Adipurush: ఆదిపురుష్‌ సినిమా కాదు... ఓ భావోద్వేగం!

‘‘ప్రతి వ్యక్తిలోనూ రాముడు ఉన్నాడు, ప్రతి గుండెలోనూ రాముడు ఉన్నాడు. మనందరిలో ఉన్న రాముడిని బయటికి తీసుకురావడానికి ప్రభాస్‌ ఈ సినిమా చేశాడ’’న్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌ స్వామి.

Updated : 07 Jun 2023 13:58 IST

- ప్రభాస్‌

‘‘ప్రతి వ్యక్తిలోనూ రాముడు ఉన్నాడు, ప్రతి గుండెలోనూ రాముడు ఉన్నాడు. మనందరిలో ఉన్న రాముడిని బయటికి తీసుకురావడానికి ప్రభాస్‌ ఈ సినిమా చేశాడ’’న్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌ స్వామి. ఆయన ముఖ్య అతిథిగా మంగళవారం తిరుపతిలో ‘ఆదిపురుష్‌’ (Adipurush) విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ప్రభాస్‌ రాఘవుడిగా, కృతి సనన్‌ జానకిగా నటించారు. సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి పాత్ర పోషించారు. ఓం రౌత్‌ దర్శకుడు. భూషణ్‌కుమార్‌, కృష్ణకుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. టీజీ విశ్వప్రసాద్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 16న తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ వేడుకని ఉద్దేశించి చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ ‘‘నిజమైన ‘బాహుబలి’ రాముడే అని లోకానికి నిరూపించడం కోసమే ఈ సినిమా చేశారు. అందుకే మేం ఈ వేడుకకి వచ్చాం. మానవ జాతికి మంచి మార్గాన్ని చూపించిన మహనీయుడు శ్రీరామచంద్రుడు. ఆయన గురించి ఎవరెన్ని చెప్పినా ఈ మట్టిమీద నడిచి పావనం చేసిన మహాపురుషుడు. మానవ జాతికి ఆదర్శమైన పురుషుడు. రామాయణంలో అరణ్యకాండ, యుద్ధకాండలోని ప్రధానమైన కథని చరిత్రగా లోకానికి అందించాలనే ఆశతో ఈ సినిమా చేశామని చెప్పారు దర్శకుడు. ఇంతకంటే లోకానికి మహోపకారం మరొకటి ఉండదు. ఇలాంటివి మరిన్ని చేసే శక్తి ఆ భగవంతుడు ఈ బృందానికి ఇవ్వాలని కోరుకుంటున్నా. రామాయణం ఆధారంగా సినిమాలు చాలా వచ్చాయి. కానీ తరం గడిచింది. ఈ తరానికి, దేశానికీ, ప్రపంచానికి మళ్లీ రాముడు కావాలి. ఈ తరానికి తగ్గ సాంకేతికతో చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘‘యువతీ యువకులకి ఆదర్శంగా ఉండేలా సినిమాని నిర్మించారు. ఇలాంటి గొప్ప చిత్రం నిర్మించినందుకు బృందాన్ని అభినందిస్తున్నా’’ అన్నారు. టి.సిరీస్‌ అధినేత భూషణ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘రామాయణం ఆధారంగా సినిమా తీయాలనేది మా నాన్న గుల్షన్‌కుమార్‌ కోరిక. ఆయన కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఓం రౌత్‌ వల్లే ఈ ప్రయత్నం విజయవంతమైంది. ఆయన విజన్‌ గొప్పగా ఉంటుంది. తెరపై చూసి తరించాల్సిందే. మా అమ్మ లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. మాకు ఇది సినిమా కాదు, ఓ భావోద్వేగం’’ అన్నారు.

దర్శకుడు ఓం రౌత్‌ మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌ లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. ఇది ఏ ఒక్కరి సినిమానో కాదు, భారతీయ సినిమా. మా నిర్మాత భూషణ్‌ నాకు ఈ చిత్రం చేసే అవకాశాన్నిచ్చారు. ఆయన తండ్రి కల ఈ సినిమాతో నెరవేరినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. కృతిసనన్‌ మాట్లాడుతూ ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలోనే నా కెరీర్‌ని మొదలుపెట్టాను. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఈ వేదికపై ఉన్నా. ఇది చాలా విలువైన సినిమా నాకు. జానకి చాలా ప్రత్యేకమైన పాత్ర. కొద్దిమంది నటులకి మాత్రమే ఇలాంటి అవకాశం దొరుకుతుంది. ప్రేమ, ఆశీర్వాదాలతోనే ఈ అవకాశం నాకు దొరికింది. జానకి పాత్ర నన్ను ఎంచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఇది అన్ని పాత్రల్లా కాదు. సీతమ్మ పాత్ర చాలా శక్తివంతమైనది. ఎంతో  స్వచ్ఛత, ప్రేమ ఉన్న ఆ పాత్రలో నటిస్తున్నప్పుడు కలిగిన అనుభూతే వేరు’’ అన్నారు. కార్యక్రమంలో చినజీయర్‌ స్వామి కథానాయకుడు ప్రభాస్‌తోపాటు చిత్రబృందాన్ని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.

రామాయణం... మా అదృష్టం: ప్రభాస్‌

‘‘ఏడు నెలల ముందు త్రీడీలో నా అభిమానుల కోసం టీజర్‌ని చూపించండని దర్శకుడిని అడిగా. వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహమే ఈ బృందాన్ని ముందుకు నడిపించింది. ట్రైలర్‌ని కూడా మళ్లీ అభిమానులకి చూపించాలని కోరా. అభిమానులే బలం. ఈ సినిమా కోసం దర్శకుడు, నిర్మాతలు, సాంకేతిక బృందం ఎనిమిది నెలలు యుద్ధం చేసింది. ఒకొక్కళ్లు రోజుకి 20 గంటలపాటు పని చేశారు. ఇది సినిమా కాదు... మా అదృష్టం. చిరంజీవి సర్‌ని కలిసినప్పుడు ‘రామాయణం చేస్తున్నావా?’ అని అడిగారు. అవుననగానే ‘అది అందరికీ దొరికే అవకాశం కాదు, నీకు దొరికింది. నిజంగా నీ అదృష్టం’ అన్నారు. ఇలాంటి సినిమా తీసేటప్పుడు కష్టాలు కూడా చాలా ఎక్కువగా వుంటాయి. ఈ సినిమాకీ తొలి నుంచీ కష్టాలొచ్చాయి. ఓం రాక్‌స్టార్‌లా కష్టపడ్డాడు. ఇరయ్యేళ్ల కాలంలో ఇంత కష్టపడిన దర్శకుడిని మరొకరిని చూడలేదు. చినజీయర్‌ స్వామి గారికి కృతజ్ఞతలు. ఆయన రాకతో ఈ వేడుకకి మంచి ప్రాధాన్యత వచ్చింది. నిర్మాత భూషణ్‌కి ఈ సినిమా ఓ భావోద్వేగం. ఏ సినిమాకీ కష్టపడనంత కష్టపడ్డారు. జానకి పాత్రలో కళ్లల్లో నీళ్లు పెట్టుకున్న ఒక్క పోస్టర్‌తోనే కృతిసనన్‌ అందరినీ తనవైపు తిప్పుకుంది. మంచి పేరున్న, మంచి అమ్మాయే కథానాయిక కావాలని తనని ఎంచుకున్నాం. హనుమంతుడు, లక్ష్మణుడి పాత్రలు పోషించిన దేవ్‌దత్‌, సన్నీలతో కలిసి నటిస్తున్నప్పుడు తెలియని ఓ కొత్త భావోద్వేగానికి గురయ్యాను’’ అన్నారు ప్రభాస్‌. అభిమానుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘మామూలుగా కంటే ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. ఏడాదిలో మూడు సినిమాలు కూడా రావొచ్చు. తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా’’ అన్నారు. పెళ్లి గురించి అభిమానులు ప్రస్తావించగా... ‘‘ఎప్పుడైనా తిరుపతిలోనే చేసుకుంటాలే’’ అంటూ సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్‌వర్మ, ప్రవీణ్‌ సత్తారు, వివేక్‌ కూచిభొట్ల, అనిల్‌ తడానీ, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, అజయ్‌-అతుల్‌, శివ్‌, నీరజ్‌ కల్యాణ్‌, శివమ్‌ చానన, వరుణ్‌ గుప్తా, సన్నీసింగ్‌, దేవ్‌దత్‌, వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌, రాహుల్‌ దూబే, ఇషాంత్‌, రాజన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని