స్ఫూర్తి నింపే మూర్తి

భావోద్వేగాలతో కూడిన ఓ స్ఫూర్తిదాయకమైన కథని చెప్పాలనే ప్రయత్నమే ‘మ్యూజిక్‌షాప్‌ మూర్తి’ చిత్రం అన్నారు శివ పాలడుగు. ఆయన దర్శకత్వంలో... అజయ్‌ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది.

Published : 13 Jun 2024 00:41 IST

భావోద్వేగాలతో కూడిన ఓ స్ఫూర్తిదాయకమైన కథని చెప్పాలనే ప్రయత్నమే ‘మ్యూజిక్‌షాప్‌ మూర్తి’ చిత్రం అన్నారు శివ పాలడుగు. ఆయన దర్శకత్వంలో... అజయ్‌ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శివ పాలడుగు బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. 

‘‘కన్న కలల్ని సాకారం చేసుకునే క్రమంలో ఓ వ్యక్తికి ఎదురైన అనుభవాలే ఈ చిత్రం. తనకి తెలిసిన ప్రపంచంలోనే మరో అడుగు ముందుకు వేయాలనుకున్నప్పుడు యాభయ్యేళ్ల వ్యక్తి జీవితంలో ఎదురైన సంఘర్షణలు ఎలాంటివి? ఆ కలల్ని నిజం చేయడానికి ఓ యువతి ఎలా సాయపడింది? ఆమె ప్రయాణంలో పదనిసలు ఎలాంటివనేదే ‘మ్యూజిక్‌షాప్‌ మూర్తి’ కథ. ఏదో సందేశం చెప్పాలని చేసిన చిత్రమేమీ కాదు. కానీ పాత్రల ప్రయాణం ప్రేక్షకుల్లో స్ఫూర్తిని పంచుతుంది. సంగీతం నేపథ్యంలో సాగే కథ కావడంతో అందుకు తగినట్టుగా పరిశోధన చేసి కథ రాసుకున్నా. సినిమాలో సంగీతం కూడా వైవిధ్యంగా ఉంటుంది. నాటితరం సంగీతం, నేటి సంగీతంలో వచ్చిన మార్పులకి తగ్గట్టుగా పవన్‌ స్వరాలు సమకూర్చారు’’. 

‘‘కల్పిత కథే ఇది. కానీ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. మంచి కథ చెప్పాలి, అందులో బలమైన భావోద్వేగాలు ఉండాలనే లక్ష్యంతోనే రచన మొదలుపెట్టా. ప్రతి సన్నివేశం సహజంగా మనసుల్ని హత్తుకునేలా ఉంటుంది. ప్రధాన పాత్రధారిగా యాభయ్యేళ్ల వ్యక్తిని చూపించాలకున్నప్పుడు అజయ్‌ ఘోష్‌ మాత్రమే గుర్తొచ్చారు. ‘రంగస్థలం’ చూశాక ఆయన ఎంపిక సరైదనుకున్నా. అప్పటికి ‘పుష్ప’ కూడా విడుదల కాలేదు. అజయ్‌ ఘోష్‌ మేం అనుకున్నట్టుగా అద్భుతమైన భావోద్వేగాల్ని పంచారు. చాందినీ చౌదరి ఇందులో మరో కీలకమైన అంజన అనే యువతిగా కనిపిస్తారు. ఆమె పాత్రకీ ఎంతో ప్రాధాన్యం ఉంది. మ్యూజిక్‌ షాప్‌ మూర్తిని ప్రోత్సహించే ఆ పాత్ర, అలాగే ఆమని పాత్రలోని సంఘర్షణ ఈ చిత్రానికి ప్రధానబలం. ప్రేక్షకులకు చెప్పాల్సిన కథ ఇది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని