విద్యార్థులు జాతిసంపద... నిర్వీర్యం కాకూడదు!

‘‘ప్రేక్షకులది గొప్ప మనసు. వాళ్లు భారీ హంగులున్న చిత్రాల్ని చూస్తారు, నచ్చేలా తీస్తే సామాజిక సమస్యలతో కూడిన ఇతివృత్తాల్నీ ఆదరిస్తారు.

Published : 08 Jun 2023 01:59 IST

‘‘ప్రేక్షకులది గొప్ప మనసు. వాళ్లు భారీ హంగులున్న చిత్రాల్ని చూస్తారు, నచ్చేలా తీస్తే సామాజిక సమస్యలతో కూడిన ఇతివృత్తాల్నీ ఆదరిస్తారు. సమాజంలో ఉత్పన్నమయ్యే సమస్యలపై ఓ కళాకారుడిగా స్పందిస్తూ నలభయ్యేళ్లుగా సినిమాలు తీస్తున్నా. అందులో భాగంగా తీసిన మరో చిత్రమే ‘యూనివర్సిటీ’. గత చిత్రాల్లాగే ఆలోచన రేకెత్తిస్తూనే... ప్రేక్షకులకి వినోదం పంచుతుంది’’ అన్నారు ఆర్‌.నారాయణమూర్తి. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆర్‌.నారాయణమూర్తి బుధవారం ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు.

‘‘భారతదేశ రాజ్యాంగం విద్య, వైద్య రంగాల్ని సేవారంగాలుగా పేర్కొంటూ... వీటిని వ్యాపారం  చేయకూడదని చెప్పింది. ఏ ప్రైవేట్‌ సంస్థలో...  కార్పొరేట్‌ సంస్థలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పింది. అలా చేసినప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది. కానీ ప్రస్తుతం అన్ని చోట్లా రాజ్యాంగానికి విరుద్ధంగా విద్య, వైద్య రంగాలు వ్యాపారమయం అయ్యాయి. దాని ఫలితాలే పేపర్‌ లీకేజీలు. ర్యాంకుల పోటీలో ప్రైవేట్‌ సంస్థలు పేపర్‌ లీకేజీలకి పాల్పడుతూ ఓ మాఫియాలా అవతరించాయి.  చదువుల్లోనే కాదు.. ఉద్యోగ నియామక పరీక్షల్లోనూ ఇదే తంతు. దాంతో బాగా చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగుల జీవితాలు అగమ్య గోచరంగా మారుతున్నాయి. ఇది ధర్మం కాదు. విద్యార్థులు మన జాతిసంపద. ప్రపంచాన్ని నిర్మించే ఓ గొప్ప మానవ వనరు. వాళ్ల ప్రతిభని,  మేథస్సుని గుర్తించి ఉద్యోగావకాశాలు కల్పించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా’’.


* ‘‘అగ్ర తారలున్న సినిమాలే కాదు, ప్రేక్షకులకు సినిమా నచ్చిందంటే తెరపైన ఎవరైనా ఒక్కటే. ఆ విషయాన్ని మన సినిమాలు తరచూ రుజువు చేస్తున్నాయి. గూడవల్లి రామబ్రహ్మం మొదలుకొని టి.కృష్ణ వరకు ఎంతోమంది సామాజిక సమస్యలే ఇతివృత్తాలుగా సినిమాలు తీశారు. ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి నలభయ్యేళ్లుగా నేనూ అదే పంథాలో సాగుతూ సినిమాలు తీస్తున్నా. ఇప్పుడు ‘యూనివర్సిటీ’తో విద్యార్థుల తల్లిదండ్రులు తమ బిడ్డలపై పెట్టుకున్న ఆశలు అడియాశలు కాకూడదని వాళ్లు కన్న కలలు కల్లలు కాకూడదని చెబుతున్నా. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నదేశం మన భారతదేశం. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగం ఉన్న దేశం మనదే. దీనికి కారణం విద్య, వైద్య విమానయానం నౌకాయానం. ఎల్‌.ఐ.సి, బీమా, బ్యాంకింగ్‌, రైల్వేల వంటి ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయి. ఈ దశలో నిరుద్యోగం పెరిగిపోవడమే కాకుండా బడుగు బలహీనవర్గాలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ హక్కులు కోల్పోతున్నాయి. అందుకే 1986లో డా.మురళీధరరావు కమిషన్‌, 1990లో మండల్‌ కమిషన్‌ ప్రభుత్వ సంస్థలోనే కాదు, ప్రైవేటు సంస్థల్లో కూడా రిజర్వేషన్‌ అమలు చేయాల్సిందే అని సిఫార్సు చేశాయి. ఎవరి వాటా వాళ్లకి దక్కాల్సిందే, ఎవరి కోటా వాళ్లకి చెందాల్సిందే అని చెప్పారు. దాన్ని అమలు చేయాలనే అంశాన్ని ఇందులో బలంగా చెప్పా’’.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని