విలువైనవెప్పుడూ సవాళ్లతోనే నిండి ఉంటాయి

‘డీజే టిల్లు’లో రాధికగా యువతరాన్ని ఆకట్టుకుంది నేహా శెట్టి. ఇప్పుడు కిరణ్‌ అబ్బవరంతో కలిసి ‘రూల్స్‌ రంజన్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఇద్దరూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రత్నం కృష్ణ తెర కెక్కించారు.

Updated : 03 Oct 2023 07:20 IST

‘డీజే టిల్లు’లో రాధికగా యువతరాన్ని ఆకట్టుకుంది నేహా శెట్టి. ఇప్పుడు కిరణ్‌ అబ్బవరంతో కలిసి ‘రూల్స్‌ రంజన్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఇద్దరూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రత్నం కృష్ణ తెర కెక్కించారు. ఎ.ఎం.రత్నం  సమర్పిస్తున్నారు. సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో సోమవారం విలేకర్లతో ముచ్చటించింది నేహా.

‘డీజే టిల్లు’తో మీ కెరీర్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. దాన్నెలా చూస్తారు?

‘‘నా తొలి చిత్రం ‘మెహబూబా’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత నేను న్యూయార్క్‌ వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నా. మళ్లీ ఎన్నో ఆశలతో భారత్‌కు తిరిగొచ్చా. కానీ, కొవిడ్‌ లాక్‌డౌన్‌ వల్ల తెరపై కనిపించడానికి మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చింది. అప్పుడే నాకు ‘డీజే టిల్లు’లో రాధిక పాత్ర చేసే అవకాశమొచ్చింది. ఆ చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకులు ఆ పాత్రతో బాగా కనెక్ట్‌ అయ్యారు. నేను ఎక్కడ కనిపించినా నేహా అని కాకుండా రాధిక పాత్ర పేరుతో పిలవడం ప్రారంభించారు. వాస్తవానికి రాధికది ఓ గమ్మత్తైన పాత్ర. దాని విషయంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే ప్రేక్షకులు నన్ను అసహ్యించుకునేవారు. ఏదేమైనా ఇంత తక్కువ సమయంలో నేను సాధించిన దాని పట్ల చాలా సంతోషంగా.. కృతజ్ఞతతో ఉన్నా. అయితే నేనింకా సాధించాల్సింది చాలా ఉందని భావిస్తున్నా’’.

ఈ చిత్ర విషయంలో మీకు సవాల్‌గా అనిపించిన అంశాలేంటి?

‘సమ్మోహనుడా’ పాటకు డ్యాన్స్‌ చేయడమే అత్యంత సవాల్‌గా అనిపించింది. మీరు ఆ పాటను గమనిస్తే.. దాంట్లో నేను వర్షంలో, మంటల మధ్య, కొలనులో, పువ్వుల మధ్య నృత్యం చేయడం కనిపిస్తుంది. ఆ చిత్రీకరణంతా చాలా కఠినంగా అనిపించింది. అయితే విలువైనవెప్పుడూ సవాళ్లతోనే నిండి ఉంటాయి. చివరికి నా శ్రమకు తగ్గ ఫలితం లభించింది. ఆ పాటతో నాకు గ్లామర్‌ గర్ల్‌ ఇమేజ్‌ వచ్చింది. ఈ పాట విజయంలో శ్రేయా ఘోషల్‌ వాయిస్‌, అమ్రిష్‌ సంగీతం ప్రధాన పాత్ర పోషించాయి’’.

కథల ఎంపికలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎలాంటి జానర్లు ఇష్టపడతారు?

‘‘ప్రస్తుతం నేను కథల ఎంపికలో కాస్త ఆచితూచే వ్యవహరిస్తున్నా. నేనెప్పుడూ నా పాత్ర కన్నా మొత్తం కథ ఎలా ఉందన్న దానిపైనే ప్రధానంగా దృష్టి పెడతా. ఆ తర్వాత దాంట్లో నా పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందన్నది చూసుకుంటా. నాకు వినోదాత్మక చిత్రాలంటే ఇష్టం. అలాగే యాక్షన్‌ సినిమాలూ చేయాలనుంది’’.

కొత్త చిత్ర విశేషాలేంటి?

విష్వక్‌ సేన్‌తో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో నటిస్తున్నా. అదొక పీరియాడికల్‌ సినిమా. పల్లెటూరి యువతిగా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తా’’.

స్క్వేర్‌’లో మీరు అతిథి పాత్రలో కనిపించనున్నారట. నిజమేనా?

‘‘లేదు. ఇప్పటి వరకైతే ఏదీ ఖరారు కాలేదు. ‘డీజే టిల్లు’ చూశాక చాలా మంది ‘టిల్లు స్క్వేర్‌’లో మీరెందుకు చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు. నన్ను మరోసారి ఆ రాధిక పాత్రలో చూడాలని కోరుకుంటున్నారు. కానీ, సీక్వెల్‌ కథ వేరు. తొలి భాగానికి దీనికి సంబంధం లేదు. కాబట్టే నేను దీంట్లో భాగం కాలేదు’’.

‘రూల్స్‌ రంజన్‌’లో మీ పాత్ర ఎలా ఉంటుంది? కిరణ్‌తో సాగే లవ్‌ ట్రాక్‌ ఎంత కొత్తగా ఉంటుంది?

‘‘ఈ సినిమాలో నేను తిరుపతికి చెందిన సనా అనే పాత్రలో కనిపిస్తా. ‘డీజే టిల్లు’లో రాధికలాగా సనాది స్వార్థపూరిత పాత్ర కాదు. ఆమె చాలా సాహసోపేతమైనది. ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటుంది. ఈ చిత్రంలో ప్రేమకథ చాలా భిన్నంగా.. ఆకర్షణీయంగా ఉంటుంది. సంఘర్షణ కొత్తగా అనిపిస్తుంది. అలాగే మంచి వినోదం ఉంది. కచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని