కొత్త లుక్కు.. అదిరే కిక్కు

కొత్తదనానికి పట్టం కడుతున్నారు ఈతరం ప్రేక్షకులు. వాళ్ల అభిరుచుల్లో మార్పును కథానాయకులు గౌరవిస్తున్నారు. అందుకే ఓ వైపు కథలతోనూ.. మరోవైపు ఆహార్యాలతోనూ కొత్తదనం పంచే ప్రయత్నం చేస్తున్నారు.

Updated : 23 Sep 2023 07:04 IST

వైవిధ్యమైన గెటప్పులతో సిద్ధమవుతోన్న తారలు

కొత్తదనానికి పట్టం కడుతున్నారు ఈతరం ప్రేక్షకులు. వాళ్ల అభిరుచుల్లో మార్పును కథానాయకులు గౌరవిస్తున్నారు. అందుకే ఓ వైపు కథలతోనూ.. మరోవైపు ఆహార్యాలతోనూ కొత్తదనం పంచే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా సినిమాకీ వైవిధ్యత ప్రదర్శిస్తూ సినీప్రియుల్ని మురిపిస్తున్నారు. ఇప్పుడీ పంథాలోనే ప్రస్తుతం తెలుగులో పలువురు హీరోలు నయా గెటప్పులతో కిక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరి వారెవరు? వారి చిత్ర విశేషాలేంటి? చదివేద్దాం.

ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే చూసే ప్రేక్షకులకే కాదు.. చేసే నటులకు కూడా మొహం మొత్తేస్తుంది. చేసే పనితో కిక్‌ ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు వైవిధ్యత ప్రదర్శించాల్సిందే. వీలైతే ఓ కొత్త కథ.. దానికి తగ్గట్లు ఓ సరికొత్త గెటప్పు... ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఈ మాత్రం మ్యాజిక్కు చేస్తే చాలు. కానీ, కొన్నేళ్ల క్రితం వరకు ఈ తరహా ప్రయోగాలకు అగ్రతారలు దూరంగా ఉండేవారు. కథల ఎంపిక నుంచి తెరపై కనిపించే తీరు వరకు ఓ మూస ధోరణి కనిపించేది. కానీ, ఈ మధ్య సీన్‌ పూర్తిగా మారింది. కథానాయకులు చేసే ప్రతి చిత్రం ఓ కొత్తరకమైన ఆహార్యాన్ని, స్టైల్‌ను కోరుకుంటోంది. దీంతో అప్రయత్నంగానే సినిమా సినిమాకీ గెటప్పుల్లో వైవిధ్యత కనిపిస్తోంది.


మాసీ హెయిర్‌ స్టైల్‌తో నాగార్జున

అగ్ర కథానాయకుడు నాగార్జున కొన్నేళ్లుగా తెరపై ఒకే తీరులో కనిపిస్తూ వస్తున్నారు. వేషధారణ విషయంలో ప్రయోగాలు చేసింది చాలా తక్కువే. అందుకే కొత్తదనం పంచేందుకు ‘నా సామిరంగ’తో సరికొత్త లుక్కులోకి మారిపోయారు నాగ్‌. మాసీ హెయిర్‌ స్టైల్‌, గెడ్డంతో మునుపెన్నడూ చూడని ఊర మాస్‌ అవతారంలో కనిపించి ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఇదొక పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా చిత్రం కావడం.. మాస్‌ అంశాలకు ప్రాధాన్యత ఉండటం.. వస్త్రధారణ మొదలుకొని, లుక్కు వరకు అన్నింటిలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నృత్య దర్శకుడు విజయ్‌ బిన్నీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


మత్స్యకారుడిలా చైతూ..

కొన్ని చిత్రాలు నటుల నుంచి చాలానే డిమాండ్‌ చేస్తుంటాయి. మేనరిజమ్‌ మొదలుకొని.. మాట్లాడే భాష, యాస, గెటప్పు.. ఇలా అన్ని విషయాల్లోనూ మార్పు కోరుకుంటాయి. ముఖ్యంగా వాస్తవిక గాథల్లో వీటికి ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంటుంది. ప్రస్తుతం నాగచైతన్య కూడా ఇలాంటి ఓ కథతోనే ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. చందూ మొండేటి తెరకెక్కించనున్న కొత్త చిత్రం కోసమే ఈ ప్రయత్నమంతా. మత్స్యకారుల జీవితాలకు అద్దం పట్టే ఓ యథార్థ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. దీనికోసం వేషధారణ మొదలుకొని.. భాష, యాస, వ్యవహార శైలి వరకు తనని తాను పూర్తిగా మార్చుకుంటున్నారు చైతన్య. గుబురు జుట్టు, గెడ్డంతో మాస్‌ లుక్కులోకి మారుతున్నారు. ఇప్పటికే సిక్కోలు మత్స్యకారుల్ని కలిసి.. వారి జీవన స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, మాట్లాడే తీరు అన్నీ స్వయంగా తెలుసుకున్నారు.


‘మట్కా’ కోసం వరుణ్‌

‘గద్దలకొండ గణేష్‌’లో ఊర మాస్‌ లుక్‌లో కనిపించి.. ప్రేక్షకుల్ని అలరించారు హీరో వరుణ్‌ తేజ్‌. ఇప్పుడాయన మరోసారి ‘మట్కా’ కోసం అదే ప్రయత్నం చేయనున్నారు. కరుణ కుమార్‌ రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. 60వ దశకం నేపథ్యంలో.. వైజాగ్‌ పోర్టు కేంద్రంగా నడిచే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోంది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఇందులో వరుణ్‌ మునుపెన్నడూ చూడని విధంగా నాలుగు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.


యోధుడిలా నిఖిల్‌

‘కార్తికేయ2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు హీరో నిఖిల్‌. ఇప్పుడాయన ‘స్వయంభూ’ అనే పీరియాడిక్‌ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. భరత్‌ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం నిఖిల్‌ కండలతో పాటు జుట్టు పెంచి ఓ యోధుడి అవతారంలోకి మారారు. ఈ పాత్ర కోసం ప్రస్తుతం మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీతో పాటు వివిధ ఆయుధాలు ఉపయోగించడంలో వియత్నాంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.


రా.. రస్టిక్‌గా  చరణ్‌!

కథలు డిమాండ్‌ చేసినా.. చేయకున్నా వీలైనంత వరకు ప్రతి చిత్రంలోనూ ఓ కొత్త లుక్కుతో ప్రేక్షకుల్ని మురిపించే ప్రయత్నం చేస్తుంటారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రెండు భిన్నమైన లుక్స్‌లో కనిపించి అలరించిన ఆయన.. ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’లోనూ రెండు గెటప్పులతో కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీని తర్వాత ఆయన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఓ రా.. రస్టిక్‌ కథ సిద్ధం చేసినట్లు బుచ్చిబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ కథకు తగ్గట్లుగానే సినిమాలో చరణ్‌ ఆహార్యం సరికొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా డిసెంబరు లేదా జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని