Jun 2023 14:22 IST

ఇక నుంచి నవ్వించే సినిమాలే నా నుంచి వస్తాయంటున్నారు దర్శకుడు డైమండ్‌ రత్నబాబు. రచయితగా పలు చిత్రాలతో విజయాల్ని అందుకున్న ఆయన.. ఆ తర్వాత మెగాఫోన్‌ చేతపట్టారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్‌’. అన్‌ లిమిటెడ్‌ ఫన్‌... అనేది ఉపశీర్షిక. వి.జె.సన్నీ, సప్తగిరి కథానాయకులుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు డైమండ్‌ రత్నబాబు(Diamond ratna babu).

‘‘రచయితగా నాకు పేరు తీసుకొచ్చింది కామెడీనే. ‘సీమశాస్త్రి’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘ఈడో రకం ఆడోరకం’... ఇలా నవ్వించిన సినిమాలే నాకు గుర్తింపుని తెచ్చిపెట్టాయి. మిగిలిన సినిమాలతో పోలిస్తే కామెడీ సినిమాలు చేయడం చాలా కష్టం. ప్రతి రచయిత, దర్శకుడికి వారి బలం ఏమిటో తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. దర్శకుడిగా మారాక నా బలంపై దృష్టి పెట్టకుండా ప్రయోగాలు చేశాను. ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. అందుకే ఇప్పట్నుంచి దర్శకుడిగా కామెడీ సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నా. అందులో భాగమే ‘అన్‌స్టాపబుల్‌’. ఒకరు చిచ్చా.. మరొకరు మచ్చా. ఈ ఇద్దరూ కలిసి చేసే రచ్చే ఈ చిత్రం. చిత్ర పరిశ్రమలోని హాస్య నటులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి రెండు గంటలపాటు కడుపుబ్బా నవ్వించాలనే లక్ష్యంతో తీసిన సినిమానే ఇది. ఇందులో  బ్రహ్మానందం సర్‌ లేరనే లోటు మొన్న ఆయన ఈ సినిమా  ట్రైలర్‌ విడుదల వేడుకకి రావడంతో తీరిపోయింది’’.

‘‘దర్శకుడిగా ఇంతకుముందు నేను తీసిన రెండు సినిమాలూ తృప్తినివ్వలేదు. ఆ సమయంలోనే బాలకృష్ణ చేసిన షో ‘అన్‌స్టాపబుల్‌’ చూశా. ‘చిత్తశుద్ధి లక్ష్యశుద్ధితో పని చేస్తే ఆ పంచభూతాలు కూడా నిన్ను ఆపలేవు’ అంటూ ఆయన చెప్పిన మాటే నాలో స్ఫూర్తిని రగిల్చింది. ఆ షో మరోమారు నన్ను నేను పునఃశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడింది. ఈ సినిమాలోని పాత్రలు పోటాపోటీగా వస్తూ నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంటాయి. కథలోనూ అంతే వేగం కనిపిస్తుంది. అలా ఆ రెండు కారణాలతో ఈ సినిమాకి ‘అన్‌స్టాపబుల్‌’ అనే పేరు పెట్టాం. కథానాయకుడు బాలకృష్ణ పుట్టినరోజుకి ఒక రోజు ముందుగా, ఆయనకి ఓ చిరు కానుకగా జూన్‌ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సన్నీ పక్కా మాస్‌ పాత్రలోనూ...  జిలానీ రాందాస్‌గా సప్తగిరి  చేసే హంగామా కీలకం. అంత మంది  హాస్యనటులతో సినిమా చేయడం ఆషామాషీ కాదు. పక్కా ప్రణాళికతో సినిమాని పూర్తి చేశాం. భీమ్స్‌ సంగీతం, కాసర్ల శ్యామ్‌ పాటలు, ఉద్ధవ్‌ కూర్పు, వేణు కెమెరా పనితనం  సినిమాకి ప్రధానబలం. ఇంటిల్లిపాదీ కలిసిచూసేలా సినిమా ఉండాలనే ఉద్దేశంతో రజత్‌రావు రాజీపడకుండా నిర్మించారు’’.


‘‘దర్శకుడైతే మనం అనుకున్నది తెరపైకి తీసుకు రావచ్చనే ఉద్దేశంతోనే మెగాఫోన్‌ పట్టుకున్నా. ఇటువైపు ఎందుకొచ్చానని ఎప్పుడూ అనిపించలేదు. చివరి వరకూ దర్శకుడిగానే కొనసాగుతా. నాలో ఆత్మవిశ్వాసం ఉంది. రచయితగా ఎలా నవ్వించానో, దర్శకుడిగానూ అంతే ప్రభావం చూపిస్తా. సీనియర్‌ దర్శకులు  సింగీతం శ్రీనివాసరావు నాకు స్ఫూర్తి. ప్రతి రచయితలోనూ దర్శకుడు ఉంటాడు. తమిళ చిత్ర పరిశ్రమలో రాసేవాళ్లే దర్శకులు. తెలుగులో కూడా ఆ ట్రెండ్‌ మొదలైంది. రచయితల్ని నమ్మి కథానాయకులు అవకాశాలు ఇస్తున్నారు’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని