victory madhusudhan rao: విక్టరీ చిత్రాల ఫ్యాక్టరీ

వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ తొలితరం వైతాళికుల శతజయంతులు నిర్వహించుకొంటున్న తరుణమిది.

Updated : 11 Jun 2023 12:50 IST

వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ తొలితరం వైతాళికుల శతజయంతులు నిర్వహించుకొంటున్న తరుణమిది. ఈ కోవలో దిగ్గజ నటులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తొలిదశ విజయాల ప్రధాన భాగస్వాముల్లో మేటి దర్శకుడు వీరమాచినేని మధుసూదనరావు (victory madhusudhan rao) పేరు మరువలేనిది. వీరంతా బ్రిటిష్‌ ఇండియాలోని మద్రాస్‌ ప్రెసిడెన్సీ పరిధిలో పుట్టినవారు కావడం విశేషం. 1923 జూన్‌ నెలలో బెజవాడ పక్కనున్న కృష్ణాజిల్లా ఈడుపుగల్లు గ్రామంలోని రామభద్రయ్య, అన్నపూర్ణమ్మ దంపతుల ఇంట నలుగురు సంతానంలో ఒకరిగా మధుసూదనరావు పుట్టారు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎంతో వైవిధ్యమైన జీవనపోరాటం సాగించి.. ‘విక్టరీ’ మధుసూదనరావుగా ఆయన ఎదిగిన తీరు అసాధారణం. జూన్‌ 14న ఆయన శతజయంతి. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో మధుసూదనరావు శతజయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలుగువారు గర్వించదగ్గ రీతిలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో 70కు పైగా చలనచిత్రాలను మనకు అందించిన దర్శక మేధావి స్ఫూర్తిదాయక జీవనయానం ఓమారు పరిశీలిద్దాం.

డేళ్ల పసిప్రాయంలో తల్లి మృతితో రెండేళ్ల చెల్లెలి బాధ్యతలు.. సోడాలు అమ్మి, వేరుశనగ చేలలో పనిచేసిన చిట్టిచేతులు.. చదువెక్కడ ఆగిపోతుందోనని పరిగలేరి అమ్మిన విద్యార్థిదశ.. వారాలు చేస్తూ పునాదిపాడులో హైస్కూలు విద్యాభ్యాసం.. అభ్యుదయ భావాలతో ప్రజానాట్యమండలిలో చేరి నెలకు పాతిక రూపాయల జీతంతో పదేళ్లు పార్టీ సేవ.. కమ్యూనిస్టుల రహస్య కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు గడిపిన జైలుజీవితం.. ప్రజానాట్య మండలిలో సహ కళాకారిణి సరోజినితో ప్రేమ, పాతిక రూపాయల ఖర్చుతో దండల పెళ్లి.. కుటుంబ జీవనానికి ఆ ఆదాయం చాలక బెజవాడలో కిళ్లీకొట్టు నడిపిన అనుభవం.. బతుకుతెరువు కోసం సినీ పరిశ్రమలోకి వెళ్లాక పదేళ్లు సహాయ దర్శకుడిగా, స్క్రిప్ట్‌ రచయితగా పోరాటం.. తొలినాళ్లలో రాబడి సరిపోక డ్రిల్‌ టీచరుగా, ట్యూషన్‌ మాస్టారుగా చిరు ఉద్యోగాలు.. ఊళ్లో తండ్రి చనిపోతే మద్రాసు నుంచి వెళ్లేందుకు వంద రూపాయల బాకీ కోసం నలుగురి చుట్టూ తిరగిన చేదు గుర్తులు.

మూడు పదుల వయసు నిండేనాటికి ఇన్ని కష్టాలకు ఎదురీదిన ఓ వ్యక్తి కొత్తరంగంలోకి అడుగు పెట్టి, విజయాన్ని తన ఇంటిపేరుగా మార్చుకోవడం సాధారణ విషయం కాదు. ఇప్పటికీ వీరమాచినేని మధుసూదనరావు అంటే చాలామందికి తెలియదు. విక్టరీ మధుసూదనరావంటే (victory madhusudhan rao) తెలుగు సినీ అభిమానులకు ఆ రూపం, ఆయన తీసిన కుటుంబ కథాచిత్రాలు ఇట్టే గుర్తుకువస్తాయి. విద్యార్థి దశ నుంచే నాటకానుభవం కూడా ఉన్న ఆయనకు ఆ రంగంలో ముందే పరిచయమైన ఎన్టీఆర్‌, తాతినేని ప్రకాశరావు లాంటి వారి సహకారంతో సినీరంగ ప్రవేశం సులువుగానే జరిగింది. నేటి ప్రముఖ దర్శకుడైన కె.రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్‌.ప్రకాశరావు నిర్వహిస్తున్న ప్రకాశ్‌ స్టూడియోలో వంద రూపాయల జీతంతో ‘కన్నతల్లి’ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేరారు. నటీనటులకు వాచక పాఠాలు చెప్పడం ఈయన పని. సుమారు పదేళ్లు ఇలా నెట్టుకొచ్చిన మధుసూదనరావు 1959లో ‘సతీ తులసి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. కమ్యూనిస్టు భావాలు గల వ్యక్తి భక్తిరస ప్రధాన చిత్రంతో పరిచయం కావడం విశేషం. ఇదొక్కటే కాదు.. ఆ తర్వాతి కాలంలో అక్కినేనితో తీసిన ‘భక్త తుకారాం’, ‘చక్రధారి’ లాంటి ఆధ్యాత్మిక చిత్రాలను సైతం ఘన విజయాలుగా మలిచిన సవ్యసాచి ఆయన. 1959లో తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన మధుసూదనరావు కేవలం ఇరవై ఏళ్ల వ్యవధిలో 90 శాతం విజయాలతో 1979 నాటికి కృష్ణంరాజు హీరోగా తీసిన ‘శివమెత్తిన సత్యం’తో 50 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మద్రాసులో ఆయన శిష్యులు ఘనమైన స్వర్ణోత్సవ సభ ఏర్పాటుచేసి గురువును సత్కరించారు. పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎ.కోదండరామిరెడ్డి లాంటి ప్రముఖ దర్శకులు ఆయన శిష్యులే. 1983లో హైదరాబాదు కేంద్రంగా ‘మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌’ను ప్రారంభించి నటనపరంగానూ పలువురికి శిక్షణ ఇచ్చి నటగురువు అనిపించుకున్నారు.

* రీమేక్‌ చిత్రాలను తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీసి విజయవంతం చేయడంలో మధుసూదనరావుకు మంచి పేరుంది. ఈ కారణంగానే నటుడు నాగార్జున ‘విక్రమ్‌’ (హిందీలో హీరో) చిత్రంతో, సూపర్‌స్టార్‌ కృష్ణ తనయుడు రమేశ్‌బాబు ‘సామ్రాట్‌’ (హిందీలో బేతాబ్‌) చిత్రంతో ఆయన ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు. జగపతిబాబు తొలిచిత్రం ‘సింహస్వప్నం’ దర్శకుడు కూడా మధుసూదనరావే. పద్మాలయా వారు తీసిన హిందీ ‘లవ్‌ కుశ్‌’ (1997) చిత్రానికీ దర్శకత్వం వహించారు. ఆయన తీసిన ‘గుడిగంటలు’, ‘ప్రజానాయకుడు’, ‘కాంచనగంగ’ తదితర చిత్రాలు రాష్ట్ర ప్రభుత్వ నందులు గెలుచుకున్నాయి. అన్నాచెల్లెళ్ల అనుబంధ చిత్రీకరణలో నేటికీ గొప్ప చిత్రంగా అందరూ భావించే ‘రక్తసంబంధం’లో చాలా దృశ్యాలు ఆయన స్వీయానుభవాలే. 

అమ్మో.. మధుసూదనరావు కోపిష్టి

మధుసూదనరావుకు (victory madhusudhan rao) కోపమెక్కువ అనే ప్రచారం చిత్రసీమలో విస్తృతంగా ఉండేది. ఆ కోపం చేసే పనిలో పూర్తి నాణ్యత కోసమే అని దగ్గరగా ఎరిగినవారు చెబుతారు. ‘‘ఆయన టేకింగులో తికమక ఉండదు. డ్రామా పండించటంలో దిట్ట. ఆ కోపం కొంతసేపే’’ అని అక్కినేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రామానాయుడు తీసిన ‘చక్రవాకం’ చిత్రం షూటింగులో జరిగిన ఓ ఘటన ఆయన పనితీరుకు నిదర్శనం. క్లైమాక్స్‌లో కథానాయకుడు శోభన్‌బాబు ఆందోళనతో పరుగున నది వద్దకు వస్తాడు. నది పోటు మీద ఉందని, వెళ్లొద్దని పడవవాడు చెబుతాడు. ఈ పాత్ర పోషిస్తున్న అప్పటి సహాయ దర్శకుడు కాట్రగడ్డ మురారి (గోరింటాకు నిర్మాత) డైలాగు సరిగా చెప్పలేదు. ఆ సీను ముగిస్తే పేకప్‌ చెప్పేందుకు సిద్ధంగా ఉన్న దర్శకుడు మధుసూదనరావు విసురుగా వెళ్లి.. ప్యాంటూ చొక్కా విప్పదీసి తువాలు చుట్టుకొని పడవవాడి పాత్ర తానే పోషించి చకచకా కారెక్కి వెళ్లిపోయారు.


* భార్య సరోజిని.. మధుసూదనరావు ఆదర్శాలకు తగ్గ ఇల్లాలు. పార్టీ కోసం పనిచేసేందుకు సంతానం అడ్డుగా ఉంటుందని భావించిన ఇద్దరూ తొలిచూలుకు అబార్షను చేయించారు. ఆ తర్వాత పెద్దలు సర్దిచెప్పటంతో ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చారు. సావిత్రి దర్శకత్వంలో అందరూ మహిళలు పనిచేయగా వచ్చిన చిత్రం ‘చిన్నారి పాపలు’ (1968)లో స్క్రీన్‌ప్లే రచయితగా సరోజిని భాగస్వామ్యం కూడా ఉంది.


* ప్రముఖ నటుడు జగతిబాబు తండ్రి వి.బి.రాజేంద్ర ప్రసాద్‌ స్థాపించిన జగపతి ఆర్ట్స్‌ పిక్చర్స్‌కు ఆస్థాన దర్శకుడీయన. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి రవీంద్ర ఆర్ట్‌ పిక్చర్స్‌ ప్రారంభించాక తొలి రెండు చిత్రాలు ‘లక్షాధికారి’, ‘జమిందార్‌’లకు దర్శకుడు కూడా మధుసూదనరావే. నటుడు శోభన్‌బాబు గురువుగా అభిమానించేవారు. ‘వీరాభిమన్యు’తో శోభన్‌కు తొలి వందరోజుల చిత్రాన్ని అందించి స్టార్‌డం తీసుకువచ్చారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషనులో ‘మనుషులు మారాలి’, ‘జేబుదొంగ’, ‘మల్లెపూవు’, ‘కల్యాణమంటపం’ తదితర 13 చిత్రాలు వచ్చాయి. ఇందులో పది చిత్రాలు హిట్‌. కల్యాణమంటపం చిత్రాన్ని మధుసూదనరావే నిర్మించారు. నటి కాంచనకు సైతం ఆయన ఎక్కువ అవకాశాలు ఇచ్చారు.


* ఏఎన్నార్‌తో దాదాపు 20 సినిమాలు తీసిన మధుసూదనరావు ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆత్మీయులు లాంటి చిత్రాలతో ఆయనకు ఘన విజయాలు అందించారు. ఇందులో ‘అంతస్తులు’ (1967) ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకొంది. ‘పవిత్రబంధం’ (1971) చిత్రంలో ఆ రోజుల్లోనే మధుసూదనరావు చిత్రీకరించిన ‘గాంధి పుట్టిన దేశమా ఇది.. నెహ్రు కోరిన సంఘమా ఇది’ అనే ఆరుద్ర గీతం తనలోని అభ్యుదయ భావాలకు ప్రతీక.

జి.ఎస్‌.జమీర్‌ హుసేన్‌, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని