క్లాప్‌...క్లాప్‌

నాణ్యమైన తెలుగు కథలకి కేరాఫ్‌గా మారింది ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌. ఈ వేదిక నుంచి అలరించడమే లక్ష్యంగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ యూ ట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్, మలయాళ కథానాయిక అనఘా అజిత్‌ జంటగా ఆ చిత్రం రూపొందుతోంది.

Published : 13 Jun 2024 00:38 IST

నాణ్యమైన తెలుగు కథలకి కేరాఫ్‌గా మారింది ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌. ఈ వేదిక నుంచి అలరించడమే లక్ష్యంగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ యూ ట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్, మలయాళ కథానాయిక అనఘా అజిత్‌ జంటగా ఆ చిత్రం రూపొందుతోంది. పవన్‌ సుంకర దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీధర్‌ మారిసా నిర్మాత. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందించగా, ప్రవీణ్‌ కాండ్రేగుల క్లాప్‌నిచ్చారు. బెక్కం వేణుగోపాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సుబ్బు.కె, అవినాష్‌ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఆమని, ఆర్జే శరణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కృష్ణచేతన్, ఛాయాగ్రహణం: అనూష్‌ కుమార్‌. 


వెండితెరపై తొలి మహిళా ఐపీఎస్‌ అధికారి జీవితం

భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిణిగా సేవలందించిన కిరణ్‌ బేదీ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ‘బేదీ: ది నేమ్‌ యు నో. ది స్టోరీ యు డోంట్‌’ అనే టైటిల్‌తో ఆమె బయోపిక్‌ రానుంది. కుషాల్‌ చావ్లా దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్‌ స్లేట్‌ పిక్చర్స్‌ పతాకంపై గౌరవ్‌ చావ్లా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది చిత్రబృందం. ‘ఇది కేవలం నా కథ కాదు. భారతదేశంలో పెరిగి, చదువుకొని, భారతీయ ప్రజల కోసం పనిచేసిన ప్రతి ఒక్క స్త్రీ కథ. నా జీవిత కథ తొమ్మిదేళ్ల వయసులోనే ప్రారంభమైంది. మా అమ్మ, నాన్న చెప్పిన మాటలే మార్గదర్శక సూత్రాలుగా భావించాను’ అంటూ ఓ ప్రకటనలో తెలిపారు కిరణ్‌. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 


ప్రేమ గోదారి

హాస్యనటుడు అలీ సోదరుడి తనయుడు సదన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రణయ గోదావరి’. ప్రియాంక ప్రసాద్‌ కథానాయిక. పి.ఎల్‌.విఘ్నేష్‌ దర్శకుడు. పారమళ్ల లింగయ్య నిర్మాత. ఈ సినిమా పేరుతో కూడిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని అంబర్‌పేట్‌ శంకర్‌ ఆవిష్కరించారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేమకథతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. గోదావరికీ, ఓ జంట ప్రేమకీ మధ్య సంబంధం ఏమిటనేది తెరపైనే చూడాలి. నాకు ఇష్టమైన అంబర్‌పేట్‌ శంకర్‌ చేతులమీదుగా పోస్టర్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో యాదయ్యగౌడ్, కాలే రమేశ్, వరికుప్పల వెంకట్‌ రాములు, నాగుల ఆనంద్‌ కుమార్‌ నేత, గోదాస్‌ జగన్, పసుల లక్ష్మయ్య, చిన్నోళ్ల రాజశేఖర్, శివ, మహేశ్, గంట శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఆ సంఘర్షణే మా చిత్రం

‘‘థ్రిల్లర్‌ సినిమాల్లో ఇప్పటికీ గుర్తు పెట్టుకునే ఓ మైలురాయి తరహా సినిమా... ‘అన్వేషణ’. ఆలాంటి ఓ విభిన్నమైన థ్రిల్లర్‌ కథని... మనకు తెలిసిన పాత్రలతో చెప్పే ప్రయత్నమే నేను చేశా’’ అన్నారు ప్రకాశ్‌ దంతులూరి. ‘ఓం శాంతి’తో మెగాఫోన్‌ చేతపట్టిన ఆయన... సుదీర్ఘ విరామం తర్వాత -  చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, భరత్‌ రాజ్, ఆషురెడ్డి ప్రధాన పాత్రధారులుగా ‘యేవమ్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 14న రానున్న సందర్భంగా ప్రకాశ్‌ దంతులూరి బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ‘‘నేటి సమాజంలో వ్యక్తుల్ని చూసి రాసుకున్న పాత్రలే ఇవి. సమాజంలో మహిళల అవసరాలు, వాళ్ల భావోద్వేగాల్ని వ్యక్త పరిచే విధానం ఒకలా ఉంటే, మగాళ్లు వ్యక్త పరిచే విధానం మరోలా ఉంటుంది. కానీ అంతిమంగా ఆ ఇద్దరూ కోరుకునేది ఒక్కటే.. సుఖం, శాంతి. ఈ కథలో ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు అనేది ప్రేక్షకులే తేల్చుకుంటారు’’ అన్నారు.


ప్రేమ ప్రయాణం

డార్లింగ్‌ కృష్ణ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘లవ్‌ మాక్‌టైల్‌ 2’ ఈ నెల 14న విడుదల కానుంది. మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రేచల్‌ డేవిడ్, నకుల్‌ అభయాన్కర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.వి.ఆర్‌ కృష్ణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కన్నడలో డార్లింగ్‌ కృష్ణ తెరకెక్కించిన వరుస చిత్రాలు ‘లవ్‌ మాక్‌టైల్‌’, ‘లవ్‌ మాక్‌టైల్‌2’ చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఓ జంట ప్రేమ ప్రయాణం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ‘లవ్‌ మాక్‌టైల్‌ 2’ చూశాక నాకూ ఎంతగానో నచ్చింది. నేను, పంపిణీదారులు ఎంతో ఇష్టపడి ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నకుల్‌ అభయాంకర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని