Tollywood: హీరో జోరు.. రానుంది కొత్త కబురు

విడుదలయ్యే సినిమాలు ఒక పక్క... కొత్తగా  పట్టాలెక్కే సినిమాలు మరోపక్క! చిత్రసీమ ఎప్పుడూ ఓ నిత్య ప్రవాహంలా కనిపిస్తుంటుంది. విజయాలొచ్చినా... పరాజయాలు ఎదురైనా ఆ ప్రభావం కొన్నాళ్లే.

Updated : 06 Jun 2023 05:00 IST

విడుదలయ్యే సినిమాలు ఒక పక్క... కొత్తగా  పట్టాలెక్కే సినిమాలు మరోపక్క! చిత్రసీమ ఎప్పుడూ ఓ నిత్య ప్రవాహంలా కనిపిస్తుంటుంది. విజయాలొచ్చినా... పరాజయాలు ఎదురైనా ఆ ప్రభావం కొన్నాళ్లే. ఆ వెంటనే మరో కొత్త సినిమాకి క్లాప్‌ కొట్టాల్సిందే. ఒకప్పటిలా మన అగ్ర తారలు సినిమాకీ సినిమాకీ మధ్య విరామం తీసుకోవడం లేదు. ఒక సినిమా చేస్తున్నప్పుడే... మరో కథ రెడీ అయిపోతోంది. ఒకేసారి రెండు మూడు సినిమాలతోనూ జోరు ప్రదర్శిస్తున్న తారలూ ఇప్పుడు చాలా మందే.  కరోనా తర్వాత మారిన ఆ పరిస్థితుల ప్రభావంతో రెండు మూడు నెలలకోమారు గంపగుత్తగా కొన్ని కలయికలు ఖరారవుతూ సినీ ప్రేమికుల్ని ఊరిస్తున్నాయి. రానున్న ఒకట్రెండు నెలల్లో ఈ హీరోలంతా వరుసగా కొత్త సినిమా కబుర్లు వినిపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

బాలకృష్ణ 108.. 8న

గ్ర తారల కొత్త సినిమా విడుదలలే కాదు... పట్టాలెక్కనున్న వాళ్ల కొత్త సినిమా కబురు కూడా అభిమానుల్లో ఉత్సాహం నింపుతుంది. తమ హీరో ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు?  ఎప్పుడు విడుదలవుతుంది? అది ఎలాంటి చిత్రం? అంటూ ఆసక్తిగా ఆరాలు తీస్తుంటారు. అందుకే ఆయా సినిమాల అధికారిక ప్రకటనలు కూడా ఓ హంగామా మధ్య బయటికొస్తుంటాయి. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ పుట్టినరోజు ఈ నెల 10. ఈ సందర్భంగా ఆయన సినిమాలకి సంబంధించిన బోలెడన్ని కబుర్లు వినిపించనున్నాయి. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న 108వ సినిమా పేరుని 8వ తేదీనే అధికారికంగా ప్రకటిస్తారు. ప్రచార చిత్రం కూడా విడుదల కానుంది. అంతే కాదు... ఆయన తదుపరి సినిమా కూడా అధికారికంగా ఖరారు కానుంది. బాలకృష్ణ - బాబీ కలయికలో సినిమాని ఆ రోజు ప్రకటించేందుకు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. చిరంజీవితో ‘వాల్తేర్‌ వీరయ్య’ తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు బాబీ. మరోసారి తన శైలి మాస్‌ కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరో అగ్ర తార చిరంజీవి కొత్త సినిమా కబురు కూడా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పలువురు యువ దర్శకులతో కథా చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ వేసవిలో ఓ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న యువ దర్శకుడితో చిరంజీవి సినిమా చేయనున్నట్టు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ కలయికలో సినిమా కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం ‘భోళాశంకర్‌’ చేస్తున్నారు. అది కూడా చివరి దశకు చేరుకుంది.  


‘క్రాక్‌’ కలయిక పక్కా

వితేజ - గోపీచంద్‌ మలినేని కలయికలో వచ్చిన ‘క్రాక్‌’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయవంతమైన  ఆ కలయికలో మరో చిత్రానికి రంగం సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. గోపీచంద్‌ మలినేని ‘వీరసింహారెడ్డి’తో ఘన విజయాన్ని సొంతం చేసుకుని ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా గడుపుతున్న రవితేజ కోసం మరో మాస్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నారు గోపీచంద్‌ మలినేని. మరో అగ్ర కథానాయకుడు నాగార్జున నటించనున్న  కొత్త సినిమా కోసం కూడా చాలా రోజులుగా కసరత్తులు సాగుతున్నాయి. ఈ నెలలోనే ఆ సినిమాకి సంబంధించిన కొత్త కబురు వినిపించే అవకాశాలు ఉన్నాయి.  


యువ తారలు సిద్ధం

‘ఖుషి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ తదుపరి సినిమా కూడా ఖరారైంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆ సినిమా రూపుదిద్దుకోనుంది. దీంతోపాటు త్వరలో మరో సినిమానీ పట్టాలెక్కించేందుకు విజయ్‌ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పరశురామ్‌ దర్శకత్వం వహించనున్నారు.  ‘గీతగోవిందం’ తర్వాత ఆ కలయికలో రూపుదిద్దుకోనున్న మరో చిత్రమిది. మరో యువ కథానాయకుడు నాగచైతన్య కూడా వెంటనే కొత్త సినిమాతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ‘కార్తికేయ2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య సినిమా చేయనున్నారు. ఇదివరకు ఈ ఇద్దరూ కలిసి ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ చిత్రాలు చేశారు. ఈ కలయికలో మూడో చిత్రం జీఏ2 నిర్మాణంలో రూపుదిద్దుకోనుందని సమాచారం. టాలీవుడ్‌లో సినిమా నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త కలయికలు వెలుగులోకి వస్తున్నాయి. తెరవెనక మరిన్ని కలయికల కోసం స్క్రిప్టులు వడివడిగా సిద్ధం అవుతున్నాయి. ఇవి కాకుండా త్వరలోనే మరో దఫా కొత్త సినిమాల ప్రకటనలు రానున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని