ఏఎన్నార్‌కి ఇచ్చే నిజమైన నివాళి అదే

‘‘సినిమా రంగంలో విలువలు పాటించిన మహావ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. నాకు తెలిసి చివరి రోజుల వరకూ నటించింది ఆయనొక్కరే. భావి తరాలు నేర్చుకోదగ్గ విలువలు, సంప్రదాయాల్ని పాటించారు. ఆ మార్గాన్ని అనుసరించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి’’ అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు.

Updated : 21 Sep 2023 07:35 IST

‘‘సినిమా రంగంలో విలువలు పాటించిన మహావ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. నాకు తెలిసి చివరి రోజుల వరకూ నటించింది ఆయనొక్కరే. భావి తరాలు నేర్చుకోదగ్గ విలువలు, సంప్రదాయాల్ని పాటించారు. ఆ మార్గాన్ని అనుసరించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి’’ అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. ఆ భాష, ఆ వేషం, ఆ నటన, ఆ వ్యక్తిత్వం... వీటిలో కొంతైనా అంది పుచ్చుకోవాలని  ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ప్రారంభమైన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం హాజరైన ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులని ఉద్దేశించి వెంకయ్యనాయుడు ప్రసంగించారు.

మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

‘‘అక్కినేని నాగేశ్వరరావు సజీవ శిల్పాన్ని చెక్కిన శిల్పులకి అభినందనలు. నాగేశ్వరరావే ఉన్నారా! అన్నట్టుగా జీవకళ ఉట్టిపడుతోంది. ఆయన మహానటులు, మహామనిషి. నాకు వ్యక్తిగతంగానూ పరిచయం ఉంది. చక్కటి తెలుగు మాట్లాడేవారు. అదే సంప్రదాయాన్ని వారి కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు కనుమరుగవుతోందనే భయం కలుగుతోంది. తెలుగు భాషా ప్రోత్సాహానికి పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి తరుణంలో మనందరం కూడా ఏఎన్నార్‌ జీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. తెలుగు భాషపై ఎంతో మక్కువ ఆయనకి. భాష పోతే మన శ్వాసే పోతుంది. ఒక అలవాటుగా, పట్టుదలగా ప్రతి ఒక్కరూ ఇంట్లో, వీధిలో, గుడిలో  అమ్మ ఒడి నుంచి వచ్చిన భాషని మాట్లాడుకోవల్సిన అవసరం ఉంది. భాష పరిరక్షణకి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడితే చాలు. అలాగే ఏ రంగంలో ఉన్నప్పటికీ విలువలు పాటించాలి. అవి పాటించడం కూడా కష్టమైన పనేమీ కాదు. విలువలకి సజీవ దర్పణం అక్కినేని. ప్రేమ, అభిమానం, వాత్సల్యంతో పిల్లల్ని పెంచారు. ఇప్పుడు వాళ్ల వేషభాషలు సంప్రదాయ పద్ధతుల్లోనే ఉన్నాయి. గుడివాడ ప్రాంతంలో అటూ ఇటూ పుట్టిన ఇద్దరు మహావ్యక్తులు మహానటులు అయ్యారు. తెలుగు సినిమా కళారంగానికి రెండు కళ్లలాగా ఒకరు ఎన్టీఆర్‌, మరొకరు ఏఎన్నార్‌.

నాగేశ్వరరావు గొప్పతనం ఎప్పటికప్పుడు తన జీవితాన్ని మదింపు చేసుకోవడం. ఎలాంటి సినిమా అయినా అందులో ఒదిగిపోయేలా నటించి, పాత్రకి సజీవ దర్పణంలా నిలిచేవారు. ఒక పెద్ద నటనా విశ్వవిద్యాలయం ఏఎన్నార్‌. సినిమా రంగంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థిననుకుని ఆ గుణ గణాల్ని, లక్షణాల్ని కొంత అందిపుచ్చుకుంటే చాలు... వాళ్ల జీవితాల్ని మెరుగు పరుచుకున్నట్టే’’.

జవసత్వంతోనే వారసత్వం

‘‘అక్కినేని నాస్తికుడైనా కూడా పెద్ద తాత్వికుడు. వ్యక్తిగత జీవితంలో ఆడంబరాలు అతి అంచనాలతో కాకుండా వాస్తవ భౌతిక పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఉన్నత స్థానానికి వెళ్లిన విలక్షణ వ్యక్తి ఏఎన్నార్‌. తన సినిమాలతో సమాజానికి మంచి జరగకపోయినా, చెడు మాత్రం జరగకూడదని అక్కినేని నాగేశ్వరరావు బలంగా నమ్మారు. తన సినిమాల్లో సందేశం, విజ్ఞానం ఉండాలని భావించేవారు. ఆ స్ఫూర్తితోనే నేటితరం సినిమా తీయాలి, నటించాలి. ఈ మధ్య సినిమాల్లో వాడుతున్న భాష ఏమాత్రం బాగోలేదు. విపరీతార్థాలు,  ద్వంద్వార్థాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సంభాషణలతో యువతరాన్ని, మన కుటుంబ వ్యవస్థని నాశనం చేసుకుంటామనే విషయాన్ని దర్శకులు రచయితలు గుర్తిస్తే మంచిది. రాజకీయాల్లో వారసత్వానికి వ్యతిరేకం. సినిమా, వైద్యం, సేవ రంగాల్లో వారసత్వాన్ని ప్రోత్సహిస్తా. కష్టపడితే వస్తుంది ఆ వారసత్వం ఊరికే రాదు. వారసత్వం కావాలంటే జవసత్వం ఉండాలి. అవన్నీ ఒనగూర్చుకుని అక్కినేని వారసులు నిలబెడుతున్నారు. వారందకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా’’ అన్నారు వెంకయ్యనాయుడు.

ఈ కార్యక్రమంలో ఏఎన్నార్‌ కుటుంబ సభ్యులతోపాటు, సినీ ప్రముఖులు మోహన్‌బాబు, బ్రహ్మానందం, జయసుధ, రాజేంద్రప్రసాద్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్‌, రామ్‌చరణ్‌, జగపతిబాబు, శ్రీకాంత్‌, అల్లు అరవింద్‌, అశ్వినీదత్‌, దిల్‌రాజు, మురళీమోహన్‌, సుబ్బరామిరెడ్డి. సి.కల్యాణ్‌, ఎస్‌.రాధాకృష్ణ, ఎస్‌.గోపాల్‌రెడ్డి, అనుపమ్‌ ఖేర్‌, నాజర్‌, మంచు విష్ణు, నాని, వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు కామినేని శ్రీనివాస్‌, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


మా గుండెల్ని ప్రేమతో నింపారు నాన్న

- నాగార్జున

‘‘ఎవరి విగ్రహమైనా చూస్తే వాళ్లు మహానుభావులు, మనతో లేరనే అభిప్రాయం నాకు చిన్నప్పట్నుంచే కలిగింది. ఆ విగ్రహం చూసినప్పుడల్లా మనల్ని వదిలేసి వెళ్లిపోయారని అనిపిస్తుంటుంది. అందుకే ఆవిష్కరణ వరకూ నాన్న విగ్రహం చూడలేదు. నాన్న మాతో లేరనేది ఇక నేను స్వీకరించాలి. శిల్పి వినీశ్‌ విగ్రహాన్ని  అద్భుతంగా చెక్కారు. నాన్న అద్భుతమైన జీవితాన్ని గడిపారు. ఏఎన్నార్‌ అనగానే తరతరాలు గుర్తు పెట్టుకునే పాత్రల్ని చేసిన నటులు... భారతదేశం ఎన్నో రకాలుగా  సత్కరించిన నటులు. కోట్లమంది తెలుగు ప్రజలు, అభిమానులు ప్రేమించిన వ్యక్తి. మాకు మాత్రం మా గుండెల్ని ప్రేమతో నింపిన వ్యక్తి. నాకే కాదు, నా తోబుట్టువులు, పిల్లల్ని చల్లగా చూసిన వ్యక్తి, ఇంటికి వెళ్లినప్పుడల్లా చిరునవ్వుతో మమ్మల్ని దగ్గరికి తీసుకునేవారు మా నాన్నగారు. మాకు మనసు బాగున్నా, బాగోలేకపోయినా ఆయన దగ్గరికి వెళ్లేవాళ్లం. మనసు ప్రశాంతంగా అనిపించేది. నాన్నకి బాగా నచ్చిన ప్రదేశం అన్నపూర్ణ స్టూడియోస్‌. నచ్చిన ప్రదేశంలో విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ట చేసినట్టు అంటారు. ఆయన అలాగే ప్రాణంతో మా మధ్య ఉన్నారని, మా మధ్యే నడుస్తున్నారని అనుకుంటాం’’ అన్నారు. +

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని