కామెడీనే కాదు... అంతకుమించి చేశానన్నారు

‘‘ప్రతి సినిమాతో నటుడిగా నన్ను నేను ఎంతో కొంత కొత్తగా ఆవిష్కరించుకోవల్సిందే. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తో ఆ ప్రయత్నం మరోసారి విజయవంతమైంది’’ అన్నారు నవీన్‌ పొలిశెట్టి.

Updated : 22 Sep 2023 07:13 IST

‘‘ప్రతి సినిమాతో నటుడిగా నన్ను నేను ఎంతో కొంత కొత్తగా ఆవిష్కరించుకోవల్సిందే. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తో ఆ ప్రయత్నం మరోసారి విజయవంతమైంది’’ అన్నారు నవీన్‌ పొలిశెట్టి. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’తో సత్తా చాటిన ఆయన... ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తోనూ మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా నవీన్‌ పొలిశెట్టి గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘ఒక సినిమా కోసం రెండున్నరేళ్లకి పైగా ప్రయాణం చేయడం అంటే ఆషామాషీ కాదు. చిత్రబృందంలోని అందరిలోనూ అన్ని రోజులు అదే ఉత్సాహం కొనసాగడం కష్టం. కానీ మేం ఆ కష్టాలన్నిటినీ దాటుకుని ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ని పూర్తి చేశాం. ప్రేక్షకులు ఇప్పుడు ఇచ్చిన తీర్పే వస్తుందని మాకు ముందే తెలుసు. కానీ ‘జవాన్‌’తో పాటే మా సినిమా విడుదలవుతుందని తెలిసినప్పుడు భయమేసింది. ఇలాంటి సినిమాలు ఒంటరిగా ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ మాకు కుదరలేదు. ఇది సరైన సమయం కాదని చాలా మంది భయపెట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు మా మొహాల్లో నిజమైన నవ్వు కనిపిస్తోంది. ప్రేక్షకుల నోటి మాటతోనే సినిమాకి ఇంత పెద్ద విజయం దక్కింది’’.


  • ‘‘ఈ పదేళ్ల కాలంలో వచ్చిన అత్యుత్తమమైన ప్రేమకథ ఇదే అనే ప్రశంస ఎంతో సంతృప్తినిచ్చింది. మా చిత్రాన్ని మొట్ట మొదట చూసింది అగ్ర కథానాయకుడు చిరంజీవి. సినిమా చూశాక ఆయన ఇంటికి పిలిచి రెండు గంటలు మాట్లాడారు. నేను చిరంజీవి సర్‌ని కలిసింది అదే తొలిసారి. ఆయనకి సినిమా ఎంత నచ్చిందంటే చూసి... ‘ట్వీట్‌ పెట్టొచ్చా’ అని అడిగారు. ఆయన్ని తొలిసారి కలిసిన ఆనందంలో నేనుంటే, ఆయన నా నటన గురించి చెబుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అప్పుడే నాలో మరింత ధైర్యం కలిగింది’’.

  • ‘‘యూ ట్యూబ్‌లో నేను చేసిన షోలు నాపై పెట్టుబడి పెట్టేందుకు నిర్మాత ముందుకొచ్చేలా చేశాయి. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నటుడిగా నా పరిధిని పెంచింది. ‘జాతిరత్నాలు’ విజయం పరిశ్రమలో నాపై నమ్మకాన్ని మరింతగా  పెంచింది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాతో నవీన్‌ కామెడీ ఒక్కటే కాదు, అంతకుమించి చేశాడనే పేరొచ్చింది. ఇలా మూడు విజయాలు మూడు  భిన్నమైన అనుభవాల్నిచ్చాయి’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని