వెండితెర చంద్రిక.. వహీదాకు ఫాల్కే పురస్కారం

తమిళనాట పుట్టి... తెలుగు సినిమాతో నటిగా వెండితెరపై అడుగుపెట్టి.. హిందీ చిత్రసీమను ఏలిన అందాల అభినేత్రి వహీదా రెహమాన్‌ (85). అయిదు దశాబ్దాలపాటు భారతీయ సినీ ప్రేక్షకుల్ని అలరించి, చిత్రసీమకు ఆమె చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును మంగళవారం ప్రకటించింది.

Updated : 27 Sep 2023 06:50 IST

తెలుగు సినిమాతో నటిగా పరిచయం..
బాలీవుడ్‌ అగ్రనాయకిగా ప్రస్థానం

దిల్లీ: తమిళనాట పుట్టి... తెలుగు సినిమాతో నటిగా వెండితెరపై అడుగుపెట్టి.. హిందీ చిత్రసీమను ఏలిన అందాల అభినేత్రి వహీదా రెహమాన్‌ (85). అయిదు దశాబ్దాలపాటు భారతీయ సినీ ప్రేక్షకుల్ని అలరించి, చిత్రసీమకు ఆమె చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును మంగళవారం ప్రకటించింది. ఏఎన్నార్‌ నటించిన తెలుగు చిత్రం ‘రోజులు మారాయి’ (1955)తో వెండితెరపై మెరిసిన వహీదా.. అందులో ‘ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా..’ అనే పాటకు చేసిన నృత్యం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి ‘జయసింహ’లో నటించాక.. హిందీ చిత్రసీమలోకి ఆమె అడుగు పెట్టారు. కొంత విరామం తర్వాత ‘బంగారు కలలు’, ‘సింహాసనం’, ‘చుక్కల్లో చంద్రుడు’ వంటి తెలుగు సినిమాల్లోనూ వహీదా నటించారు. తెలుగు చిత్రంతో పరిశ్రమకు పరిచయమైనా హిందీలోనే ఎక్కువగా నటించి కొన్నేళ్లపాటు బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా కొనసాగారు. ‘ప్యాసా’, ‘కాగజ్‌ కే ఫూల్‌’, ‘కాలా బాజార్‌’, ‘బాత్‌ ఏక్‌ రాత్‌ కీ’, ‘సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌’, ‘నీల్‌కమల్‌’, ‘చౌదవీ కా చాంద్‌’, ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’, ‘సీఐడీ’, ‘ఖామోశీ’ ఇలా ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. ‘రేష్మా ఔర్‌ షేరా’తో తన నటనను శిఖరాగ్రానికి తీసుకెళ్లిన వహీదా అందులోని పాత్రకు జాతీయ ఉత్తమనటిగా ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం నుంచి 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ అవార్డులను స్వీకరించారు. ‘శగున్‌’ చిత్రంలో ఆమెతో కలిసి నటించిన కమల్‌జీత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వహీదాకు ఇద్దరు పిల్లలు. కుటుంబమంతా బెంగళూరులో స్థిరపడ్డా.. భర్త మరణానంతరం ఆమె ముంబయికి తిరిగి వచ్చారు.

భారతీయ సినిమాకు పర్యాయపదం : అనురాగ్‌ ఠాకుర్‌

వహీదా రెహమాన్‌ ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ పురస్కారానికి ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ మంగళవారం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ‘‘భారతీయ సినీరంగ అభ్యున్నతికి తన నటనతో విశేష సేవలందించిన ప్రఖ్యాత నటి వహీదా రెహమాన్‌కు ఈ సంవత్సరం దాదాసాహెబ్‌ ఫాల్కే లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది’’ అన్నారాయన. పార్లమెంటులో నారీశక్తి వందన్‌ అధినియమ్‌ మహిళాబిల్లు ఆమోదం పొందిన ఈ సమయంలోనే.. భారతీయ సినిమాకు పర్యాయపదంలా నిలిచిన దిగ్గజ నటికి ఈ అవార్డు దక్కడం ముదావహమంటూ ఈ సందర్భంగా వహీదాకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.


ఆమెది చెరగని అధ్యాయం : మోదీ

హీదా రెహమాన్‌.. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపికవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘నటనలో ఆమె ప్రతిభ అనన్య సామాన్యం. భారతీయ సినిమా చరిత్రలో ఆమె ప్రయాణం ఒక చెరగని గుర్తు. సినిమా వారసత్వంలో వహీదా ఒక మర్చిపోలేని అధ్యాయం. ఆమెకు నా శుభాకాంక్షలు’’ అని కొనియాడారు.


మరింత ఆనందం: వహీదా రెహమాన్‌

నేను చాలా సంతోషంగా.. రెట్టింపు ఆనందంలో ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు నా సహనటుడు దేవానంద్‌ శతజయంతి. ఆ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ పురస్కారానికి ఎంపిక కావడం గర్వంగా ఉంది. ప్రభుత్వం నన్ను గౌరవమైన పురస్కారానికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు’’ అని చెప్పారు వహీదా రెహమాన్‌. ఈ అవార్డును తాను ఊహించలేదన్నారు. ‘‘రెండేళ్లుగా సినిమాల్లో నటించడం లేదు. నేను ఎప్పుడూ ఏ అవార్డునూ ఆశించలేదు. ఈ పురస్కారం నాకు సరైనదని ప్రభుత్వం భావిస్తే తీసుకుంటాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని